Advertisement

వాక్సి‘నేషన్‌’కు ఇన్ని రేట్లా !?

Apr 23 2021 @ 00:05AM

నిజాంనియంతృత్వం మీద కలమెత్తి గళమెత్తి పోరాడిన కవి దాశరథి ఆనాడే చెప్పారు: ‘సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవ్వంత చోటు, పేరుకు ప్రజలది రాజ్యం, పెత్తందార్లకే భోజ్యం’ అని. దాశరథికి ఆనాటికే ఎట్లా ఎరుకైందో, శ్మశానంలో పోటీ ఉంటుందని, ఆక్సిజన్ కొరత వస్తుందని, తగినన్ని వెంటిలేటర్లు ఉండవనీ, రెమ్‌డెసివిర్ వంటి మందులు, వాక్సిన్ల ఉత్పత్తి, నిలువ, రవాణా, విక్రయాల వెనుక వ్యాపార అవసరాలు ఉంటాయని, ఐసియుల కోసం బంధువులు రోగుల్ని వీపుమీద ఎక్కించుకుని (ఇంకా ఎక్కడో మానవత్వం మిణుకు మిణుకు మంటూ వెలుగుతున్నదనిపిస్తున్నది కదూ) ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారని...


బతకడానికి వీల్లేదు. చావడం తప్పదు కాని ఇప్పుడు చావు ఊళ్లోవాళ్ల ఇంటి తలుపులు తడుతూ ఉంటుంది. అంబులెన్స్ రాదు. అది వచ్చేనాటికి బతికి ఉంటే, అది తీసుకువెళితే, హాస్పటల్‌లో పడకమీది మనిషి పోతే తప్ప వీడికి (సారీ శవానికి) రవ్వంత చోటు లేదు. చనిపోవడం ఖాయం, ఎందుకంటే ఆక్సిజన్ ఉండదు, వెంటిలేటర్ పనిచేయదు. మందుల కొరత. శ్మశానానికి ప్రయాణం. అక్కడ తన కోసం పడక ఖాళీ చేసి ముందే వెళ్లిపోయిన భారతీయ పౌరుడి శవం ఇంకా తగలబడడానికి ఎదురుచూస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలు అర్జంటుగా కొత్త శ్మశానాలు కట్టించాలి. పౌరులు సౌకర్యవంతంగా డిగ్నిటీతో చావడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే చావులో డిగ్నిటీ కూడా జీవించే హక్కులో భాగమని సర్వోన్నత న్యాయస్థానం సర్వోత్తమ తీర్పు చాలా సార్లు చెప్పింది. 


ప్రతి చోటా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. నాయకులకు కరోనా వస్తుంది, ఎన్నికల కమిషనర్లకూ వస్తుంది. అయినా సరే ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. దేవుడు, మతం, పాకిస్థాన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్దప్రార్థన, అఫ్ఘానిస్తాన్, దేశభక్తి, జాతీయత, కుంభమేళా, తబ్లీగీ... గాంధీ మోసం, నెహ్రూ దుర్మార్గం, మన్మోహన్ మౌనం.... ఉపన్యాసాలు దంచుతూనే ఉంటారు. మాస్కులు లేని మాస్‌లే మన వోటర్లు. ముఖం నిండా మాస్కులే మన లీడర్లు. రాష్ట్రంలో ఎన్నికలు రద్దు చేయాలని ఒక రాష్ట్ర నాయకుడు అంటాడు. పక్క రాష్ట్రం జనాలు పోతే మనకేమిటి, చస్తే చావండి. కాని మాకు ఓటేసి చావండి. అవును ఐపిఎల్ కన్న ఎక్కువ నరాలు తెగే ఉత్కంఠ కలిగించే మహావక్తల ఉపన్యాసాలు శవాలతో కూడా ఓట్లేయించగలవు. టీవీల ముందున్న వాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్‌లు ఉంటాయని తెలిసినా పట్టించుకోరు. అయినా వేసిన ఓట్లు కుప్పలు తెప్పలుగా గెలిపిస్తూ ఉంటే పదవి మత్తులోకి ఎక్కేముందు చేసిన ఒట్టు ఎందుకు గుర్తుంటుంది?


