
ఆంధ్రజ్యోతి(31-03-2022)
ప్రశ్న: నా మెడపైన, కనురెప్పలపైన పులిపిర్లు వస్తున్నాయి. వీటివల్ల నలుగురిలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్ని పులిపిర్లు పెద్ద సైజులో ఉన్నాయి. ఎన్నో హోమ్ రెమిడీస్ ప్రయత్నించాను. కానీ ఫలితం లేదు. వీటిని తొలగించుకోవచ్చా? తొలగించుకుంటే మళ్లీ వస్తాయని అంటున్నారు. నిజమేనా? అలాగే నా చేతులపైన నల్లగా అవుతోంది. కారణం ఏమై ఉంటుంది. తగిన సలహా ఇవ్వండి?
- దివ్య, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: పులిపిర్లు చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. ఇవి రావడానికి చాలా కారణాలుంటాయి. అధిక బరువు కూడా కారణమవుతుంది. కొందరిలో ఎలాంటి సమస్య లేకపోయినా పులిపిర్లు కనిపిస్తాయి. ఇవి చూడటానికి మాత్రమే ఇబ్బందికరంగా ఉంటాయి. వీటిని తొలగించుకోకపోవడం వల్ల పెద్దవి కావడం, కేన్సర్‌గా మారడం అంటూ జరగదు. పులిపిర్లను తొలగించుకోకపోతే కొత్తవి వస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. తీయించుకున్నా, తీయించుకోకపోయినా శరీరతత్త్వాన్ని బట్టి కొత్తవి వస్తూనే ఉంటాయి. ఒకవేళ తీయించుకుంటే మళ్లీ వస్తాయా? అంటే పులిపిరిని తొలగించిన ప్రదేశంలో మళ్లీ కొత్తగా రాదు. పులిపిర్లు పోవడానికి టాబ్లెట్లు, క్రీములు ఏమీ లేవు. చాలామంది యూట్యూబ్ వీడియోలు చూసి హోమ్ రెమిడీస్ ప్రయత్నిస్తుంటారు. దానివల్ల చర్మం నల్లగా మారడం, మంట పుట్టడం జరుగుతుంది.
పులిపిరి సగం ఊడిపోయి ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది. అలాంటి పనులు చేయడం వల్ల చర్మానికి హాని జరిగే అవకాశమే ఎక్కువ. డెర్మటాలజిస్టును సంప్రదిస్తే పులిపిర్లను ఎలాంటి నొప్పి లేకుండా తొలగిస్తారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. కంటి రెప్పపైనా ఉన్నా నొప్పి లేకుండా తీయడం సాధ్యమవుతుంది. నొప్పి తెలియకుండా ఉండటానికి క్రీమ్ గానీ, ఇంజక్షన్ గానీ ఉపయోగిస్తారు. ఇక రెండోది చేతులమీద నల్లగా అవడానికి రకరకాల కారణాలుంటాయి.
స్నానం చేసే సమయంలో స్క్రబ్ ఉపయోగిస్తున్నారా? సున్ని పిండి ఉపయోగిస్తున్నారా? తెలుసుకోవాలి. అలాంటి వాటి వల్ల కూడా పిగ్నెంటేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది ఎక్కువగా ఎండలో తిరగడం కారణం కావచ్చు. ముందుగా కారణం తెలుసుకోవాలి. ఇక మీరు ఏం చేయాలంటే బయటకు వెళ్లినప్పుడు సన్ స్ర్కీన్ లోషన్స్ రాసుకోవడం, డీ పిగ్మెంటేషన్ లోషన్స్ పూసుకోవడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
డా. స్వప్నప్రియ
కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు
కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్
హైదరాబాద్