ఇన్ని సెలావులా?

ABN , First Publish Date - 2022-09-26T05:27:05+05:30 IST

దసరా సెలవులు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, సెలవులను కుదిస్తూ విద్యా సంవత్సరాన్ని కాపాడాలన్న తల్లిదండ్రులు, విద్యావేత్తల ఆవేదనను బేఖాతరు చేస్తూ 15 రోజుల దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది.

ఇన్ని సెలావులా?

పాఠశాలలకు 15రోజుల దసరా సెలవులు ప్రారంభం

 అకాడమిక్‌ క్యాలెండర్‌ను ఉల్లంఘిస్తున్నారని విద్యావేత్తల ఆగ్రహం

 విద్యార్థులపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రుల ఆందోళన


భువనగిరి టౌన్‌: దసరా సెలవులు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, సెలవులను కుదిస్తూ విద్యా సంవత్సరాన్ని కాపాడాలన్న తల్లిదండ్రులు, విద్యావేత్తల ఆవేదనను బేఖాతరు చేస్తూ 15 రోజుల దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. విద్యాశా ఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులు. 10న పాఠశాలలు తిరిగి ప్రారంభవుతాయి. ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు రెండు వారాల దసరా సెలవులను ఇచ్చినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 


అయితే 2022-23 విద్యా సంవత్సరానికి ప్రకటించిన అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం పాఠశాలలు 230 పని దినాలు నడవక పాఠ్యాంశాల బోధనపై ప్రభావం చూపుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండ గా, ఇంటర్‌ ఆ పైస్థాయి కళాశాలలకు అక్టోబరు 2 నుంచి 9వ వరకు దసరా సెలవులు ఉంటాయని అధికారులు ప్రకటించారు.


అకాడమిక్‌ క్యాలెండర్‌పై ప్రభావం

సాధారణంగా అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం పాఠశాలలు ఏటా 220 రోజులు పని చేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా కరోనా కారణంగా పాఠశాలలు సరిగా పనిచేయని నేపథ్యంలో విద్యార్థులలో కొరవడిన కనీస విద్యా సామర్థ్యాల పెంపు లక్ష్యం తో ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సర అకాడమిక్‌ క్యాలెండర్‌ ను 230 రోజులకు పెంచింది. కానీ, అమలులో మాత్రం నిర్లక్ష్యం చూపుతోంది. ఇష్టానుసారంగా ఇస్తున్న సెలవులతో పాత అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం కూడా పాఠశాలలు నడువని స్థితి నెలకొన్నది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రా రంభమైన జూన్‌ నుంచి సెప్టెంబరు 30 వరకు 82 పని దినాలకు 71 రోజు లు మాత్రమే పాఠశాల లు నడిచాయి. మిగతా ఏడు నెలలకు అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 148 రోజులు పాఠశాలలు నడవాల్సి ఉంది. ఈ మేరకు మొత్తంగా 219 రోజులు మాత్రమే ప్రస్తుత విద్యా సం వత్సరానికి పాఠశాలలు పనిచేయనున్నాయి. ఇటీవల వరుస వర్షాల కారణంగా వా రం రోజులు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే విద్యాసంవత్సరంలో మిగిలిన ఏడు నెలల్లో అనుకోని సెలవులు వస్తే పని దినాలు మరిన్ని కుచించుకపోయే అవకాశం ఉంది. అయితే ప్రతీ నెల రెండో శనివారం కూడా పా ఠశాలలు తెరిచి అకాడమిక్‌ క్యాలెండర్‌కు అటంకం కలగకుండా చూస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం దీనికి విముఖంగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. కరోనా కారణంగా రెండు బ్యాచ్‌ల విద్యార్థులు తరగతులకు, పరీక్షలకు హాజరు కాకుండానే పైతరగతులకు ప్రమోట్‌ అయ్యారు. వారు కనీస విషయ విజ్ఞానానికి దూరమైన నేపథ్యంలో ఇష్టానుసారం గా సెలవులు ఇవ్వ డం ద్వారా మరింత నష్టం వాటిల్లుతుందని తల్లిదండ్రులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులకు మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం జత కావడంతో సెలవుల సంఖ్య 15 చేరిందని ఉపాఽధ్యాయ సంఘా లు వాదిస్తున్నాయి. కాగా, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల బోనాంజాతో విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఖుషీలో ఉండగా ప్రైవేట్‌ యాజమాన్యాలు, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఉమ్మడి జిల్లాలో

ఉమ్మడి జిల్లాలోని సుమారు 5వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 5లక్షల మంది, సుమారు 200 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలల్లో 70వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యా సంస్థలన్నింటిలో సుమారు 20వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సెలవులు కొనసాగనుండగా, ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఆయా యాజమాన్యాలు దసరా సెలవుల్లో వర్క్‌షాపులు, మరికొన్ని పాఠశాలలు తరగతులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ ప్రైవేట్‌ ఉపాధ్యాయులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దసరా సెలవులు ప్రారంభం కావడంతో ఫీజులు వసూలు కాక ప్రైవేట్‌ యాజమాన్యాలు ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపునకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా అకాడమిక్‌ క్యాలెండర్‌ను కాపాడాల్సిన ప్రభుత్వమే విద్యార్థుల ప్రగతికి ఆటంకం కల్పిస్తోందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పని దినాలకు ఆటంకం కలగకుండా చర్యలు : కె.నారాయణరెడ్డి, డీఈవో

సెలవుల కారణంగా అకాడమిక్‌ క్యాలెండర్‌కు నష్టం జరగకుండా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. వేసవి సెలవులకు మరో ఏడు నెలల గడు వు ఉన్నందున సెలవులతో నష్టపోయిన పని దినాల ను భర్తీ చేసే అవకాశం ఉంది. నిర్దేశిత గడువు లోపు సిలబస్‌ పూర్తిచేస్తాం. ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపి పురోగతిని సాధి స్తాం. అందుకు ఉపాధ్యాయులు కూడా సుముఖంగానే ఉన్నారు.


Updated Date - 2022-09-26T05:27:05+05:30 IST