
ఏడేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు
ఇరు రాష్ట్రాలతో 12న కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా.. ఇంకా విభజన చిక్కుముళ్లు వీడడం లేదు. ఏడేళ్లుగా అధికారులు.. రాజకీయ నేతలు.. చివరికి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినా.. ఢిల్లీలోని ఏపీ(తెలంగాణ) భవన్ మొదలు.. విజయవాడలోని అప్మెల్, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 పరిధిలోని సంస్థల ఆస్తుల పంపకం ఎటూ తేలలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, ఈ సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ దిశలో నామమాత్రపు చర్యలే కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఇరురాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా.. అవి తూతూమంత్రంగా మిగిలిపోతున్నాయే తప్ప.. ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం లభించడం లేదు. ఇరు రాష్ట్రాలు పంతాలు-పట్టింపులు, డిమాండ్లు-వాదనలతో కాలం గడుపుతున్నాయే తప్ప.. సమస్యల శాశ్వత పరిష్కారానికి చేస్తున్న కృషి శూన్యమే..! 2019లో ఇరు రాష్ట్రాల సీఎంలు ఇదే అంశంపై ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. విందు చేసుకున్నారు. సమస్యను అధికారులకు వదిలేశారే తప్ప.. పరిష్కారమార్గాలకు ప్రయత్నించలేదు. గత ఏడాది ఏప్రిల్ 7న కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో సమావేశం జరిగినా.. ఒక్క సమస్యా పరిష్కృతమవ్వలేదు. ఈ నేపథ్యంలో మరోమారు విభజన సమస్యలపై ఈ నెల 12న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపింది. ఈ సమావేశంలో కనీసం కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.