మేమెలా బతకాలి?

ABN , First Publish Date - 2022-05-26T05:50:15+05:30 IST

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్‌ రింగురోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తరతరాలుగా భూములనే నమ్ముకుని బతుకుతున్న తమ కుటుంబాలను.. రీజినల్‌ రింగు రోడ్డు పేరిట ప్రభుత్వం భూములను తీసుకుని తమను రోడ్డు పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేమెలా బతకాలి?
రత్నాపూర్‌ పరిధిలో రోడ్డు నిర్మాణంలో కోల్పోనున్న భూములు (ఫైల్‌)

 రీజినల్‌ రింగురోడ్డు కోసం భూములు కోల్పోయే గ్రామాల రైతుల్లో దిగులు 

 సరైన న్యాయం చేయకపోతే భూములు ఇవ్వబోమని హెచ్చరిక

  అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటున్న  రైతులు


నర్సాపూర్‌/శివ్వంపేట, మే 25: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్‌ రింగురోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తరతరాలుగా  భూములనే నమ్ముకుని బతుకుతున్న తమ కుటుంబాలను.. రీజినల్‌ రింగు రోడ్డు పేరిట ప్రభుత్వం భూములను తీసుకుని తమను రోడ్డు పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డివిజన్‌లో నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల గుండా రీజినల్‌ రింగు రోడ్డు వెళ్తుంది. అందుకోసం నర్సాపూర్‌ మండలంలోని నాగులపల్లి, మూసాపేట, మహ్మదాబాద్‌, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిర్మలాపూర్‌, తుజాల్‌పూర్‌ గ్రామాల్లోని రైతుల భూములు తీసుకోనున్నారు. శివ్వంపేట మండలంలో లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్‌, పాంబండ, ఉసిరికపల్లి, పోతులబొగుడ, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లి గ్రామాల్లోని రైతుల నుంచి మొత్తం 322 హెక్టార్ల భూమి సేకరించనున్నారు. ఇప్పటికే భూ సేకరణ కోసం నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయానికి నివేదిక రాగా త్వరలోనే సంబంధిత రైతులకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఆయా గ్రామాల్లో గతంలో చేసిన సర్వే ప్రకారం వేసిన హద్దుల ద్వారా ఎవరి భూములు పోతాయో తెలిసిన రైతులు మనోవేదనకు గురవుతున్నారు. 

శివ్వంపేట మండలం రత్నాపూర్‌ గ్రామంలో 50 మంది రైతులకు చెందిన సుమారు 115 ఎకరాల భూమి రీజినల్‌ రింగురోడ్డు కోసం తీసుకోనున్నారు. దీంతో ఈ భూములు కోల్పోతే తామెలా బతకాలని సంబంధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర రూ.50లక్షలకు పైగా పలుకుతోంది. ప్రభుత్వం అంతటి ధర ఇచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. వృద్ధులైతే మరింత కృంగిపోయి, మంచానపడుతున్నారు. రత్నాపూర్‌ ప్రాంతంలో భూములన్నీ సారవంతమైనవి కావడంతో పంట దిగుబడి బాగా వస్తుంది. అటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని, ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని రింగ్‌రోడ్డును ఏర్పాటు చేయడం దారుణమని అభిప్రాయపడుతున్నారు. అయితే సరైన న్యాయం చేయకపోతే భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు హెచ్చరిస్తున్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు.


Updated Date - 2022-05-26T05:50:15+05:30 IST