మనదేశానికి ఇప్పుడు అదర్ పూనావాలా చాలా కావలసిన వాడు. అతను వాడు కాదు, గాడు, అంటే దేవుడు. ఎందుకంటే ఆయన నిర్ణయిస్తాడు వాక్సిన్ ధర. ఎవడెంతకు అమ్మాలో. రైతులకు ఈ మధ్య ఏవిధంగానైతే తమ సొమ్ముకు తాము ధర నిర్ణయించే స్వేచ్ఛను ఆర్డినెన్సుద్వారా కరుణామయి ప్రభుత్వం ఇచ్చిందో సరిగ్గా అదేవిధంగా అదర్ అదరగొడ్తాడు. ఒకే నేషన్ ఒకే మార్కెట్, ఒకే నేషన్ ఒకే రేషన్, ఒకే నేషన్ ఒకే ఎలక్షన్.. చాలు చాలు, వాక్సినేషన్ విషయంలో ఈ నేషన్ విధానం నిదానం పనికి రాదని అదర్ నిర్ణయిస్తాడు. పాపం నిర్మలమైన సీతారాములేంచేస్తారు. వారంత అమాయకులు ఏ దేశంలోనూ ఉండరు. 


కేంద్రం యాభైశాతం వాక్సిన్‌ను 150 రూపాయల చొప్పున అమ్మడమేమిటి? రాష్ట్రాలు అదే వాక్సిన్‌కు 400 రూపాయలెందుకు చెల్లించాలి? అదే ప్రైవేటు వాడు రూ. 600కి ఎందుకు అమ్మాలి? నేషనలైజేషన్ ప్రియులంతా ఈ రేషనలైజేషన్ చెప్పడానికి ముందుకు వస్తారా, లేక ఉంటే గింటే సిగ్గు పడతారా? యాభైశాతం వాక్సిన్లు అసలు కేంద్రానికి ఎందుకు? ఎక్కడిస్తారు ఎవరికిస్తారు, కేంద్రానికి టెరిటరీ ఏది? రాష్ట్రాల సమాహారమే కదా దేశమంటే. దేశమంటే మట్టికాదోయ్ రాష్ట్రాలోయ్ అని వీరికి ఎవరు చెప్పాలి? ఆ మధ్య మన ఎన్టీఆర్ చెప్పలేదూ కేంద్రం ఒక మిథ్య అని. రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఎక్కడ అని అడగలేదూ. చంద్రబాబుకు గుర్తులేకపోవచ్చు. కాని వెంకయ్యనాయుడిగారికి గుర్తుండే ఉంటుంది. ఏ మిథ్యా ప్రపంచానికి రూ.150కి కిలో వంకాయలు అమ్ముతారు బ్రదర్? అదర్ గారు మీకు 150 రూపాయలకే అమ్మేందుకు మీరు ఇచ్చిన తాయిలాలు ఏమయినా ఉన్నాయా? పోనీ మీరు తొడగొట్టి మెలిపెట్టి, ఈడీలతో సిబిఐతో వడిపెట్టి సాధించిన రాష్ట్రప్రభుత్వాలు బోలెడున్నాయి కదా, మిమ్మల్ని గద్దెనెక్కించిన రోగులు మీపాలిత రాష్ట్రాల్లో 150 రూపాయల వాక్సిన్‌ను 400 రూపాయలకు ఎందుకు కొనాలంట? ఏం లాజిక్కు ఏం మాజిక్కు ఇది? 


మీరు వ్యాపారం చేసుకోవడమే గాక, దేశమంతా ప్రైవేటు వ్యాపారం చేసుకోవడానికి ఒక్కో తలకు కరోనా భయం వైరస్ ఎక్కించి 450 రూపాయల లాభం చేసుకోవడానికి అనుమతించేందుకు ఈ అదర్ ఎవరు బ్రదర్? అదర్ ఏమైనా మనదేశానికి పాలకుడా లేక అధికారపార్టీకి అధినేతా? డీలరా లేక లీడరా? జాతి మొత్తం కరోనాతో కలవరం చెందుతూ ఉంటే క్యాబినెట్టో, పార్లమెంటో, పిఎమ్మో నిర్ణయించాల్సిన ధరలు ఈ అదర్ ఎందుకు నిర్ణయిస్తున్నాడు బ్రదర్? 


నా మిత్రుడు ఇంకో సవాల్ విసిరాడు. మొన్న ఫిబ్రవరిలో కొవిడ్ వాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మన బ్రదర్ అదర్ నిర్ణయించిన రేటు 150 రూపాయలకు ఒక డోస్ చొప్పున రెండు డోస్‌లు ఈ దేశంలో 18 ఏళ్లు నిండిన మొత్తం (70 నుంచి 90 కోట్ల మంది) జనానికి ఈ సొమ్ముతో అందరికీ ఉచితంగా ఇవ్వవచ్చు కదా? ఆ విధంగా ఇవ్వకపోతే ఈ డబ్బంతా ఎవరికి బ్రదర్?


