ఎంత మోసం..?

ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST

గత ఏడాది అకాల వర్షాలు, పెనుగాలులకు ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఎంత మోసం..?
రామాపురం వద్ద చెరువులో పారేసిన మామిడికాయలు

పరిహారం ఇవ్వరని తెలిసినా.. అధికారుల హడావుడి

గత ఏడాదే రూ.300 కోట్లు ఇవ్వని ప్రభుత్వం

ప్రకృతి వైపరీత్యాలతో భారీగా పంటల నష్టం

అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న


సాధారణంగా మనం చేస్తున్న పనిలో.. ఏదైనా పొరబాటు దొర్లితే.. దానిని తప్పు అంటాం.. అదే తెలిసీ చేస్తే.. దానిని మోసం అంటాం.. అచ్చూ.. అలాంటి మోసమే ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉద్యాన రైతుల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయారు. వారికి పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మళ్లీ ఈ ఏడాది వచ్చిన పెనుగాలులు, వడగండ్ల వర్షానికి నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతుండటం విశేషం.


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): గత ఏడాది అకాల వర్షాలు, పెనుగాలులకు ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తే సంబంధిత అధికారులు నష్టపోయిన రైతులంటూ వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అప్పటి నష్టపరిహారం ఇప్పటికీ ఇంకా పైసా కూడా రాలేదు. ఇంతలో ఈ ఏడాది పెనుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. దీంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో మామిడి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీళ్లందరినీ ఆదుకుంటామని ఓవైపు కలెక్టర్‌, మరోవైపు ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. ఇంకోవైపు ఉద్యాన శాఖ ఆర్‌బీకేల ద్వారా ఇంకా నష్టపోయిన రైతుల వివరాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నామని అంటున్నారు. దీనిని గమనిస్తున్న రైతులు మాత్రం.. పైసా నష్టపరిహారం ఇవ్వకపోయినా.. ఇచ్చేస్తామని ఆస్కార్‌ లెవెల్లో అందరూ నటిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 


రూ.300 కోట్లకే చేతులెత్తేశారు

గత ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానకు ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ ఉద్యాన రైతులు నష్టపోయారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2685 మంది రైతులు 1236.51 హెక్టార్లలో పంటలు నష్టపోయారు. వీరిని ఆదుకోవడానికి రూ.299.78 లక్షలు ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట సాగు చేసుకోవడానికి సహాయం) ఇవ్వాలంటూ గుంటూరులోని హార్టికల్చర్‌ కమిషనర్‌ 2.5.2021న నివేదిక పంపించారు. అయితే వీటిని ప్రకృతి విపత్తులు లేదా రాష్ట్ర విపత్తుల కింద పరిగణించలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఆ రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉద్యాన శాఖ ఏడీ, డీడీ, పీడీ ఏపీఎంఐసీలకు ఉత్తర్వులు పంపించారు. ఇవి స్థానికంగా కురిసిన వర్షాలు కావడంతో..వీటిని జాతీయ విపత్తులు లేదా రాష్ట్ర విపత్తుల కింద పరిగణించలేమని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు పెద్దపీట వేస్తామని గొప్పగా చెప్పుకునే.. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేవలం రూ.300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మినహా  మిగిలిన  రాష్ట్రమంతా రైతులు నష్టపోతే.. అది జాతీయ విపత్తులు, రాష్ట్ర విపత్తుల కిందకు రావని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నారు. 


ఉద్యానరైతుకు.. కొండంత నష్టం

ఇటీవల వచ్చిన పెనుగాలులు, వడగండ్ల వర్షాలకు జిల్లాలోని ఉద్యాన రైతులకు కొండంత నష్టం జరిగింది. జిల్లాలోని రైల్వోకోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్షా ముఫ్పై వేల ఎకరాలలో మామిడి సాగులో ఉంది. రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాలలో అరటి సుమారు 35 వేల హెక్టార్లలో సాగులో ఉంది. ఈనెల 1వ తేదీ నుంచి పలుమార్లు పెనుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడికాయలు రాలిపోయాయి. చాలాచోట్ల మామిడి చెట్లు సైతం పూర్తిగా విరిగి పడిపోయాయి. అదేవిధంగా అరటి కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో బొప్పాయి పంట కూడా దెబ్బతింది. సుమారు మామిడి 6830 హెక్టార్లు, అరటి 400 హెక్టార్లలో అరటి రైతులు నష్టపోయారు. నేడోరేపో కాయలు తెంపుకోవాలన్న దశలో ఈ వర్షాలు రావడంతో.. ఏడాది కష్టం.. వాన పాలైందని రైతులు ఆవేదన చెందారు. ఇలా నేల రాలిన కాయలు ఎవరూ కొనేవాళ్లు లేక.. రోడ్లపైన. చెరువుల్లోనూ రైతులు పారేస్తున్నారు. ఈ వర్షాల వల్ల జిల్లాలో సుమారు రూ.20 కోట్ల మేర రైతులకు నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం సాయం చేయకపోతుందా... అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. 


ప్రజాప్రతినిధులు, అధికారుల హడావుడి

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పైనా నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదన్న సంగతి కలెక్టర్‌, ఎమ్మెల్యేతో పాటు ఇతర అధికారులకు తెలుసు. అయినా.. ఈసారి పెనుగాలులు, వడగండ్ల వాన, అసని తుఫాన్‌ వల్ల నష్టపోయిన మామిడి రైతులను ఆదుకుంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. గత ఏడాది రాని నష్టపరిహారం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏమాత్రం ఉదాసీనత చూపదని తెలిసినా..తమది రైతు ప్రభుత్వమని ఊదరగొడుతున్నారు. ప్రస్తుతం నష్టపోయిన ఉద్యాన రైతులకు పైసా నష్టపరిహారం వచ్చే అవకాశం లేదని తెలిసినా.. నష్టం లెక్కలు వేయడంలోనూ.. నివేదికలు తయారీ పేరుతోనూ.. ఎక్కడా లేని హడావుడి చేస్తూ.. ఉద్యాన రైతులను నిలువునా మోసం చేస్తున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.


ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాం

- రవీంద్రనాథరెడ్డి, ఏడీ, హార్టికల్చర్‌

ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో మామిడి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నష్టపోయిన పంటల వివరాలు సేకరించాము. తొలుత 7250 మామిడి, అరటి రైతులు నష్టపోయినట్లు గుర్తించాము. అయితే ఇంకా లోతుగా వివరాలు సేకరించడంతో అది 3 వేల హెక్టార్లలోపే ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నాం. గత ఏడాది నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రాని మాట వాస్తవమే. 



Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST