దుఃఖ నివృత్తి ఎలా సాధ్యం?

ABN , First Publish Date - 2021-01-18T08:42:27+05:30 IST

అజ్ఞానం వల్ల అవివేకం, అవివేకంతో అభిమానం, అభిమానంతో అనురాగం, అనురాగంతో కర్మలు, కర్మలతో శరీర బంధనం, శరీర బంధనంతో దుఃఖం కలుగుతుందని పై శ్లోకానికి అర్థం.

దుఃఖ నివృత్తి ఎలా సాధ్యం?

  • తస్మాదజ్ఞానాదవివేకో జాయతే! అవివేకాదభిమానో జాయతే!
  • అభిమానాత్‌ రాగా దయో జాయన్తే! రాగాదిభ్యః కర్మాణి జాయన్తే!
  • కర్మభ్యఃశరీర పరిగ్రహాజాయతే! శరీర పరిగ్రహాత్‌ దుఃఖం జాయతే!


జ్ఞానం వల్ల అవివేకం, అవివేకంతో అభిమానం, అభిమానంతో అనురాగం, అనురాగంతో కర్మలు, కర్మలతో శరీర బంధనం, శరీర బంధనంతో దుఃఖం కలుగుతుందని పై శ్లోకానికి అర్థం. శీతోష్ణాలు శరీర సంబంధాలని, సంతోష దుఃఖాలు మనస్సుకు సంబంధించినవనీ ప్రముఖ వేదాంతవేత్తల అభిప్రాయం. దుఃఖం సమూలంగా తొలగిపోవాలంటే కర్మల నివృత్తి జరగాలి. కర్మల నివృత్తి కలగాలంటే రాగాదులు నశించాలి. రాగాదులు నశించాలంటే అభిమానం అంతరించాలి. అభిమానం అంతరించాలంటే అవివేకం అణిగిపోవాలి. అవివేకం అణగాలంటే అజ్ఞానం సుజ్ఞానంగా పరివర్తన చెందాలి. అజ్ఞానమనే అవిద్యమాయా ప్రభావం మానవుణ్ని దుఃఖసముద్రంలో ముంచుతోంది. అనేక జన్మల సుకృత ఫలంగా ఉత్కృష్టమైన మానవజన్మ లభిస్తుంది. ఏప్రాణికోటికీదక్కని జ్ఞానాన్ని ఆ పరమాత్మ మనిషికి ప్రసాదించాడు. ఈ జన్మ సార్థకం కావాలంటే.. ప్రాపంచిక భోగాలకు వశం కాకుండా, పరమాత్మ ప్రాభవాన్నే దృష్టిలో పెట్టుకుని నిమిత్త మాత్రుడిగా జీవనయాత్ర సాగిస్తూ.. ప్రతి కర్మ ఫలితాన్నీ పరమాత్మ ప్రసాదంగా భావించి, చివరకు పరమాత్మలో లీనం కావాలి.


అందుకు.. అలౌకికమైన ఆధ్యాత్మిక ప్రక్రియలను అనుసరించి ఆత్మవిచారణతో ఆత్మసాక్షాత్కారం పొందాలి. అలా జరిగితే అజ్ఞానం, అవివేకం,  అభిమానం, అనురాగం అంతరిస్తాయి. అంతటితో శరీర బంధనం తొలగిపోతుంది. దుఃఖం దూరమైపోతుంది. ఆత్మ విద్యాఫలాలను అందుకోడానికి, అనేక కష్టాలకు, నష్టాలకు అనర్థాలకు మూలమైన అహంకారం వైదొలగాలి. ‘నేను’, ‘నాది’ అనే అహంభావాన్ని అణచివేస్తే.. అట్టి జ్ఞానికి జననమరణాలుండవు. జననమరణాలు లేనప్పుడు కర్మలు ఉండవు. కర్మ బంధాలు ఉండవు. దుఃఖం అసలే ఉండదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

- విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య

Updated Date - 2021-01-18T08:42:27+05:30 IST