రాజు ఎలా ఉండాలంటే..

ABN , First Publish Date - 2020-08-08T08:44:19+05:30 IST

ఆదర్శ ప్రభువైన శ్రీరామచంద్రుడు ప్రజలను పరిపాలించిన విధానం అన్ని కాలాలకూ, అన్ని ప్రాంతాలకూ చెందిన పరిపాలకులకు ఆదర్శప్రాయం. అందుకే ఇప్పటికీ ‘రామరాజ్యం’ అనే ఆదర్శపాలన

రాజు ఎలా ఉండాలంటే..

ఆదర్శ ప్రభువైన శ్రీరామచంద్రుడు ప్రజలను పరిపాలించిన విధానం అన్ని కాలాలకూ, అన్ని ప్రాంతాలకూ చెందిన పరిపాలకులకు ఆదర్శప్రాయం. అందుకే ఇప్పటికీ ‘రామరాజ్యం’ అనే ఆదర్శపాలన చెక్కు చెదరకుండా ప్రజల నాలుకలపై స్థిరంగా నిలిచి ఉంది. వాలి వధానంతరం పట్టాభిషిక్తుడైన సుగ్రీవునికి, అరణ్యవాసానికి బయల్దేరిన తనవద్దకు వచ్చిన భరతునికి.. రెండు సందర్భాల్లో రాముడు రాజధర్మాల గురించి వివరించాడు.


ధర్మమర్థం చ కామం చ యస్తు కాలే నిషేవతే!

విభజ్య సతతం వీరః సరాజా హరిసత్తమశ్రీశ్రీ 

హిత్వాధర్మం తథార్థంచ కామం యస్తునిషేవతే!

స వృక్షాగ్రే యథా సుప్తః పతిత: ప్రతిబుధ్యతే


‘ధర్మం, అర్థం, కామం అనే మూడింటిలో ఏ కాలంలో దేన్ని అనుభవించాలో రాజు ముందుగా విభజించుకోవాలి.  ఉదయ కాలంలో ధర్మమునందు మనసు నిలిపి, ధార్మిక వ్యవహారాలపై తన దృష్టిని కేంద్రీకరించాలి. కోశాగారం నిండుగా ఉండేలా, ప్రజలు ఆర్థిక పుష్టిని కలిగి ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. రాత్రి సమయాన్ని మాత్రమే కామోపభోగాలకు వినియోగించాలి. ఏ రాజైతే ధర్మాన్ని ఆచరించకుండా కామాసక్తుడై, భోగపరవశుడై ధనార్జన పరుడై ప్రవర్తిస్తాడో అతడు చెట్టు చిటారు కొమ్మలపై నిద్రించిన వాడితో సమానుడు. స్వధర్మాన్ని, ఆర్థిక వ్యవహారాలను వదిలి భోగ లాలసులై జీవనయానాన్ని కొనసాగించే రాజులు చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందలేక తర్వాత పశ్చత్తాపాన్ని చెందాల్సి వస్తుంది.’ అని శ్రీరామచంద్రుడు సుగ్రీవునికి బోధించిన ‘రాజధర్మాలు’ పరిపాలకులందరికీ వర్తించేవే. 


వనవాస దీక్షలో ఉన్న శ్రీరామచంద్రుని వద్దకు భరతుడు వచ్చి.. ‘వయసులో, పరాక్రమంలో, సద్గుణాలలో అన్నింటిలో జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు నీవే కావున రాజ్యాన్ని, నన్ను పరిపాలించు’ అని ప్రార్థించాడు. దానికి రాముడు.. ‘తండ్రికిచ్చిన మాట ప్రకారం నేను వెనక్కి రాలేను. నీవు యోగ్యులైన మంత్రులను, అధికారులను మాత్రమే నీకు సహాయకులుగా నియమించుకో. సంఖ్యలో ఎక్కువ మంది సహాయకులను ఏర్పరుచుకోవడం కన్నా, క్లిష్ట సమయంలో సమర్థమైన ఆలోచనలను చేయగల, కార్యదక్షత గల అతి కొద్ది మందిని మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.


అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలను వెంటనే తీసుకోవాలి. దీర్ఘకాలిక విషయాలలో ఆచితూచి అందరితో చర్చించాకే నిర్ణయాలను తీసుకోవాలి. ప్రజలను మరీ కఠినంగా శిక్షించకూడదు. దుర్మార్గులను, దుష్టులను, నేరాలు చేసేవారిని వారి వారి తప్పులకు తగినట్టుగా తప్పక దండించాలి. రాజులు నిష్పక్షపాతంగా వ్యవరిస్తూ, అందరి మన్ననలూ పొందే విధంగా పరిపాలన చేయాలి. ఓ భరతా.! నీవు కూడా మన వంశ మర్యాదకు తగినట్లుగా పరిపాలించు’ అని శ్రీరాముడు భరతునికి విస్తరంగా బోధించిన రాజధర్మాలను మనం వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో 100వ సర్గలో దర్శించవచ్చును. శ్రీరాముడు తాను పాటించి, ప్రభోదించిన రాజధర్మాలను నేటి కాలపు ప్రభువులు, పరిపాలకులు, అధికారులు అందరూ గ్రహించి, ఆచరించి చరిత్ర పుటల్లో నిలవాలని ఆశిద్దాం.


 సముద్రాల శఠగోపాచార్యులు 9059997267

Updated Date - 2020-08-08T08:44:19+05:30 IST