HYD : వర్షాలకు ఇళ్లలోకి పాములు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

ABN , First Publish Date - 2021-07-22T19:33:22+05:30 IST

వర్షా కాలంలో నగరంలో రోడ్లపై నీరు నిలవడం, ఇళ్లలోకి వరద నీరు చేరడం సర్వసాధారణమైంది.

HYD : వర్షాలకు ఇళ్లలోకి పాములు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

  • భారీ వర్షాలు.. ఇళ్లల్లోకి పాములు 
  • గతేడాదితో పోలిస్తే పెరిగిన సంఖ్య : స్నేక్‌ సొసైటీ సభ్యులు
  • నగరంలోని పాముల్లో నాగుల సంఖ్యే అధికం

హైదరాబాద్‌ సిటీ : వర్షా కాలంలో నగరంలో రోడ్లపై నీరు నిలవడం, ఇళ్లలోకి వరద నీరు చేరడం సర్వసాధారణమైంది. ఇటీవలి కాలంలో శివార్లలో విష సర్పాలు కూడా ఇళ్లల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా బీరంగూడ, లింగంపల్లి, హయత్‌నగర్‌, వనస్థలిపురం, బడంగ్‌పేట, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, అత్తాపూర్‌, షేక్‌పేట, దమ్మాయిగూడ తదితర ప్రాంతాలలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులు. పాముల ఆవాస ప్రాంతాలను సైతం మనుషులు ఆక్రమిస్తుండటం, వాటికి మనుగడ కష్టం కావడంతో జనావాసాల్లోకి వస్తున్నాయని, దీనికితోడు సీజన్‌ మార్పు కూడా పాములు ఎక్కువగా ఇళ్లలోకి రావడానికి కారణంగా చెబుతున్నారు. గత ఏడాది 8,893 పాములను పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టగా.. ఈ ఏడాది ఆరు నెలల్లో 4,793 పాములను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టామని తెలిపారు. జూలై తొలి వారంలోనే 178 పాములను గ్రేటర్‌ పరిధిలో పట్టుకున్నామని, వీటిలో 98 నాగుపాములే అని చెప్పారు.


రోజుకు వందకుపైగా ఫోన్‌ కాల్స్‌.. 

పాముల రక్తం చల్లగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాయి. అవి సాధారణంగా బొరియల్లో, ఇటుకల మధ్యన లేదంటే రాళ్ల కింద ఉండటానికి ప్రయత్నిస్తుంటాయి. వర్షాకాలం వాటి ఆవాసానికి భంగం కలగడంతో ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతూ ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, ఆఫీసులలో చేరిపోతుంటాయి. ఈ విషయమై ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ జనరల్‌ సెక్రటరీ అవినాష్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. జూలై-డిసెంబర్‌ కాలంలో పాములను అధికంగా రెస్క్యూ చేస్తామన్నారు. స్నేక్‌ సొసైటీ (8374233366)కి రోజుకు 100కు పైగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, ఆఫీసులు, ఇళ్లలో చేరిన పాములను పట్టుకోమనే అభ్యర్థనలే వీటిలో ఎక్కువ అని అన్నారు. 150 మంది వలంటీర్లు పాములను పట్టుకుని అడవుల్లో విడిచిపెడుతున్నారని ఆయన తెలిపారు.


నాగుపాములే ఎక్కువ.. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో నాగుపాములు ఎక్కువగా కనబడతాయి. కాపాడిన వాటిలో 57 శాతం అవే ఉంటాయి. ఆ తర్వాత జెర్రిపోతులు 26 శాతం, రక్తపింజరి 5 శాతం, కట్లపాములు 4 శాతం, విషపూరితం కాని పాములు 10 శాతం ఉంటాయి. విషపూరితం కాని పాముల్లో 17 రకాల పాములు ఇక్కడ కనిపిస్తుంటాయి.


పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- ప్రాంగణాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఎలుకలు ఇళ్లలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలంకరణ కోసం పెట్టుకున్న మొక్కలను తగిన రీతిలో ట్రిమ్‌ చేస్తే పాములు చేరినా స్పష్టంగా కనబడతాయి.

- అవసరం లేని పదార్థాలను ఖాళీ ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉంచితే కప్పలు, బల్లులు, ఎలుకలతోపాటు పాములు వచ్చే అవకాశం ఉంది. 

- గుడిసెలలో నివసించే వారు మంచం మీద లేదా దోమ తెరలను చుట్టూ కట్టుకొని నిద్రపోవడం మంచిది.

- పాము కనిపిస్తే అటవీశాఖ, స్నేక్‌ రెస్క్యూ సంస్థలకు సమాచారం ఇవ్వాలి.

- పాము కరిస్తే దగ్గరలోని ఆస్పత్రులను సంప్రదించి వినోమ్‌ ఇంజెక్షన్‌ తీసుకోవాలి.   

Updated Date - 2021-07-22T19:33:22+05:30 IST