ఇన్‌చార్జిల పాలన ఇంకెన్నాళ్లు!?

ABN , First Publish Date - 2021-07-30T05:35:52+05:30 IST

విద్యాశాఖలో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. కరోనా ప్రభావంతో కుదేలైన విద్యారంగానికి ఖాళీ పోస్టులు శాపంగా మారాయి. కరోనా మూలంగా ప్రత్యక్ష తరగతులకు బదులు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండగా, వాటిని పర్యవేక్షించాల్సిన ఎంఈవోలు లేకపోవడంతో అస్త్యస్తంగా మారింది.

ఇన్‌చార్జిల పాలన ఇంకెన్నాళ్లు!?

పాఠశాల విద్యాశాఖలో రెగ్యులర్‌ ఎంఈవోలు కరువు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 74 మండలాల్లో 73కు ఇన్‌చార్జిలే...
ఒక్క ఎల్కతుర్తి మండలానికే రెగ్యులర్‌ ఎంఈవో
పీజీ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు
పని ఒత్తిడితో కొరవడిన పర్యవేక్షణ


మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌

విద్యాశాఖలో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. కరోనా ప్రభావంతో కుదేలైన విద్యారంగానికి ఖాళీ పోస్టులు శాపంగా మారాయి. కరోనా మూలంగా ప్రత్యక్ష తరగతులకు బదులు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండగా, వాటిని పర్యవేక్షించాల్సిన ఎంఈవోలు లేకపోవడంతో అస్త్యస్తంగా మారింది. ఉమ్మడి వరంగల్‌జిల్లాలో 74 మండలాలకు గాను ఒక్కరంటే ఒక్కరు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవో ఉన్నారు. 26 మందికి 73 మండలాలు అప్పగించగా, వీరందరూ ఇన్‌చార్జిలే కావడం గమనార్హం.   సీనియర్‌ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు.  పాఠశాల బాధ్యతలకు న్యాయం చేయలేకపోతున్నారు. ఒక్క ప్రధానోపాధ్యాయుడు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా ఏడు మండలాలకు విద్యాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు.  కొవిడ్‌-19 నేపథ్యంలో సంవత్సర కాలంగా మూసివేసిన పాఠశాలలను తెరవడానికి అనుమతిచ్చిన ప్రభుత్వం జూలై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే.

73 మంది ఇన్‌చార్జిలే..

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహించే  గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జి ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో వివిధ పైళ్లపై సంతకాలకు పెట్టడానికి కూడా సమయం సరిపోవడంలేదని వాపోతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 11 మండలాలకు గాను ముగ్గురు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 15 మండలాలకు ఐదుగురు, మహబూబాబాద్‌ జిల్లాలో 16 మండలాలకు ముగ్గురు, జనగామ జిల్లాలో 12 మండలాలకు గాను ఐదుగురు, జయశంకర్‌భూపాలపల్లిలో 11 మండలాలకు గాను ఐదుగురు, ములుగు జిల్లాలో తొమ్మిది మండలాలకు గాను నలుగురు ఇంచార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు.  

పని ఒత్తిడితో సతమతం

సర్వశిక్షా అభియాన్‌ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల వేతన విడుదల, స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ ఎంఈవోల ప్రధాన విదులు. పాఠశాలల్లో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తూనే ఇతర మండలాలకు విద్యాధికారిగా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో విరామం లేకుండా పనిచేయడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పనిచేస్తున్న మండలానికి వారానికి ఒక రోజు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని, మండలంలో జరిగే ప్రత్యేక సమావేశాలకు మాత్రమే హాజరుకావాల్సి వస్తుందని వాపోతున్నారు.  ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైతే మధ్యాహ్న భోజనం బియ్యాన్ని గోదాముల నుంచి తరలించేందుకు తీవ్ర ఒత్తిడికి లోనుకావాల్సి వస్తుందని ఆందోళ చెందుతున్నారు.

