కుల సమస్యను ఎలా చూడాలి?

ABN , First Publish Date - 2021-04-18T06:01:39+05:30 IST

‘మనువు, బ్రాహ్మణవర్గం సృష్టించిన కులవ్యవస్థ–అంబేడ్కర్ అభిప్రాయాలు’ అంటూ మనం నిత్యం చదువుతుంటాం. అయితే ఈ విషయంలో అంబేడ్కర్...

కుల సమస్యను ఎలా చూడాలి?

‘మనువు, బ్రాహ్మణవర్గం సృష్టించిన కులవ్యవస్థ–అంబేడ్కర్ అభిప్రాయాలు’ అంటూ మనం నిత్యం చదువుతుంటాం. అయితే ఈ విషయంలో అంబేడ్కర్ అసలు ఏమి చెప్పారో తెలుసుకుంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. 1916 మే 9న అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం జరిగిన ఒక సెమినార్‌లో అంబేడ్కర్ ‘ఇండియాలో కులాలు, వాటి నిర్మాణం, పుట్టుక, అభివృద్ధిక్రమం’ (CASTES IN INDIA: Their Mechanism, Genesis and Development) అనే ఒక పరిశోధనాపత్రాన్ని సమర్పించారు. ఇందులో మొత్తం 47 పేరాలున్నాయి. 1936లో వెలువడిన ఆయన సుప్రసిద్ధ రచన ‘కులనిర్మూలన’లోను, 1944లో దాని మూడవ ప్రచురణలోనూ ఆ పరిశోధనాపత్రాన్ని యథాతథంగా చేర్చారు. తర్వాతి కాలంలో అంబేడ్కర్ దానిని ఎన్నడూ మార్చలేదు. అంటే ఆ పరిశోధనాపత్రాన్ని ఆయన ప్రామాణిక రచనగా భావించాలి. 


‘సత్యాన్వేషణ కోసం పరిశోధనలో అనుసరించవలసిన సరైన మార్గాన్ని తెలియజేయడమనేది ఈ పరిశోధనాపత్రం ప్రధానోద్దేశం. అయితే విషయం పట్ల పక్షపాతవైఖరిని అనుసరించకుండా జాగ్రత్తపడాలి. సైన్స్ పరిధి నుంచి సెంటిమెంటు అంశాన్ని దూరంగా ఉంచాలి. విషయాన్ని వాస్తవిక (ఆబ్జెక్టివ్) దృక్కోణం నుంచి చూడాలి’ అని అంబేడ్కర్‌ తన థీసిస్ గురించి నొక్కిచెప్పారు. కులసమస్య, దాని పుట్టుకపై ఆయనను ఉటంకించి చెప్పదగిన ముఖ్యాంశాలెన్నో ఈ పరిశోధనాపత్రంలో దర్శనమిస్తాయి. ఉదాహరణకు తమ తమ కులాలలోనే పెళ్ళిళ్ళు జరగటమనేది. ఆయా కులాలకు వెలుపల పెళ్లి నిషిద్ధం. -ఇదే కులవ్యవస్థ సారాంశంగా ఉంది. ఇదే కులవ్యవస్థ పుట్టుకను, నిర్మాణాన్నీ నిర్ధారించే లక్షణంగా ఉంటోంది. ‘A Caste is an Enclosed Class (కులమనేది పరివృతమై వున్న ఒక వర్గం)’ వంటి మౌలిక ప్రతిపాదనలను పేర్కొనవచ్చు. 


అయితే అంబేడ్కర్ అనుయాయులలో పలువురు ఈ పరిశోధనాపత్రంలోని అనేక ముఖ్యాంశాలను విస్మరించారు లేదా వక్రీకరించారు. అలాంటి అంశాలను ప్రస్తావించటమే ఈ వ్యాసం లక్ష్యం. ఉదాహరణకు ఆ పత్రంలో వర్గపునాది గురించి ఆయన ఇలా నొక్కి చెప్పారు: ‘వ్యక్తులచే సమాజనిర్మాణం జరిగిందనేది చాలా నేలబారు మాట.సమాజం ఎల్లప్పుడూ వర్గాలతోనే కూడి ఉంది. ఇది సర్వత్రా వ్యాపించి ఉన్న సత్యం, దీనికి హిందూసమాజమేమీ మినహాయింపు కాదు. వ్యక్తి ఏదో వర్గంలో ఎల్లప్పుడూ భాగమే...’ఇలాటి అంబేడ్కర్ అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన వాటిని ఆయన అభిప్రాయాలుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఓటుబ్యాంకు రాజకీయాలకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వాటికి ఎటువంటి చారిత్రక, సామాజిక ఆధారాలూ లేవు. ప్రజలను అన్యాయాలకు వ్యతిరేకంగా ఏకం చేయటానికి ప్రయత్నించకుండా, వారిని కులాలు, ఉపకులాలుగా విభజించడానికే వీరు ఉత్సాహం చూపుతున్నారు. 


