నీరు పారేదెలా?

ABN , First Publish Date - 2022-08-20T05:14:46+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) ఒంగోలు సర్కిల్‌ పరిధిలోని కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రత్యేకించి ప్రధాన కాలువల నుంచి పంట పొలాలకు నీరందించే మేజర్లు, మైనర్లు చిల్లచెట్లు, పిచ్చిచెట్లతో దారుణంగా ఉన్నాయి.

నీరు పారేదెలా?
శిథిలావస్థలో ఉన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువ కట్టపై దట్టంగా పెరిగిన చిల్లచెట్లు

అధ్వానంగా సాగర్‌ కాలువలు 

ఏళ్ల తరబడి మరమ్మతులు కరువు

నీటి పారుదలకు అడుగడుగునా ఆటంకాలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

నిధులు, ఖాళీ పోస్టుల భర్తీ పట్టించుకోని పాలకులు

పలుచోట్ల వృథాగా పోతున్న నీరు

రైతులు, సిబ్బందిపైనే అత్యవసర మరమ్మతుల భారం

దర్శి ఎన్నెఎస్పీ డివిజన్‌లో ప్రస్తుతం సాగర్‌ కాలువలకు నీరు పంపిణీ అవుతోంది. మేజర్లు, మైనర్లు అధ్వానంగా మారటంతో  నీరు ముందుకు సాగటం లేదు. చిల్లకంప కొట్టిన దాఖలాలు లేవు. దీంతో ఆయకట్టులోని అన్ని ప్రాంతాలకు సక్రమంగా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. 103మంది లస్కర్లకుగాను కేవలం 19మంది మాత్రమే ఉన్నారు. గతంలో మేజర్లు, మైనర్లపై పెరిగిన చిల్లచెట్లు, గడ్డిమొక్కలను లస్కర్లు తొలగించి బాగు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.

కురిచేడు సమీపంలోని సాగర్‌ ప్రధాన కాలువ 123వ మైలు సమీపంలో ఐనవోలు మేజరు ఉంది. దీన్ని 80 క్యూసెక్కుల నీటి పరిమాణంతో నిర్మించారు. ప్రస్తుతం కాలువలో 100 క్యూసెక్కుల మేర ప్రవహిస్తోంది. అర్ధరాత్రిళ్లు రైతులు మేజరు హెడ్‌ వద్ద షట్టర్లను పూర్తిగా ఎత్తి అధిక నీటిని విడుదల చేసుకుంటున్నారు. దీంతో చాలాచోట్ల నీరు కట్టల మీదుగా పారుతోంది. ఈ చర్యలతో బలహీనంగా ఉన్న చోట కట్టలు తెగే ప్రమాదం ఉంది. అంతేగాక కాలువ పైనుంచి నీరు పొంగి వాగుల్లోకి వృథాగా పోతోంది. కురిచేడు ఎన్నెస్పీ డివిజన్‌ పరిధిలో ఒక్క లస్కరు కూడా లేకపోవడం గమనార్హం.

దర్శి ఎన్నెఎస్పీ డివిజన్‌లో ప్రస్తుతం సాగర్‌ కాలువలకు నీరు పంపిణీ అవుతోంది. మేజర్లు, మైనర్లు అధ్వానంగా మారటంతో  ప్రవాహం ముందుకు సాగటం లేదు. చిల్లకంప కొట్టిన దాఖలాలు లేవు. దీంతో ఆయకట్టులోని అన్ని ప్రాంతాలకూ సక్రమంగా నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. 103మంది లస్కర్లకుగాను కేవలం 19మంది మాత్రమే ఉన్నారు. గతంలో మేజర్లు, మైనర్లపై పెరిగిన చిల్లచెట్లు, గడ్డిమొక్కలను లస్కర్లు తొలగించి బాగు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.

ఒంగోలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) ఒంగోలు సర్కిల్‌ పరిధిలోని కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రత్యేకించి ప్రధాన కాలువల నుంచి పంట పొలాలకు నీరందించే మేజర్లు, మైనర్లు చిల్లచెట్లు, పిచ్చిచెట్లతో దారుణంగా ఉన్నాయి. పదేళ్ల క్రితం కొన్ని కాలువల ఆధునికీకరణ పనులు చేసినా సరైన నిర్వహణ లేక దెబ్బతిన్నాయి. చాలాచోట్ల కాలువలకు అసలు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. అత్యధికం ప్రస్తుతం చిల్లచెట్లతో నిండిపోవడమే కాక కట్టలు గండ్లు, కోతలకు గురై దెబ్బతినిపోయాయి. అయితే కొద్దిపాటి మరమ్మతులు, చివరకు చిల్లచెట్ల తొలగింపునకు కూడా ఒక్క  రూపాయి ప్రభుత్వం విదల్చకపోవడంతో కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కాలువల నిర్వహణ, పంట భూములకు నీరు అందించడంలో కీలకమైన లస్కర్లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్ల పోస్టులు మూడొంతులు ఖాళీగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమైంది. కీలక సమయంలో రైతులే లస్కర్ల అవతారం ఎత్తి నీటిని పర్యవేక్షించుకోవాల్సిన వస్తుండగా అత్యవసర మరమ్మతులు, కాలువల నిర్వహణ భారం రైతులు, కిందిస్థాయి సిబ్బందిపైనే పడుతోంది. 


 ఇదీ పరిస్థితి..

