ధర్మారావుపేటలోని ఆయుష్ ఆస్పత్రి భవనం
ఆయుష్ ఆస్పత్రుల్లో సమస్యల తిష్ట
జిల్లా వ్యాప్తంగా 15 దవాఖానలు
ఆస్పత్రులకు సొంతభవనాలు కరువు
కేవలం మూడుచోట్ల మాత్రమే బిల్డింగ్స్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రజలకు వైద్యసేవలు
అరకొర సిబ్బందితో రోగులకు ఇక్కట్లు
భూపాలపల్లి కలెక్టరేట్, మార్చి 25 : ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల చెంతకు వైద్యాన్ని దగ్గర చేస్తాం.. ఇవన్నీ రాష్ట్రప్రభుత్వం చెబుతున్న మాటలు. కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సర్కారు చెప్పేదానికి.. ఇక్కడ ఉన్నదానికి పొంతన లేకుండాపోయింది. దీర్ఘకాలిక రోగాలను నయం చేయడంలో ఆయుష్ వైద్యానికి ప్రముఖస్థానం ఉంది. ఎంత మొండి జబ్బులైనా ఆ మందులు వాడితే తగ్గుతాయని రోగుల విశ్వాసం. అలాంటి ఆయుష్ ఆస్పతులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
జిల్లాలో ఆయుష్ ఆస్పత్రులకు సుస్తీ చేసింది. సొంత భవనాలు లేకపోవడంతో పీహెచ్‌సీల్లోనే వైద్యసేవలు కొన సాగుతున్నాయి. ఈ విభాగంలో అందించే ఆయుర్వేదిక్, హోమియో, యూనాని, న్యాచురోపతి వైద్యసేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని 15 ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రుల్లో సగానికిపైగా సిబ్బందే అందుబాటులో లేరు.
జిల్లాలోని ఆస్పత్రులు ఇవే..
జిల్లాలో మొత్తం 15 ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రులున్నాయి. వీటిలో అత్యధికంగా ఆయుర్వేదిక్, హోమియో సేవలు అందించే దవాఖానలే ఉన్నాయి. రెగ్యూలర్ విభాగంలో 8 ఆస్పత్రులు ఉంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) విభాగంలో ఏడు ఉన్నాయి ఉన్నా యి. రెగ్యూలర్ విభాగంలో జిల్లాలోని దామెరకుంట (ఆ యుర్వేదం) (కాటారం), ధర్మారావుపేట (ఆయుర్వే దం) (గణపురం), కొడవటంచ (ఆయుర్వేదం) (రేగొండ), చల్లగరిగే (హోమియో) (చిట్యాల), మహాముత్తారం (హోమి యో), మహదేవ్పూర్ (యూనాని), మొగుళ్లపల్లి (యూ నాని), వల్లెంకుంట (యూనాని) (మల్హార్రావు) ఆస్పత్రులున్నాయి. ఎన్ఆర్హెచ్ఎం పథకంలో భాగం గా అంబటిపల్లి (ఆయుర్వేదం), ఆజంనగర్ (ఆయుర్వేదం), చె ల్పూర్ (ఆయుర్వేదం), కాటారం (ఆయుర్వేదం), తాడిచెర్ల (ఆయుర్వేదం), భూపాలపల్లి (హోమియో), గణపురం (హోమియో) ఆస్పత్రులున్నాయి.
పీహెచ్సీ భవనాలే దిక్కు..
జిల్లాలో దాదాపు 15 ఆయుష్ ఆస్పత్రులుంటే.. అందు లో మూడు ఆస్పత్రులకు మాత్రమే సొంత భవనాలు ఉ న్నాయి. చిట్యాల మండలం చల్లగరిగేలోని ఆయుష్ (హో మియో) ఆస్పత్రి గ్రామపంచాయతీ భవనంలో కొనసాగుతోంది. మిగతా ఆస్పతులు అన్ని పీహెచ్‌సీల్లో భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో ఆయుష్ ఆస్పత్రులు ఉన్న విషయం ఎక్కువ మందికి తెలియకపోవడం అతియోశక్తి కాదు. చాలా ఆస్పత్రులు పీహెచ్‌సీల్లోను కొనసాగుతోండటంతో సనాతన ఆయుర్వేదిక్ వైద్యానికి, అల్లోపతి వెద్యానికి ప్రజలకు తేడా తెలియడం లేదు.
