త్రిశంకు స్వర్గంలో విద్యా సంవత్సరం

ABN , First Publish Date - 2020-07-06T21:21:41+05:30 IST

కరోనా కేసుల పెరుగుదల విద్యారంగంపై తీవ్ర ప్రబావం చూపనుంది. ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేసి అందరిని ప్రమోట్‌ చేశారు.

త్రిశంకు స్వర్గంలో విద్యా సంవత్సరం

గ్రామాల బాట పట్టిన ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు

ఆన్‌లైన్‌ చదువులకు నిరాసక్తత చూపుతున్న గ్రామీణ పిల్లలు

చదువులపై దృష్టి సారించే దారేది?


బోనకల్‌ (ఖమ్మం): కరోనా కేసుల పెరుగుదల విద్యారంగంపై తీవ్ర ప్రబావం చూపనుంది. ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేసి అందరిని ప్రమోట్‌ చేశారు. ఈ విద్యా సంవత్సరాన్ని కూడ కరోనా వెంటాడుతుండటంతో పిల్లల చదువులు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి. కేసులు తగ్గుముఖం పడితే ఈనెల చివరి వారం నుంచి ఉన్నత, ఆగస్టు నుంచి ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని భావించారు. కాని కరోనా విజృంభిస్తుండటంతో ఎప్పటికి పరిస్థితి అదుపులోకి వస్తుందో తెలియనందున ఆలస్యంగానైనా బడులు పెడతారా? లేదా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. పిల్లలు చదువులకు పూర్తిగా దూరమయ్యారని మాయదారి కరోనా రక్కసి వలన నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కూడ క్రమేణా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సినేషన్‌ వచ్చే వరకు పిల్లలను బడికి పంపక పోవడమే మేలని పలువురు బావిస్తున్నారు. 


 గ్రామాల బాట పట్టిన ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు

పట్టణాలలో పని చేసే ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు గ్రామాల బాట పట్టారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు అత్యదికంగా నమోదు అవుతుండటంతో అక్కడ పని చేసే ఉద్యోగులంతా వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఒక్క బోనకల్‌ గ్రామంలోనే హైదరాబాద్‌ నుంచి 100 మంది వరకు వచ్చారు. వర్క్‌ ప్రమ్‌ హోం పద్దతిలో పని చేస్తున్నారు. నగర ప్రైవేట్‌ విద్యార్థులు ఇళ్ల వద్ద ఆన్‌లైన్‌ చదువులను కొనసాగిస్తున్నారు. గ్రామీణ పిల్లలు మాత్రం ఆన్‌లైన్‌ చదువుల పట్ల నిరాసక్తతను చూపుతున్నారు. ట్యాబ్‌లు, సెల్‌ఫోన్‌లు, ల్యాబ్‌టాప్‌ల ద్వార పాఠాలు వినే సౌకర్యం అందరికి లేదు. కొంతమందికి ఉన్నా వారి ఆరోగ్యం పై ప్రబావం పడే అవకాశం ఉంది. తరగతిగదిలో ప్రత్యక్ష భోదన ద్వార పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేనందున విద్యార్థులు చదువుల పై దృష్టి సారించే దారి కనిపించడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2020-07-06T21:21:41+05:30 IST