ఆరోగ్యానికి ఎంతో అవసరమైన తెల్ల రక్తకణాలను పెంచుకోవాలంటే ఇంట్లోనే ఇలా చేయండి..!

ABN , First Publish Date - 2022-04-05T17:27:50+05:30 IST

తెల్ల రక్తకణాలు వ్యాధులతో పోరాడే సైనికులని మనకు తెలుసు. మన శరీరం రోజుకు పది లక్షల తెల్ల రక్తకణాలను తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇవి శరీరంలోకి చొరబడే

ఆరోగ్యానికి ఎంతో అవసరమైన తెల్ల రక్తకణాలను పెంచుకోవాలంటే ఇంట్లోనే ఇలా చేయండి..!

ఆంధ్రజ్యోతి(05-04-2022)

తెల్ల రక్తకణాలు వ్యాధులతో పోరాడే సైనికులని మనకు తెలుసు. మన శరీరం రోజుకు పది లక్షల తెల్ల రక్తకణాలను తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇవి శరీరంలోకి చొరబడే వేర్వేరు వ్యాధికారక క్రిములను పసిగట్టి, సంహరిస్తూ ఉంటాయి. అయితే మనం తరచూ చిన్నాచితకా అనారోగ్యాల బారిన పడుతున్నామంటే, తెల్లరక్తకణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అనుమానించి, వెంటనే వాటిని పెంచే చర్యలు చేపట్టాలి. 


ఏ పరిమాణంలో?

నార్మల్‌: ఒక మైక్రోలీటరు రక్తంలో 4,500 నుంచి 10,500 తెల్ల రక్తకణాలు 

లో కౌంట్‌: ఒక మైక్రోలీటరు రక్తంలో 4,500 కంటే తక్కువ తెల్ల రక్తకణాలు 

హై కౌంట్‌: ఒక మైక్రోలీటరు రక్తంలో 11 వేలకు మించిన తెల్ల రక్తకణాలు.


తెల్ల రక్తకణాల్లో రకాలు

న్యూట్రోఫిల్స్‌: ఇవి బ్యాక్టీరియా, వైరస్‌ సంబంధిత ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి.

ఇసినోఫిల్స్‌: పేగుల్లో పురుగులు మొదలైన పెద్ద పరాన్నజీవులతో పోరాడతాయి. అలర్జీ కారకాలతో పోరాడే యాంటీబాడీలను విడుదల చేస్తాయి.

బాసినోఫిల్స్‌: అలర్జీ రియాక్షన్‌కు గురైనప్పుడు, హిస్టమిన్‌ విడుదల చేస్తాయి. 

లింఫోసైట్స్‌: వీటిలో బి, టి, న్యాచురల్‌ కిల్లర్‌ కణాలు ఉంటాయి. బి సెల్స్‌ వైర్‌సలను కనిపెట్టి, వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీలు విడుదల చేస్తే, టి, న్యాచురల్‌ సెల్స్‌ వైర్‌సలు, కేన్సర్లు సోకిన కణాలతో పోరాడతాయి. 

మోనోసైట్స్‌: ఇవి మాక్రోఫేజులుగా మారి కణ శిధిలాలను సంగ్రహిస్తాయి. 


కణాలు తగ్గడానికి కారణాలు 

ఎముక మజ్జలో తయారయ్యే ఈ తెల్ల రక్తకణాలు తగ్గడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే... 

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు 

పుట్టుకతో వెంట వచ్చే జబ్బులు 

కేన్సర్లు 

ఆటోఇమ్యూన్‌ డిజార్డర్లు 

మద్యపానం

యాంటీబయాటిక్స్‌ వాడకం

పోషకాహారలోపం


లక్షణాలు ఇవే!

తెల్ల రక్తకణాల తగ్గుదల కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంది. విపరీతమైన జ్వరం, చలి, చమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ మూలంగా తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోతే, వాపులు, నోటి పుండ్లు, గొంతు నొప్పి, విపరీతమైన దగ్గు, శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాలు మొదలవుతాయి.


తెల్ల రక్తకణాలను ఇలా పెంచుకోవచ్చు...

వెల్లుల్లి: వంటకాల్లో వెల్లుల్లిని వాడుతూ ఉండాలి. పచ్చివి తినగలిగితే అలాగే తినవచ్చు.

పాలకూర: విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పాలకూరను ప్రతి రోజూ తింటూ ఉండాలి. వీలైతే రోజూ రెండు టేబుల్‌ స్పూన్ల పాలకూరను ఆహారంతో కలిపి వండుకుని తీసుకోవాలి.

బొప్పాయి ఆకులు: ఈ ఆకుల్లో ఉండే ఎసిటోజెనిన్స్‌తో తెల్ల రక్తకణాలు పెరిగి, రోగనిరోధకశక్తి సమకూరుతుంది. ఆకులను నీళ్లతో కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. తర్వాత దీన్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడగట్టి, ఒక టేబుల్‌స్పూను రసం తీసుకోవాలి. ఇలా ప్రతి రోజూ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

పెరుగు: పెరుగులోని ప్రొబయాటిక్స్‌ తెల్ల రక్తకణాలను వృద్ధి చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ అర కప్పు పెరుగు తింటూ ఉండాలి.

కివి: ఈ పండులో తెల్ల రక్తకణాల పెరుగుదలకు తోడ్పడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఇ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజుకు రెండు పండ్లు తినాలి. 

పొద్దుతిరుగుడు విత్తనాలు: వీటిలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, విటమిన్‌ ఇ, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజుకు రెండు టీస్పూన్ల సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌ తింటూ ఉండాలి.



Updated Date - 2022-04-05T17:27:50+05:30 IST