ఆయుష్ ఆస్పత్రులకు పూర్వవైభవం తెస్తామంటున్న ప్రభుత్వం కనీసం ఆయుష్ ఆస్పత్రులకు సొంత భవనాలు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పక్క భవనాలుంటే ప్రజలకు ఆయుష్ ఆస్పత్రుల గురించే తెలిసే అవకాశం ఉంటుంది. తద్వారా వారు ఆయుష్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇప్పటికి చాలామంది కీళ్ల నొప్పులు, వాతం, పక్షవాతం, బీపీ, షుగర్, చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలపై చాలా మంది రోగులు ఆయుర్వేదంనే నమ్ముకుంటున్నారు. కరోనా కారణంగా ఆయుష్ ప్రాముఖ్యం పెరిగినప్పడికి, ప్రజలకు ఆ ఆస్పత్రుల పట్ల అవగాహన కల్పించేవారు లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వంపై సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాల్సిన అవసరముంది.
అరకొర సిబ్బంది..
జిల్లాలో ఆయుష్ ఆస్పత్రులకు సొంత భవనాలతో పాటు సిబ్బంది సమస్య వేధిస్తోంది. కొన్ని దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, కొన్నిచోట్ల ఇద్దరులేని పరిస్థితి కూడా నెలకొంది. కొడవటంచ, మొగుళ్లపల్లి, మహాదేవ్‌పూర్, వల్లమ్మకుంట ఆస్పత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు లేరు. కాటారం, ధర్మారావుపేట, కొడవటంచ, చల్లగరిగె, మహాముత్తారం, మహాదేవ్‌పూర్, మొగుళ్లపల్లి, వల్లమ్మకుంట ఆస్పత్రుల్లో ఫార్మసిస్టు పోస్టులు భర్తీ కాలేదు. కొడవటంచ, మహదేవ్పూర్, మొగుళ్లపల్లి, వల్లమ్మకుంట ఆస్పత్రుల్లో ఇద్దరులేని పరిస్థితి ఉంది. మహాదేవ్‌పూర్, మొగుళ్లపల్లి ఆయుష్ ఆస్పత్రులు డోర్‌లాక్ ఉండటం గమనార్హం.
కమిషనర్ పర్యటనతోనైనా..
రాష్ట్ర ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి వచ్చేవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఆయుష్ జిల్లా ఆస్పత్రి నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న నేపథ్యంలో భూపాలపల్లిలో కమిషనర్ పర్యటించనున్నారు. ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్ సేవలపై ఆమె అఽధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆస్పత్రులకు సొంతభవనాలు, సిబ్బంది నియామకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే కమిషనర్ పర్యటనలోనైనా ఆయుష్ ఆస్పత్రులకు సొంత భవనాలు మంజూరు అవుతాయో చూడాలి మరి.
చాలాసార్లు ప్రతిపాదనలు పంపాం..
- డాక్టర్ రవినాయక్, ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్
జిల్లాలోని ఆయుష్ ఆస్పత్రులకు సొంత భవనాలు నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వానికి చాలాసార్లు ప్రతిపాదనలు అందించాం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఆయుష్ ఆస్పత్రులకు సొంత భవనాలు నిర్మిస్తాం.
భూపాలపల్లి పీహెచ్సీలో నిర్వహిస్తున్న హోమియో ఆస్పత్రి
ఉప ఆరోగ్యశాఖ భవనంలో నిర్వహిస్తున్న వల్లెంకుంట యూనాని ఆస్పత్రి