1927 డిసెంబరు 25న అంబేడ్కర్, ఆయన అనుయాయులు కలిసి మనుస్మృతిని తగులబెట్టారని తెలిసిందే. అయితే అంబేడ్కర్ స్నేహితుడు, బ్రాహ్మణుడు అయిన సహస్రబుద్ధే చేతుల మీదుగా ఈ పని జరిపించారని చాలామందికి తెలియదు. మహద్ చెరువు నుంచి తాగునీటిని పొందడం కోసం అప్పటివరకూ జరుగుతున్న ఆందోళనకు కొనసాగింపుగా, సాంకేతికంగా, సింబాలిక్‌గా ఈ చర్య జరిగింది. అంతేకాని, ‘మనువు, బ్రాహ్మణవర్గం సృష్టించిన కులవ్యవస్థ ఇది’ అని ఆయన చెప్పలేదు. 


‘నేను కచ్చితంగా చెప్పదలచుకున్నదేమంటే – మనువు అనేవాడొకడుంటే - అతను కులసిద్ధాంతాన్ని సృష్టించలేదు, సృష్టించలేడు కూడా. కులవ్యవస్థను ఎవరో రూపొందించి ఇచ్చారు అన్నది ఊహకు అందని అంశం. అది మనువుకి చాలాముందు నుంచే  వ్యవహారంలో ఉంది. అతను దానిని సమర్థించి ఒక సిద్ధాంతంగా క్రోడీకరించాడు. కులధర్మాన్ని ప్రబోధించాడు. దీనితో అతని కర్తవ్యం ముగిసింది. ప్రస్తుత హిందూసమాజాన్ని అతనేమీ నిర్దేశించలేదు; నిర్దేశించలేడు కూడా’ (పేరా 34). 


‘ఈ కులవ్యవస్థ పరివ్యాప్తి, వృద్ధి చాలా పెద్దవి. ఎవరో ఒక వ్యక్తో, ఒక వర్గమో తమ కుటిలశక్తితో సృష్టించి, పెంచి పోషించినవి కాదు. అలాంటిదే బ్రాహ్మణులు కులవ్యవస్థను సృష్టించారనే సిద్ధాంతం కూడా. మనువు గురించి నేను చెప్పినదాని తర్వాత దీనిపై ఇంకా చెప్పాల్సిందేమీ లేదు. అంటే అది సరైన ఆలోచన కాదని, అలా సిధ్ధాంతీకరించటం దుర్మార్గలక్ష్యంతోనే (malicious in intent) జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. బ్రాహణులు ఎన్నో అకృత్యాలు చేసి ఉండవచ్చుగాక, చేశారు కూడా... కానీ వారిచే కులసృష్టి జరిగింది అనేది, దాన్ని బ్రాహ్మణేతరులపై రుద్దారనేదీ అవాస్తవం. అది వారి చేతులలో లేనిది. దానికి వారు దోహదం చేసి ఉండవచ్చు. అంతేకానీ, తాము తలచినట్టుగా ఒక సమాజాన్ని రూపొందించటం ఎవరికైనా అసాధ్యం’’ (పేరా 34).


‘కులం అనేది శాస్త్రం సృష్టించినది. శాస్త్రం తప్పు కాజాలదు. అందువల్ల అది మంచికోసమేనని సనాతన హిందువులు నమ్ముతుంటారు. ఈ వాదనలను నేను వ్యతిరేకిస్తూ వచ్చాను. మతధర్మాన్ని శాస్త్రీయ వివరణ స్థాయికి తీసుకువెళ్లే వైఖరిని ఖండించటం నా లక్ష్యం. మతవాదులు ఎంతగా బోధించినా ఈ కులసృష్టి జరగదు. అలాగే సంస్కర్తలు ఎంత ప్రచారం చేసినా కులవ్యవస్థ రద్దు కాదు- అనేదే నేను చెప్పేది’ అని అంబేడ్కర్ అంటారు (పేరా34). రాజ్యాంగనియమం కూడా ఒక సంస్కరణే అని మనం గుర్తించాలి. రాజ్యాంగాన్ని నేటి ధర్మశాస్త్రంగా, భగవద్గీతగా కొందరు భావిస్తున్నారు. అంటరానితనం తదితర ప్రమాదకర ధోరణులను నేరాలుగా పరిగణిస్తూ, వాటిని ఆచరించేవారికి కఠినశిక్షలు ప్రకటించినా, ఈ దురాచారాలు ఈనాటికీ యథేచ్ఛగా కొనసాగటం చూస్తున్నాం. ఫూలే, నారాయణ గురు, పెరియార్, అంబేడ్కర్ వంటి సంస్కర్తలు ఎంత ప్రచారం చేసినా కులవ్యవస్థ రద్దు కాదు, కాలేదు అన్నది ఆచరణలో నిగ్గుతేలిన పరమ సత్యం. ‘మరి కులం ఎలా జనించింది అంటే మానవసమాజ జీవనక్రమంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనుకోకుండా రూపొందిన వ్యవస్థ (unconscious growth in the life of a human society under peculiar circumstances) అది అని చెప్పవచ్చును. (చివరి పేరా 47). 


