దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత.. అసలు ఒక కరోనా పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ కావాలంటే..

ABN , First Publish Date - 2021-05-07T18:50:43+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో అధికశాతం ఆక్సిజన్ అందక కన్నుమూసే వారే. అంటే కరోనా మహమ్మారి కన్నా ప్రాణవాయువు కొరతే ప్రాణాంతకంగా మారిందన్నమాట.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత.. అసలు ఒక కరోనా పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ కావాలంటే..

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. వీరిలో అధికశాతం ఆక్సిజన్ అందక కన్నుమూసే వారే. అంటే కరోనా మహమ్మారి కన్నా ప్రాణవాయువు కొరతే ప్రాణాంతకంగా మారిందన్నమాట. ఈ పేషెంట్లకు కావలసిన ఆక్సిజన్ మామూలు వాతావరణంలో దొరికేది కాదు. మెడికల్ ఆక్సిజన్. దీన్ని 93 శాతంపైగా శుద్ధి చేసిన ఈ ఆక్సిజన్‌ను ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తారు. ఇంతకీ ఒక్క కరోనా పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ కావాలి? అసలు ఎవరికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉంటుంది? ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సరిపోతుందా? అసలు పేషెంట్లకు ఆక్సిజన్ సపోర్ట్ కావాలని ఎలా నిర్ధారిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకాలస్యం మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం..


మాస్కులు వైరస్ నుంచి మనల్ని కాపాడతాయి. వ్యాక్సిన్లు కరోనా తీవ్రతను తగ్గిస్తాయి. మరి ఆక్సిజన్ ఏం చేస్తుంది? వ్యాధిని తగ్గించడానికి మెడిసిన్స్‌కు అదనంగా సమయాన్ని అందిచేంది ప్రాణవాయువే. అయితే కరోనా సోకిన వారందరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉండదు. కరోనా పేషెంట్లలో కేవలం పదిశాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. వారిలో చూడా అతికొద్ది మందికి హై ఫ్లో నాజల్ కాన్నులా (హెచ్ఎఫ్ఎన్‌సీ) అవసరం అవుతుంది. ఒక సాధారణ వ్యక్తి విశ్రాంతిగా పడుకొని ఉన్నప్పుడు నిమిషానికి 7 నుంచి 8 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు. వాతావరణంలో వాయువుల నిష్పత్తి ప్రకారం, ఇలా మనం పీల్చుకునే గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మనం వదిలేసే శ్వాసలో 15 శాతం ప్రాణవాయువు ఉంటుంది. మిగిలిన దాన్ని ఊపిరితిత్తులు తీసుకొని శరీరానికి అందజేస్తాయి. ఇది గనుక తగ్గితే కచ్చితంగా ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉన్నట్లే. కరోనా వైరస్ చేసే పని ఇదే. ఆక్సిజన్‌ను పీల్చుకునే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఈ వైరస్ తగ్గించేస్తుంది. దీంతో వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు పీల్చుకోలేవు.


ఎలా తెలుసుకోవాలి?

కరోనా పేషెంట్లందరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు. ఆక్సిజన్ స్థాయి 90శాతానికన్నా తగ్గినప్పుడే మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. మరి ఎవరికి ఈ సపోర్ట్ కావాలో ఎలా తెలుసుకోవాలి? దీనికి డాక్టర్లు చేస్తున్న సూచన.. ఆరు నిమిషాల నడక. కరోనా పేషెంట్లు ఒక ఆరు నిమిషాలు ఆగకుండా నడివాలి. ఇలా నడిచే ముందు ఆక్సిజన్ స్థాయులను పరీక్షించుకోవాలి, అలాగే నడక పూర్తయిన తర్వాత కూడా టెస్టు చేయించుకోవాలి. నడిచిన తర్వాత ఆక్సిజన్ స్థాయి పెరగకుండా తగ్గిందంటే పరిస్థితి ప్రమాదకరమని అర్థం. ఆరు నిమిషాల నడక పూర్తి చేయడం కష్టంగా ఉన్నా, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారినా ఇది కూడా వార్నింగే. దీనర్థం శరీరం ఆక్సిజన్ కోసం కొట్టుకుంటోందని. వీరికి కచ్చితంగా మెడికల్ ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని వైద్యులు వివరించారు.


కరోనా పేషెంట్లకు ఎంత ఆక్సిజన్ కావాలి?

ఒక్కో కరోనా పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ కావాలనేది వారి రోగ తీవ్రతపైన ఆధారపడి ఉంటుంది. కొంత మందికి నిమిషానికి ఒకటి లేదా రెండు లీటర్ల ఆక్సిజన్ సరిపోతుంది. ఆక్సిజన్ సరఫరాలో వృధా, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక పేషెంట్‌కు నిమిషానికి మూడు నుంచి నాలుగు లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. అయితే కొంత మంది పేషెంట్లకు హెచ్ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ అవసరం అవుతుంది. వాళ్ల ఆక్సిజన్ అవసరాలు నిమిషానికి 60 లీటర్లు అంటే గంటకు 3,600 లీటర్లు దాటుతుంది. కొన్ని కేసుల్లో అయితే ఈ అవవసరం రోజుకు 86,000 లీటర్లకు చేరుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.


మరి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సరిపోతాయా?

హెచ్ఎన్ఎఫ్‌సీ సపోర్ట మీద ఉన్న పేషెంట్లకు ఒక ఆక్సిజన్ సిలిండరు మూడు నుంచి నాలుగు గంటలపాటు ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ సరఫరాల్లో కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ రీఫిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీటి కొరత తీవ్రతరం అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ కాన్సంట్రేటర్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వాతావరణంలో ఉండే ప్రాణవాయువును ఉపయోగించి శుద్ధి చేయబడిన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆక్సిజన్‌ను హెచ్ఎఫ్ఎన్‌సికి ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ప్రజలకు ఇళ్ల దగ్గర కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెంచుకోవడానికి ఈ కాన్సంట్రేటర్లు బాగా ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలం నిమిషానికి రెండు, మూడు లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉన్నప్పుడే అని డాక్టర్లు చెప్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉన్నా, పేషెంట్లకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే ఆస్పత్రికి తరలించాలని వైద్యుల సలహా. అలాగే ఆక్సిజన్ అవసరం బాగా ఉన్న పేషెంట్లను ఆస్పత్రికి తరలించాలని, ఎందుకంటే కరోనా ఇన్ఫెక్షన్‌ను తట్టుకోవాలంటే కేవలం ఆక్సిజన్ ఉంటే సరిపోదని, ఇంకా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వాళ్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-07T18:50:43+05:30 IST