రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

ABN , First Publish Date - 2021-05-28T21:36:46+05:30 IST

తక్కువ కెలరీలతో ఎక్కువ పోషకవిలువలు, నాణ్యమైన మాంసకృత్తులు అందించే ఆహారం గుడ్డు. ఒక గుడ్డులో ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రొటీను, 65 నుంచి 70 కెలరీలు ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొనలో కొవ్వుపదార్థాలు అస్సలు ఉండవు. దీనిలో నాలుగు గ్రాముల ప్రొటీను, 17 కెలరీలు మాత్రమే ఉంటాయి.

రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?

ఆంధ్రజ్యోతి(28-05-2021)

ప్రశ్న: రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు? గుడ్లలో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి? కొలెస్ట్రాల్‌ ఉన్నవారు తినొచ్చా..?


- ప్రియంవద, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: తక్కువ కెలరీలతో ఎక్కువ పోషకవిలువలు, నాణ్యమైన మాంసకృత్తులు అందించే ఆహారం గుడ్డు. ఒక గుడ్డులో ఆరు నుంచి ఏడు గ్రాముల ప్రొటీను, 65 నుంచి 70 కెలరీలు ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొనలో కొవ్వుపదార్థాలు అస్సలు ఉండవు. దీనిలో నాలుగు గ్రాముల ప్రొటీను, 17 కెలరీలు మాత్రమే ఉంటాయి. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రైబో ఫ్లోవిన్‌, నియాసిన్‌ కొద్ది మోతాదులో ఉంటాయి. పచ్చసొనలో 3- 4 గ్రాముల ప్రొటీనుతో పాటు, నాలుగు గ్రాముల కొవ్వు పదార్థాలు కూడా ఉండటం వల్ల గుడ్డువల్ల వచ్చే కెలరీలలో ఎక్కువ భాగం పచ్చ సొన నుంచే వస్తాయి. గుడ్డులోని తెల్లసొనతో పోలిస్తే, పచ్చసొనలో కాల్షియం, ఐరన్‌, జింక్‌, కాపర్‌, థయామిన్‌, బి-6, ఫోలేట్‌, బి-12 ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. గుడ్డులో లభించే ఎ, డి, ఇ, కె విటమిన్లతో పాటు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా పచ్చసొనలో మాత్రమే ఉంటాయి. అయితే గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్‌ మొత్తం పచ్చసొనలో మాత్రమే ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్‌ సమస్య తీవ్రంగా ఉన్నవారు, అది కూడా డాక్టరు సలహా మేరకు మాత్రమే పచ్చసొన వదిలి వేయవచ్చు. మిగిలిన వారు మొత్తం గుడ్డు తినడమే మంచిది. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకొక గుడ్డు చొప్పున తీసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2021-05-28T21:36:46+05:30 IST