గాయకుడి బిడ్డకు ఎంత కష్టం?

ABN , First Publish Date - 2022-05-02T09:55:05+05:30 IST

వరంగల్‌ శంకర్‌ గొంతు నుంచి ఎన్నో జానపదాలు ఒలికి జనాలను ఉర్రూతలూగించాయి

గాయకుడి బిడ్డకు ఎంత కష్టం?

  • మృత్యువుతో పోరాడుతున్న వరంగల్‌ శంకర్‌ కుమారుడు శివస్వస్తిక్‌ 
  • ఊహతెలియని వయసులో తండ్రి.. 16 ఏళ్ల వయసులో తల్లి మృతి
  • అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిన యువకుడు
  • తీవ్ర మధుమేహం, కిడ్నీ సమస్యలతో ఎంజీఎంలో దీనావస్థ 
  • హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందిస్తే మేలంటున్న వైద్యులు


ఓరుగల్లు, మే 1 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ శంకర్‌ గొంతు నుంచి ఎన్నో జానపదాలు ఒలికి జనాలను ఉర్రూతలూగించాయి! ‘మియ్యారు గుర్రాలు.. నా ఆరు గుర్రాలు.. పన్నెండు గుర్రాల బగ్గీ పోతాందీ’ అని శంకర్‌ పాటెత్తుకొంటే చిందేయని పాదం ఉండదు. ‘కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే.. ఆ మాటలంటదే కోడిపిల్లా’ అని గొంతెత్తితే హుషారవ్వని మనసుండదు! ఇప్పుడు ఆ గాయకుడు శంకర్‌ లేరు. గాయకురాలైన ఆయన సతీమణి సంధ్యా లేరు. నా అన్నవారెవరూ లేక వారి ఏకైక కుమారుడు శివ స్వస్తిక్‌ (20) ఒంటరిగా మిగలడమే కాదు.. తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం మరింత విషాదం!! శంకర్‌, సంధ్య దంపతుల స్వస్థలం వరంగల్‌. ఒక కాలంలోనైతే జానపద గీతాలకు చిరునామాగా నిలిచిందీ ద్వయం. వీరికి స్వస్తిక్‌తో పాటు ఓ కూతురు ఉన్నారు. 


విప్లవ కథాంశంంతో వచ్చిన కొన్ని సినిమాల్లో శంకర్‌ కొన్ని పాటలు పాడారు. 2005లో అనారోగ్యంతో మృతిచెందారు. పుట్టుకతోనే మధుమేహం తాలూకు సమస్యలతో బాధపడుతున్న స్వస్తిక్‌కు సంధ్యనే అన్నీ తానై ఆలనాపాలనా చూశారు.  2018లో సంధ్య క్యాన్సర్‌తో మృతిచెందారు. అక్క ప్రేమ వివాహం చేసుకొని భర్త ఉంటున్న మరో రాష్ట్రానికి వెళ్లిపోవడంతో శివస్వస్తిక్‌ ఒంటయ్యారు. సంధ్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కావడంతో ఆమె మరణంతో కారుణ్య నియామకాల కోటా కింద స్వస్తిక్‌కు ఉద్యోగం ఇచ్చారు. ఇరిగేషన్‌ శాఖ ములుగు డివిజన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మధుమేహంతో తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో విధులకు హాజరు కావడం లేదు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇటీవల మూత్రపిండాల సమస్య కూడా తలెత్తింది. తెలిసినవారు కనిపిస్తే చేతులెత్తి మొక్కుతూ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సోదరి ఫోన్‌ ఎంతకూ కలవడం లేదని వాపోతున్నారు. 


వైద్యులే దిక్కయ్యారు..

శివస్వస్తిక్‌.. తెలంగాణ జానపద లెజెండ్స్‌గా పేరున్న వరంగల్‌ శంకర్‌, సంధ్యల కుమారుడు అని తెలుసుకుని ఎంజీఎం వైద్యులే ఆయన్ను ఆదరిస్తున్నారు. గొప్ప కీర్తి పొందిన శంకర్‌ దంపతుల కుమారుడికి ఇంతటి దుర్భర స్థితి రావడం కన్నీళ్లు తెప్పిస్తోందని వాపోతున్నారు. హైదరాబాద్‌ తరలించి మెరుగైన చికిత్స అందిస్తే ఆయన ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 


శంకరన్న శిష్యులారా మీరెక్కడ? 

ప్రస్తుతం పేరున్న తెలంగాణ జానపద గాయకుల్లో ఎంతో మంది వరంగల్‌ శంకరన్న తమ గురువు అంటూ చెప్పుకునేవారున్నారు. శంకరన్న పాట వల్లే తామీ స్థాయికి చేరుకున్నామని వారు అంటుంటారు. అయితే శంకరన్న రుణం తీర్చుకోవాలంటే దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్న ఆయన కుమారుడు శివస్వస్తి క్‌ను వారు ఆదుకోవాలని వరంగల్‌ ప్రజలు కోరుకుంటున్నారు.  

Updated Date - 2022-05-02T09:55:05+05:30 IST