ఎన్‌ఎస్‌పీ ఒంగోలు సర్కిల్‌ పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు, 25 మండలాల్లో మొత్తం 4.34 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో అధికారిక లెక్కల ప్రకారం 2.49 లక్షల ఎకరాలు ఆరుతడి కాగా.. 1.85 లక్షల ఎకరాలు మాగాణిగా ఉంది. ఒంగోలు సర్కిల్‌ ఎస్‌ఈ పరిధిలో దర్శి; చీమకుర్తి, అద్దంకి డివిజన్లుగా ఈఈ స్థాయి అధికారి పర్యవేక్షణలో నీటి సరఫరా జరుగుతోంది. అందులో సాగర్‌ కుడి ప్రధాన కాలువ జిల్లాలోకి ప్రవేశించే 85/3 మైలు వద్ద నుంచి 126వ మైలు వరకు ప్రధాన కాలువగా ఉండి అక్కడి నుంచి దర్శి బ్రాంచి కాలువగా మారి 16/7 మైలు వరకు దర్శి డివిజన్‌ పరిధిలో ఉంటుంది. అలాగే పమిడిపాడు బ్రాంచి కాలువ కూడా ఈ డివిజన్‌లోకి వస్తుంది. మొత్తంగా దర్శి డివిజన్‌ పరిధిలో ప్రధాన కాలువలే 105కి.మీ ఉండగా వాటికి అనుబంధంగా 35 మేజర్లు ఉన్నాయి. మేజర్లు 150 కి.మీ ఉండగా వాటికి అనుబంధంగా మైనర్‌ కాలువలు కూడా ఉన్నాయి. ఈ పరిధిలో 98వేల ఎకరాల ఆయ కట్టు ఉంది. ఇక చీమకుర్తి డివిజన్‌ పరిధిలో చూస్తే డీబీసీ 16/7 నుంచి ఒంగోలు బ్రాంచి కాలువ(ఓబీసీ) ప్రారంభమ వుతుంది. అక్కడి నుంచి రామతీర్థం రిజర్వాయర్‌ వరకు అక్కడి నుంచి ఈతముక్కల వరకు 53 కి.మీ ప్రధాన కాలువ ఉండగా దానికి అనుబంధంగా 66 మేజర్లు ఉన్నాయి. మేజర్‌ కాలువలు మొత్తం కలిపి 180 కిలోమీటర్లు ఉండగా దిగువకు మరిన్ని మైనర్‌ కాలువలు ఉన్నాయి. ఈ పరిధిలో సుమారు లక్షా 69వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. 


ఒంగోలు సర్కిల్‌ పరిధిలో 401 మందికి విధుల్లో 98మందే 

పంట భూములకు నీటిని అందించడంలో లస్కర్లు అత్యంత కీలకం కాగా ఏళ్ల తరబడి ఆ పోస్టులను భర్తీచేయడం లేదు. సర్కిల్‌ పరిధిలోని మూడు డివిజన్లలో 401మందికి లస్కర్లు ఉండాల్సి ఉండగా కేవలం 98 మంది మాత్రమే పని చేస్తున్నారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాలువలకు కనీస మరమ్మతులు, చిల్లచెట్ల తొలగింపు, పంట పొలాలకు నీటిసరఫరాలో ఈ సిబ్బంది కీలకం కాగా ఏళ్ల తరబడి ఆ ఖాళీలను ప్రభుత్వం భర్తీచేయడం లేదు. ప్రస్తుతం ఉన్నవారికి అదనంగా కనీసం 100 మంది అవసరం. అయితే వారి నియామకం కూడా చేయడం లేదు. ఇలా ఒకవైపు కాలువలకు మరమ్మతులు లేక అధ్వానంగా ఉండటం, మరోవైపు సిబ్బంది లేకపోవడంతో తమపొలాలకు నీటి సరఫరాపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్‌నీరు వచ్చేది అంతంతమాత్రం కాగా నిర్వహణ సరిలేక వృఽథా పెరిగి సరిపడా నీరందక అవస్థలు పడుతున్నారు. 


ఏబీసీలోనూ అంతే 

 ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లిన అద్దంకి డివిజన్‌లో చూస్తే 18/0 నుంచి 37/03 మైలు వరకు ఏబీసీ పేరుతో అక్కడి నుంచి యద్దనపూడి బ్రాంచి కాలువ, పమిడిపాడు మేజర్‌గా ప్రవహిస్తుంది. ఈ పరిధిలో 26 మేజర్లు ఉండగా అన్ని కాలువలు కలిపి 247.9కి.మీ ఉన్నాయి. ఈ ప్రాంతంలో లక్షా 74వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మూడు బ్రాంచి కాలువలు, ప్రధానకాలువ.. వాటికి అనుబంధంగా 126 మేజర్లు వాటి దిగువన అంతకు రెట్టింపు మైనర్‌ కాలువలు 80కి.మీ ఉన్నాయి. ప్రస్తుతం ఆయా కాలువల పరిస్థితి చూస్తే మూడొంతులకుపైగా అధ్వానంగా తయారయ్యాయి. ప్రత్యేకించి మేజర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధాన కాలువ లేదా బ్రాంచి కాలువ నుంచి పంట కాలువలకు భూములకు నీటిని చేర్చడంలో మేజర్‌ కాలువలు కీలకం కాగా చాలాచోట్ల కనీస మరమ్మతులు కూడా లేక చిల్లచెట్లతో నిండి కట్టలు కోతకు గురయ్యాయి. నీటి ప్రవాహం ముందుకు సాగకపోవడంతోపాటు చాలాచోట్ల లీకేజీలు పెరిగి వాగులు, వంకల్లోకి సాగర్‌నీరు వెళ్ళి వృథా పెరిగిపోతోంది. 






Updated Date - 2022-08-20T05:14:46+05:30 IST