ఆందోళనను గెలవండి!

ABN , First Publish Date - 2021-05-28T05:30:00+05:30 IST

ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నడుస్తోంది. బయట అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆ ప్రశాంతత ఎక్కువవుతున్న కొద్దీ చాలామందికి అంతరంగంలో అలజడి పెరుగుతోంది...

ఆందోళనను గెలవండి!

ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నడుస్తోంది. బయట అంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆ ప్రశాంతత ఎక్కువవుతున్న కొద్దీ చాలామందికి అంతరంగంలో అలజడి పెరుగుతోంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? నిజానికి ఆ గందరగోళం మీ అంతరంగంలో లేదు. మీకు పని ఎక్కువగా లేదు కాబట్టి జరిగిన విషయాలను నెమరువేసుకుంటున్నారు. ఇది తెచ్చి పెట్టుకున్న ఆందోళన. చాలామంది పనుల్లో నిమగ్నమై ఉన్నామని అనుకుంటారు. కానీ నిజానికి వారు తమ సమయంలో అరవై శాతం వరకూ ఏదో పరధ్యానంలో గడుపుతున్నారు. 


ఆవులు, మేకలు నిన్న తిన్న ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకొని నెమరువేస్తూ ఉంటాయి. మనుషులు నిన్న జరిగిన విషయాలను ఇంకా తలచుకుంటున్నారు. ఎందుకంటే మన శరీరంలో ఆహారాన్ని నెమరువేసుకొనే సౌకర్యం లేదు. కాబట్టి మనసులో అటువంటి సౌకర్యం ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. మన అంతరంగంలో గొడవ, స్పందన, శబ్దం లాంటివి లేవు. అవన్నీ మన మెదడులో ఉన్నాయి. ఏదైనా పనిలో మనం నిమగ్నమైపోయినప్పుడు. మనసులో జరుగుతున్న కొన్ని అలజడులను మరచిపోతాం. ఎప్పుడైతే చేతి నిండా పని ఉండదో... అప్పుడు మనసు మళ్ళీ పరుగులు పెడుతుంది. ఈ పరిస్థితి నుంచి మనల్ని మనం దూరంగా పెట్టుకొనే మార్గాలు అనేకం ఉన్నాయి. యోగ మార్గానికి వస్తే ‘శాంభవి’, ‘శూన్య’ అనే ప్రభావశీలమైన ప్రక్రియలు ఉన్నాయి. లేదంటే ‘ఈశా క్రియ’ చేయవచ్చు. ఇవేవీ తెలియకపోయినా ఇబ్బంది లేదు. ఈ సువిశాల విశ్వంతో పోల్చితే మీ ఆలోచనలు ఏపాటివో గమనించండి. ఇప్పుడు ఒక వైరస్‌ మన ఉనికినే ప్రశ్నిస్తోంది. అశాశ్వతమైన ఈ జీవితంతో పోల్చి చూస్తే మీ ఆలోచనల స్థాయి ఏపాటిది? ఇవన్నీ ముఖ్యమని అనుకోవడమే సమస్య. 


ఇటువంటి ఆలోచనలూ, ఉద్వేగాలూ ఎందుకూ పనికిరావని గ్రహించాక... సహజంగానే మీరు వాటికి దూరంగా జరుగుతారు. మీరు ఏది తెలివైనదని భావిస్తారో... అది మిమ్మల్ని బాధించేటప్పుడు దానికి దూరంగా వెళ్ళాలనుకుంటారు. కానీ అది కుదరదు. సృష్టితో పోల్చి చూసుకుంటే మీ అస్తిత్వం ఎంత అల్పమైనదో తెలుసుకున్నప్పుడే కళ్ళు మూసుకొని కూర్చోగలరు. జీవంతో, సృష్టితో పోల్చి చూసినప్సుడు మీరు ఏమి కానట్టే లెక్క. సామాజికంగా మీరు ఏదో అయి ఉండవచ్చు. కానీ దీనికి ఎటువంటి అర్థమూ లేదు. ఒక జీవిగా ఈ చిన్న వైరస్‌ మిమ్మల్ని రేపు పడగొట్టవచ్చు. లేదా దాన్ని మీరు గెలవవచ్చు. ఇది అర్థం చేసుకుంటే మీ ఆలోచనల్లో ఆందోళన ఉండదు. మీకూ, మీ ఆలోచనా ప్రక్రియకు మధ్య దూరం సహజంగా పెరుగుతుంది. అప్పుడు ఏ సమస్య లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతతకు యోగ లాంటి మార్గాలను అనుసరించండి. అంతరంగంలో అలజడిని అప్పుడు మీరు సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. మీ లోపల ఉన్న ఆందోళనను గెలవగలుగుతారు. 


- సద్గురు జగ్గీవాసుదేవ్‌


Updated Date - 2021-05-28T05:30:00+05:30 IST