ఇంకో క్వొశ్చన్ మార్క్ కొడవలై కోప్పడుతున్నది. ఈ 150 రూపాయల రేటు ఏ విధంగా పుట్టింది? దీనికి అయ్య వ్యాపారమూ, అమ్మ లాభాపేక్ష కాదా? ఈ పాంచాలికి ఎంత మంది భర్తలు? ఈ వాక్సినేషనలిస్టు అనే అద్భుత విజయానికి తండ్రులెందరు? అపజయం అనాధ, విజయం బహుపిత్రు సహయోగ్ అంటారు కదా? 


అయినా తెలియక అడుగుతాను. ఈ దేశం ఫార్మాస్యూటికల్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందనీ అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ ఫార్మసీ ప్రముఖులు ఎందరో ఉన్నారని మీరే ఊదరగొడుతూ ఉంటారు కదా. ఈ రెండు కంపెనీలనే ఎందుకు ఎన్నుకున్నారు? ఓపెన్ టెండర్ పిలిచి వాక్సిన్ తయారీకి ఎందుకు అందరికీ అవకాశం ఇవ్వలేదు? ఎందుకింద ప్రేమ? అవ్యాజమైన అనురాగం చిందించడానికి వీరేమయినా శ్రీమన్నారాయణులా? ఈ కరోనా కరుణ ఎందుకు; ఈ మందు బాంధవ్యం ఏమిటి? ఒక్కసారి మాస్క్ తీసి మాట్లాడండి అదర్ (సారీ, బ్రదర్)? ఆర్టీఐ కింద అడిగితే ఇది వ్యక్తిగత సమాచారం అంటూ, దేశ భద్రతకు ముప్పు అంటూ వ్యాపార రహస్యాలను కాపాడే ఫిడ్యూసరీ బాధ్యత అంటూ ఇవ్వరు. ఇప్పించకుండా ఉండడానికి పునరావాస పునర్పదవీ నియమిత బాబూ భక్తులు కత్తులతో సమాచారాన్ని భద్రంగా కాపలా కాస్తూనే ఉన్నారు కదా. 


అధికారంలోకి వచ్చే పార్టీలకు మాత్రమే విరాళాలు ఇచ్చే గొప్ప ట్రాన్స్‌పరెంట్ ఎలక్టోరల్ బాండ్లు బండ్లకొద్దీ ఉండనే ఉన్నాయి. కనుక పార్టీలకు ఎన్నికలే ముఖ్యం. ఇక జనానికి ఆక్సిజన్ ఎందుకు? అదర్ వంటి మరో బ్రదర్ వచ్చి ఆక్సిజన్‌కు, వెంటిలేటర్లకు, ఐసియూ బెడ్‌కు, శ్మశానంలో చోటుకు, కేంద్రానికి రాష్ట్రానికి ప్రైవేట్ వర్తకులకు రకరకాల రేట్లు నిర్ణయిస్తాడు. 


అయినా నా తపనే కాని ఆర్టికల్ ఫోర్టీన్ గురించి అడిగే వాడెవడు. న్యాయస్థానాలు ఆధునిక దేవస్థానాలు. న్యాయం అక్కడ కళ్లకు గంతలు కట్టుకున్న దేవత. దేవుడిలాగే న్యాయమూ భక్తితో ఆరాధిస్తే తప్ప కనిపించడం సాధ్యం కాదు. కనుక రిట్ల స్తోత్రాలు చేయండి, ఆర్టికల్ మంత్రాలు చదవండి. లాయర్లకు నైవేద్యాలు పెట్టండి. రాజ్యాంగం పుస్తకాలకు మంగళహారతులు ఈయండి. 


ఈ దేశంలో ఇప్పుడు కరోనాతోపాటు నడిచేది ఎన్నికలు మాత్రమే. ఓటర్లు శ్మశానాలకు, లీడర్లు శాసన సింహాసనాలకు. ఏది ఏమైనా, అదరు బ్రదరైనా బ్రదరు అదరైనా జనం భయపడి చావొద్దు. శవమైనా లేచి రావలసిన చైతన్యం ఇప్పుడు జాతి అవసరం. బతికున్నవారు నోరుమూసుకుంటే, కరోనా రావలసిన పనే లేదు. వాక్సిన్ పనే చేయదు. చల్ నా జీవన్ కీ కహానీ రుక్ నా మౌత్ కీ నిషానీ.

మాడభూషి శ్రీధర్

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.