హిందూమతంలో మినహా ఇతర మతాలలో స్వతహాగా కులం లేదు. కానీ మనదేశంలో ఆయా మతాలవారు ఒకరికొకరు కులాల లాటివారే అయ్యారని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు (పేరా 44). ఒకే వంశంలో కొందరు మతం మారటం, కొందరు మారకపోవటం చూస్తుంటాం. వారికి కులం మాత్రం అలాగే ఉండిపోతుంది. క్రిస్టియన్ అయినా తమ కులం క్రిస్టియన్నే పెళ్లి చేసుకుంటారు. గోవా రాజకీయాలలో ఇరుపక్షాలూ క్రిస్టియన్లే అయినా, (బ్రాహ్మణ, బ్రాహ్మణ వ్యతిరేక) కులం ప్రాతిపదికన వ్యవహరిస్తున్నట్టు అక్కడ దశాబ్దాలు పని చేసిన ‘హిందూ’ పత్రిక విలేఖరి చెప్పారు. అంత బలంగా కాకపోయినా ముస్లిములలో కూడా ఇది ఉంది. మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాల క్రితమే ముస్లిములలో 100కి పైగా కులాల జాబితాను తయారు చేశారు; వారికి రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేశారు. కొన్ని కులాలు బిసీ కేటగిరీని సాధించుకున్నాయి కూడా. చివరికి మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం కూడా గత ఏడాది కొన్ని ముస్లిం కులాలకు అలాంటి రిజర్వేషన్‌ను ఆర్డినెన్స్ ద్వారా కల్పించింది. తర్వాత కోర్టు వీటిలో కొన్నిటిని కొట్టేసింది. ఇప్పటికీ దక్షిణాదిలో కొన్ని ముస్లిం కులాలకు రిజర్వేషన్ అమలులో ఉన్నది. అగ్రకులానికి చెందిన ఖాన్‌లు ఖురేషీలను, దూదేకులవారినీ పెళ్లి చేసుకోరు (వారు కోటీశ్వరులైతే తప్ప). అలా కులం ఇతర మతాల్లో కూడా ఉంది - వారికి హిందూమతం, మనుధర్మం వర్తించకపోయినా! పాకిస్థాన్‌లో, బంగ్లాదేశ్‌లో కూడా ఈ కుల వ్యవస్థ ఉంది. అంబేడ్కర్ బౌద్ధం స్వీకరించారు కాని అందులోనూ కులం ఉంది. మన దేశంలోని దళితులు మతం మార్చుకున్నా పెళ్లిలో కులం, ఉపకులం పాటిస్తూనే ఉన్నారు. శ్రీలంక బౌద్ధులలో కూడా–అక్కడి పెళ్లి ప్రకటనలలోనే కాక, పార్టీ టికెట్లలో కూడా–కులం కనబడుతుంది. దక్షిణాసియా అంతటా కాస్త అటూ ఇటూగా అది ఉంది.


దక్షిణాదిలో కులాన్ని ఆర్య ద్రవిడ జాతి సిధ్ధాతంతో, ‘రేస్’తో ముడిపెట్టి చెప్పేవారు, ‘మూలవాసి’ సిద్ధాంతం చెప్పేవారు ఉన్నారు. దీన్ని కూడా అంబేడ్కర్‌ పరిశోధనాపత్రంలో ఖండించారు. ‘ఒక తెగ లేదా కుటుంబం ఆర్యులా లేక ద్రావిడులా అన్న విషయం గురించి విదేశీ స్కాలర్లు వచ్చి గీత గీసేదాకా- భారతీయులెన్నడూ పట్టించుకోలేదని, మనదేశంలో చాలా పూర్వమే శరీరవర్ణం ప్రాధాన్యం కోల్పోయిందని అంబేడ్కర్‌ అన్నారు (46వ పేరా). 


కులసమస్యను వాస్తవిక (ఆబ్జెక్టివ్) దృక్కోణం నుంచి, పక్షపాతం లేకుండా చూసి, సైన్సులో మాదిరిగా జాగ్రత్తపడాలి. సెంటిమెంటును దూరంగా ఉంచాలి అన్న అంబేడ్కర్ మాటలు శిరోధార్యం. కులనిర్మూలన బదులు దాన్ని శాశ్వతం చేసే విధానాలను మనం వ్యతిరేకించాలి. 

ఎం. జయలక్ష్మి 

రిటైర్‌్డ ఏజీఎం, ఆప్కాబ్‌

Updated Date - 2021-04-18T06:01:39+05:30 IST