పాత మండలాల నుంచే పర్యవేక్షణ..
జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన మండలాలకు పాత మండలాల నుంచే ఎంఈవోలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన మండలాల్లో  భవన నిరాణాలు  పూర్తయినా సిబ్బంది లేకపోవడంతో పాత కార్యాలయాల నుంచే  పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దీంతో ఉచిత పాఠ్యపుస్తకాలపంపిణీ, ఉన్నతాధికారుల ఆదేశాలు అమలుచేయటం ఎంఈవోలకు భారంగా మారింది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ప్రతి మండలానికో ఎంఈవోను నియమించి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విభజిత జిల్లాల వారీగా ఇన్‌చార్జి ఎంఈవోల వివరాలు ఇలా ఉన్నాయి...

వరంగల్‌ అర్బన్‌ జిల్లా: భీమదేవరపల్లి, ఐనవోలు, వేలేరు, ధర్మసాగర్‌ మండలాలకు ఎ.వెంకటేశ్వరరావు,  హన్మకొండ, హసన్‌పర్తి, కాజీపేట, కమలాపూర్‌ మండలాలకు రామకృష్ణరాజు ఇన్‌చార్జి ఎంఈవోగా ఉన్నారు.  ఎల్కతుర్తి రెగ్యులర్‌ ఎంఈవో అయిన రవిందర్‌ వరంగల్‌,  ఖిలావరంగల్‌  మండలాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా: నడికుడ, శాయంపేట, పరకాల మండలాలకు రమాదేవి, ఆత్మకూరు, దామెర, వర్దన్నపేట, సంగెం, నర్సంపేట మండలాలకు విజయ్‌కుమార్‌, నల్లబెల్లి, దుగ్గొండి, గీసుగొండ మండలాలకు సత్యనారాయణ, పర్వతగిరి, రాయపర్తి   మండలాలకు  రంగయ్య, నెక్కొండ ఖానాపూర్‌, చెన్నారావుపేట మండలాలకు రత్నమాల ఇన్‌చార్జి  ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా: మహబూబాబాద్‌, బయ్యారం, గార్ల, డోర్నకల్‌, కురవి, మరిపెడ, చిన్నగూడూరు మండలాలకు పూల్‌చంద్‌, నెల్లికుదురు, నర్సింహులపేట, తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి  మండలాలకు  రాము, కేసముద్రం, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలకు  శ్రీదేవి ఇన్‌చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు.

జనగామ జిల్లా: జనగామ, బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట మండలాలకు భగవాన్‌, పాలకుర్తి, కొడకండ్ల మండలాలకు రఘూజీ, జఫర్‌గడ్‌  మండలానికి రాజేందర్‌, లింగాలఘణపురం, దేవరుప్పలమండలాలకు  చంద్రారెడ్డి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూర్‌ మండలాలకు జయసాగర్‌ ఇన్‌చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా: రేగొండ మండలానికి  రవీందర్‌రావు, చిట్యాల, టేకుమట్ల మండలాలకు  రఘుపతి, మొగుళ్లపల్లి మండలానికి  ప్రభాకర్‌, ఘన్‌పూర్‌ ములుగు మండలాలకు  సురేందర్‌, భూపాలపల్లి,మహాముత్తారం,మహాదేవ్‌పూర్‌,ఫలిమల,మల్హార్‌, కాటారం మండలాలకు దేవానాయక్‌ ఇన్‌చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు.

ములుగు జిల్లా:
ములుగు మండలానికి ఎస్‌.శ్రీనివాస్‌, వెంకటాపూర్‌, ఏటూరునాగారం, కన్నాయగూడెం మండలాలకు  సురేందర్‌, తాడ్వాయి మండలానికి వై.సాంబయ్య, మంగపేట, వెంకటాపురం మండలాలకు రాజే్‌షనాయక్‌, వాజేడు మండలానికి వెంకటేశ్వర్లు, గోవిందరావుపేట మండలానికి దివాకర్‌ ఇన్‌చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-07-30T05:35:52+05:30 IST