ఇల్లు కట్టేదెలా?

ABN , First Publish Date - 2021-01-08T05:28:36+05:30 IST

ఇంటి నిర్మాణ వ్యయం తడిచిమోపెడవుతోంది. ఇసుక, ఇనుము, సిమెంట్‌ కొండెక్కి కూర్చున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకోగా ఇదే అదనుగా సిమెంటు కంపెనీలు ధరలు అమాంతం పెంచేశాయి. రోజురోజుకూ మారుతున్న ధరలు నిర్మాణదారులను హడలెత్తిస్తున్నాయి. ఇల్లు కకట్టాలంటేనే గుండె గుబేల్‌ మనే పరిస్థితి కనిపిస్తోంది

ఇల్లు కట్టేదెలా?
నిలిచిపోయిన ఇంటి నిర్మాణం (ఫైల్‌)

చుక్కల్లో సిమెంటు, ఇనుము ధరలు

నెల వ్యవధిలో నాలుగు సార్లు పెరుగుదల

వెంటాడుతున్న ఇసుక కొరత 

సంక్షోభంలో భవన నిర్మాణరంగం

తడిచి మోపెడవుతున్న వ్యయం

బెంబేలెత్తిపోతున్న బిల్డర్లు

పెరిగిన మధ్య తరగతి బడ్జెట్‌

మధ్యలోనే పనులు నిలిపివేత

దిక్కుతోచని స్థితిలో కార్మికులు 





ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 7 : సిమెంటు, స్టీలు ధరలు చుక్కల్లో చేరాయి. ఇసుక సమస్య వెంటాడుతోంది. దీంతో నిర్మాణ రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. సిమెంటు నెల వ్యవధిలో బస్తా రూ. 50, ఇనుము టన్ను రూ. 15వేల మేర పెరిగింది. దీంతో ఇల్లు కట్టేందుకు సామాన్యులు వెనుకడుగు వేస్తుండగా, నిర్మాణాలు ప్రారంభించిన వారు అనున్న దానికంటే బడ్జెట్‌ అధికమవుతుండటంతో అర్ధంతరంగా నిలిపివేస్తున్నారు. ధరాభారంతో బిల్డర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. నిర్మాణాల కొనసాగింపుపై మీమాంసలో పడ్డారు. ఫలితంగా ఆ రంగంపై ఆధారపడి జీవించే వేలాది మంది కూలీలకు ఉపాధి కష్టాలు మొదలయ్యాయి.  కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న సమయంలో నెలకొన్న ఈ పరిస్థితి వారిని ఆందోళ నకు గురి చేస్తోంది. 

 ఇంటి నిర్మాణ వ్యయం తడిచిమోపెడవుతోంది. ఇసుక, ఇనుము, సిమెంట్‌ కొండెక్కి కూర్చున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకోగా ఇదే అదనుగా సిమెంటు కంపెనీలు ధరలు అమాంతం పెంచేశాయి. రోజురోజుకూ మారుతున్న ధరలు నిర్మాణదారులను హడలెత్తిస్తున్నాయి. ఇల్లు కకట్టాలంటేనే గుండె గుబేల్‌ మనే పరిస్థితి కనిపిస్తోంది.


సి‘మంట’.. చుక్కల్లో స్టీలు 

సిమెంట ధర మండిపోతోంది. ఈ ఏడాది  ఆరంభంలో బస్తారూ. 200 పలికగా,  ఆతర్వాత రూ. 300కు చేరింది. అనంతరం కంపెనీలు దశలవారీగా రూ. 310, 325, 380కి పెంచాయి. నెల వ్యవధిలోనే ఇలా బస్తాకు రూ. 80మేర పెరిగింది. గత నెలలో ఐరన్‌ టీఎంటీటన్ను రూ. 43 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 58 వేలకు చేరింది. వైజాగ్‌స్టీల్‌రూ.54 వేల నుంచి రూ. 60 వేలకు చేరింది. ప్రస్తుతం టీఎంటీ టన్ను రూ. 47 వేలు, విశాఖ రూ. 69 వేలకు పెరిగింది. ఒక నెలలోనే టన్నుకు రూ.15వేలు పెరగడం పెను భారంగా మారింది.  ఇసుక కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిర్మాణదారులను సిమెంటు, ఇసుక ధర కన్నీరు పెట్టిస్తున్నాయి. 


దిక్కుతోచని స్థితిలో బిల్డర్లు

భవన నిర్మాణాలకు సాధారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌ మంచి సీజన్‌. అయితే ఈ ఏడాది కరోనాతో లాక్‌డౌన్‌ దెబ్బ పడింది. అక్టోబర్‌ వరకూ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఈ సమయంలో సిమెంటు, ఐరన్‌ కంపెనీలు ధరలు అమాంతం పెంచేశాయి. దీంతో బిల్డర్లు హడలిపోతున్నారు. గృహాలు, అపార్ట్‌మెంట్‌లలో ప్లాట్లు విక్రయించే సమయంలో చేసుకునే ఒప్పందాలు భవన నిర్మాణ మెటీరియల్‌ ధరల హెచ్చు తగ్గుదలకు సంబంధం ఉండదు.పెరిగిన ధరల ప్రకారం యూనిట్‌ వ్యయాన్ని పెంచే నిబంధన (కాస్ట్‌ ఎస్కలేషన్‌ క్లాజు) ఉండదు. ప్లాటు అమ్మే సమయంలో చదరపు అడుగు స్థలానికి ఇంత ధర అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరిగినా దాన్ని బిల్డర్లే భరించాల్సి ఉంటుంది. భవన నిర్మాణ మెటీరియల్‌ పెరిగిన ప్రతిసారి కొనుగోలుదారుని వద్ద వసూలు చేయలేని పరిస్థితి. దీంతో పెరిగిన సిమెంటు ధరలు బిల్డర్లును భాధిస్తుందని బిల్డింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. 


తీరని ఇసుక ఇక్కట్లు

జిల్లాలో ఇసుక ఇక్కట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలని, అందుకోసం అతి తక్కువ ధరకే అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. నిబంధనల ప్రకారం ఇసుక లభ్యత లేకపోవడం కూడా నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మాణదారులు  అంటున్నారు.  ధర అదుపునకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


వేలాది మందికి ఉపాధి దూరం

భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జిల్లాలో వేలాది కార్మికులు పని చేస్తున్నారు.  బేల్దారి కూలీలు, కరెంటు, పెయింటింగ్‌, సెంట్రింగ్‌, కాంక్రీట్‌ కార్మికులతోపాటు ఫ్లోరింగ్‌, కబోర్డ్స్‌, కిటికీలు, తలుపు, తదితర వృత్తులు సంబంధించిన వ్యక్తులు ఉపాధి పొందుతుంటారు.  ఒక్క ఒంగోలులోనేరోజుకు10 వేలమంది కార్మికులు పనిచేస్తుంటారు. దీనికితోడు వ్యవసాయ కూలీలు అనేక మంది పట్టణాలకు వచ్చి బేల్దారి పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరందరినీ ప్రస్తుత పరిస్థితి కలవరానికి గురి చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ లాక్‌డౌన్‌తో పస్తులు కూడా ఉండాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో సిమెంటు, ఐరన్‌ ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం సంక్షోభంలోకి వెళ్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-01-08T05:28:36+05:30 IST