ఇంకా ఎన్నేళ్లు...!

ABN , First Publish Date - 2022-06-30T05:13:31+05:30 IST

ఝరికోన జలాశయం నుంచి పొలాలకు నీరు పారేందుకు నిర్మించనున్న కాలువలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి.

ఇంకా ఎన్నేళ్లు...!
ఝరికోన జలాశయం

ప్రతిపాదనలతోనే కాలయాపన

దశాబ్దాలుగా ఏర్పాటు కాని ఝరికోన కాలువలు

రూ.139 కోట్లతో నివేదికలు


సుండుపల్లె, జూన్‌ 29: ఝరికోన జలాశయం నుంచి పొలాలకు నీరు పారేందుకు నిర్మించనున్న కాలువలు ప్రతిపాదనలకే పరిమిత మయ్యాయి. ఏళ్ల తరబడి రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. కళ్ల ముందు నీళ్లున్నా వాటిని పారించే కాలువలు లేక పొలాలు బీళ్లుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబేపల్లె మండలం దిన్నెమీదపల్లె సమీపంలో బాహుదానదిపై ఝరికోన జలాశయ నిర్మాణానికి 2005 జూన్‌ 16న అప్పట్లో రూ.46.63 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా తొలి విడతలో రూ.21.89 కోట్లతో పనులు చేపట్టారు. అనంతరం అంచనాలు పెరుగుతూ 2013 నవంబరులో రూ.84.27 కోట్లతో 0.50 టీయంసీల నిల్వ సామర్థ్యంతో పనులు పూర్తి చేశారు. రాయచోటి పురపాలిక, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం నిర్మించాలని మొదట భావించారు. ఇక్కడ జలవనరుల లభ్యత తగినంత లేకపోవడంతో రాయచోటికి వెలిగల్లు జలాశయం ద్వారా నీటిని తరలించాలని ఆ ప్రతిపాదనలను మార్పు చేశారు. ప్రస్తుతం ఝరికోన నుంచి చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె, కలికిరి మండలాల్లోని గ్రామాలకు జలాశయం నుంచి తాగునీరు అందిస్తున్నారు. కాగా కాలువల నిర్మాణానికి మొదట సాంకేతిక నిపుణులు రూ.77.80 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదికను పంపారు. తిరిగి ప్రస్తుత ధరల ప్రకారం రూ.139 కోట్లు కావాలని మళ్లీ నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.


ఆయకట్టు మాటేంటి...

బాహుదానదిపై ఝరికోన జలాశయాన్ని నిర్మించారు కానీ ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఆలోచన పాలకులు చేయలేదు. సుండుపల్లె మండలంలోని వైఎన్‌ పాలెం, టి.సుండుపల్లె, భాగంపల్లె, మడితాడు, పెద్దినేనికాల్వ గ్రామాల్లో ఉన్న నాలుగు వేల ఎకరాలకు నేరుగా సాగునీరు ఇవ్వాలని ఆ తర్వాత ప్రతిపాదించారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచన చేయడంతో కాలువల పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో జలాశయంలో నీరున్నా అయకట్టుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదు.


ఉత్తర్వులు సరే.. పనులు ఎక్కడ

కాలువ పనులు చేపట్టేందుకు అంచనాల రూపకల్పనలో అంతులేని జాప్యం జరిగింది. ఇప్పటికే ఒకటి, రెండుసార్లు సర్వే చేసి సవరణలు చేశారు. తాజాగా ప్రధాన కాల్వను 6 కిలోమీటర్లు తవ్వాలని అంచనాలు రూపొందించారు. రెండు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి 19.50 కిలోమీటర్లు ఎడమ కాలువ తవ్వాల్సి ఉంది. కుడికాలువ పరిధిలో 2900 ఎకరాలకు నేరుగా జలాలు వచ్చేందుకు 15 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో ఉన్న చెరువులను నింపితే అదనపు ఆయకట్టుకు నీరు వచ్చే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. జలాశయం నుంచి భూములకు నీరు చేరాలంటే చేపట్టే కాల్వలకు ప్రస్తుత ధరల ప్రకారం అయితే రూ.139 కోట్లు కావాలని నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. 


ఝరికోన కాలువలకు నిధులు మంజూరు చేయాలి

- వీరనాగయ్య, దళిత బహుజన ఫ్రంట్‌ ఉపాధ్యక్షుడు 

ఝరికోన కాలువలకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులను త్వరితగతిన చేపట్టాలి. కాలువలు వెంటనే ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది నాయకులు వచ్చినా ఈ సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాలువల పనులు వెంటనే చేపట్టాలి. లేదంటే ఈ ప్రాంత రైతులను సమీకరించి సమస్య పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 


ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలి

- యర్రపురెడ్డి విశ్వనాధరెడ్డి, బాహుదా జల సంరక్షణ, జలసాధన సమితి కన్వీనర్‌ 

ఝరికోన ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి కాలయాపన లేకుండా వెంటనే నిధుల మంజూరుకు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూడాలి. అలాగే సాగునీటి గ్రావిటీ పనులు వెంటనే చేపట్టాలి. సుండుపల్లె మండలానికి శాశ్వత తాగు, సాగునీరు అందించి ఈ ప్రాంత ప్రజలను, రైతులను ఆదుకోవాలి. 


నివేదికలు పంపాము

- మధుసూదన్‌రావు, జేఈ, ఇరిగేషన్‌ 

కాలువల నిర్మాణానికి ప్రస్తుతం ధరల ప్రకారం రూ.139 కోట్లు కావాలని నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాము. పంపి కూడా ఏడాదిన్నర అవుతోంది. నిధులు మంజూరు కాగానే కాలువల పనులు చేపట్టే అవకాశం ఉంది. 

Updated Date - 2022-06-30T05:13:31+05:30 IST