ఇంకెంతకాలం?

ABN , First Publish Date - 2021-05-08T05:37:08+05:30 IST

ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, వికారాబాద్‌ జిల్లాలో వీటి పనులు ముందుకు సాగడం లేదు.

ఇంకెంతకాలం?

  • వికారాబాద్‌ జిల్లాలో  నత్తనడకన మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులు
  • ఆహ్లాదానికి తప్పని ఎదురుచూపులు   
  • చివరిదశ పనులు నెలల తరబడి కొనసాగింపు
  • సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తయ్యేది ఎప్పుడో...?

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలో చేపట్టిన నాలుగు మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణపనులు ముందుకు సాగడం లేదు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌పై నిర్మించిన ట్యాంక్‌బండ్‌ మాదిరిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మినీ ట్యాంక్‌బండ్‌ పనుల్లో భాగంగా ఎంపిక చేసిన చెరువు కట్టను ప్రజల రాకపోకలను తట్టుకునే విధంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రజలకు పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచేవిధంగా పార్కులను అభివృద్ధిచేసి స్వచ్ఛమైన గాలి అందించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశం. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేసేందుకు వీలుగా ఫుట్‌పాత్‌  ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ ఘాట్‌ల నిర్మాణం కూడా చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం పంచాలనే సంకల్పంతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణపనులు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన పనులకు 2017లో టెండర్లు పిలువగా, 2018లో శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించగా, ఇప్పటికీ ఇంకా ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు పూర్తయిన తరువాత మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్వహణ బాధ్యతలను పట్టణాల్లోనైతే మున్సిపాలిటీలకు,  గ్రామాల్లోనైతే పంచాయతీలకు అప్పగించనున్నారు. ఆహ్లాదం కోసం మినీ ట్యాంక్‌బండ్‌లకు వచ్చే సందర్శకులకు అవసరమైన సదుపాయాలు స్థానిక సంస్థలే కల్పించాల్సి ఉంటుంది. డ్రింకింగ్‌ వాటర్‌, టాయిలెట్స్‌, లైటింగ్‌ తదితర సదుపాయాలు కల్పించే బాధ్యత వాటికే అప్పగించనున్నారు. టీస్టాల్‌, జ్యూస్‌, స్నాక్‌ సెంటర్‌ వంటివి ఏర్పాటుకు అనుమతించడం ద్వారా వచ్చే ఆదాయంతో సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. 

  • చివరిదశలో సాగదీత..

వికారాబాద్‌ మండలంలో కొంపల్లి, పరిగి మండలంలో లక్నాపూర్‌, తాండూరులో గొల్లచెరువు, దౌల్తాబాద్‌ పెద్ద చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించింది. పరిగి మండలం, లక్నాపూర్‌ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం రూ.6.80 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణపనులకు 2018, ఆగస్టు 4న అప్పటి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మూడేళ్లు కావస్తున్నా ఇంకా ఇక్కడి పనులు పూర్తికాలేదు. ఇక్కడ వినాయక విగ్రహాలు, బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు గణేష్‌ ఘాట్‌, బతుకమ్మ ఘాట్‌ల నిర్మాణం చేపట్టారు. లక్నాపూర్‌ చెరువులో బోటింగ్‌ ప్రారంభించేందుకు వీలుగా బోటింగ్‌ ఘాట్‌ కూడా ఏర్పాటుచేశారు. ఫుట్‌పాత్‌ తదితర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నిర్దేశించిన పనుల్లో 90శాతం వరకు పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు నెలల తరబడి కాలం వెళ్లదీస్తున్నారు. వికారాబాద్‌లో కొంపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.2.79కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికీ  పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కట్టతో పాటు బతుకమ్మ ఘాట్‌, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా పార్కును అభివృద్ధి పరచాల్సి ఉండగా, నామమాత్రంగా మొక్కలు నాటి వదిలేశారు. ఆపార్కు ఆలనాపాలన లేక మొక్కలన్నీ జాడలేకుండాపోయాయి. సేదతీరేందుకు వచ్చే సందర్శకుల కోసం ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. పట్టణానికి దూరంగా నిర్మించడం వల్ల మినీ ట్యాంక్‌బండ్‌ ప్రజలకు అందుబాటులో లేదన్న విమర్శలు ఉన్నాయి. కొడంగల్‌ నియోజక వర్గంలో దౌల్తాబాద్‌ పెద్ద చెరువును రూ.8 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరిచే పనులు చేపట్టారు. ఈ నిధులతో చెరువు కట్టపై సీసీ రోడ్డు, ర్యాంప్‌ నిర్మాణం, చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, బతుకమ్మ ఘాట్‌ నిర్మించారు. అలుగు, కాలువలు, తూములు, ఇతర మరమ్మతు పనులు చేశారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. కుర్చీలు, లైటింగ్‌ తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. తాండూరులో గొల్లచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం రూ.4.41 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి చేశారు. కట్ట వెడల్పు చేయడంతో పాటు బతుకమ్మ, గణేష్‌ ఘాట్‌లు, రిటైనింగ్‌ హాల్‌ పనులు పూర్తి కాగా, రెయిలింగ్‌ తదితర పనులు కొనసాగుతున్నాయి.


  • నాణ్యత ప్రశ్నార్థకమే..


ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ ట్యాంక్‌ బండ్‌ల నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో కొంపల్లి, లక్నాపూర్‌లో చేపట్టిన పనుల్లో ఇసుకకు బదులుగా డస్ట్‌ ఉపయోగించడం గమనార్హం. పది కాలాల పాటు ఉండాల్సిన ఈ పనులు నాణ్యతా లోపం కారణంగా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరేలా ఉన్నాయి.  పనుల్లో నాణ్యత కొరవడకుండా పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్‌ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. 


  • ఆహ్లాదం పంచేలా ఉండాలి...


హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ మాదిరిగా జిల్లాలో ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌ బండ్‌లు ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో కొంపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దే పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నా అక్కడకు వెళితే అక్కడి వాతావరణం ఆహ్లాదం పంచే విధంగా లేదు. కనీసం పార్కు కూడా అభివృద్ధి చేయలేదు. మొక్కుబడిగా పనులు చేపట్టి మమ అనిపించేశారు. వెంటనే పనులు పూర్తి చేసి మునిసిపాలిటీకి అప్పగించి ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా చర్యలు తీసుకోవాలి. 


- జొన్నల రవిశంకర్‌, నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు 


  • తుదిదశలో మినీ ట్యాంక్‌బండ్‌ పనులు


వికారాబాద్‌ జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వికారాబాద్‌ సమీపంలోని కొంపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దే పనులు పూర్తయ్యాయి. మునిసిపల్‌ అధికారులకు అప్పగించాల్సిన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. తాండూరు గొల్లచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా రూపొందించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి మునిసిపల్‌ అధికారులకు అప్పగిస్తాం. 


- బి.సుందర్‌, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి, వికారాబాద్‌ 

Updated Date - 2021-05-08T05:37:08+05:30 IST