లంబో‘ధర’ కొలిచేదెలా?

ABN , First Publish Date - 2022-08-18T06:11:54+05:30 IST

ఆదిదేవుడు, విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు.

లంబో‘ధర’ కొలిచేదెలా?
సిరిసిల్లలో గణేష్‌ విగ్రహాలు

-  పెరిగిన విగ్రహాల ధరలు 

- గతేడాది కంటే 30 శాతం అధికం 

- సిరిసిల్ల కేంద్రంగా విగ్రహాల తయారీ

- జిల్లాలో వినాయక ఉత్సవాలకు ఏర్పాట్లు  

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆదిదేవుడు, విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు.  నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  కరోనా మహమ్మారితో రెండు సంవత్సరాలపాటు ఉత్సవాలకు దూరమయ్యారు.   ఈసారి కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలను  ఘనంగా జరుపుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈసారి విగ్రహాల ధరల పెరుగుదలతో ఉత్సవాలు భారం కానున్నాయి.  డిజీల్‌ ధరల పెరుగుదల, విగ్రహాల తయారీ ముడిసరుకులు, కూలీ రేట్లు, రంగుల ధరలు పెరగడంతో విగ్రహాల ధరలు భారీగా పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా తయారైన విగ్రహాలు కరీంనగర్‌, కామారెడ్డి, సిద్దిపేట, జిల్లాలకు తీసుకెళ్తుండగా భారీ విగ్రహాలను మహారాష్ట్ర నాందేడ్‌, హైదరాబాద్‌, ప్రాంతాల నుంచి సిరిసిల్లకు తీసుకొస్తున్నారు. విగ్రహాల ధరలతోపాటు రవాణా చార్జీలు నిర్వాహకులకు భారంగా మారాయి. ఈ సారి ఆరుఫీట్ల విగ్రహమే రూ.18 వేల నుంచి రూ .20 వేల వరకు విక్రయిస్తున్నారు. భారీ విగ్రహాలు రూ.60 వేల వరకు లభిస్తున్నాయి. విభిన్నంగా ఉన్న భారీ విగ్రహాలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు  ధర పలుకుతున్నాయి. సిరిసిల్లలోని స్థానిక కళాకారులతోపాటు రాజస్థాన్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల కళాకారులతో విగ్రహాలను తయారు చేయించారు. ఇక్కడ తయారైన విగ్రహాలతోపాటు వరంగల్‌, కోరుట్ల, జగిత్యాల, కామారెడ్డి ప్రాంతాల నుంచి సిరిసిల్లకు విగ్రహాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.  సిరిసిల్ల కేంద్రంగా వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, మండలాలల్లోని వివిధ గ్రామాల ఉత్సవాల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. 

ఉత్సవాల ఖర్చు రూ.10 కోట్ల పైనే 

జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ కోసం భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 5 వేల వరకు భారీ విగ్రహాలను ప్రతిష్టించే అవకాశం ఉంది. ఇందుకోసం రూ.10 కోట్లకు పైగానే నిర్వాహకులు ఖర్చు చేయనున్నారు. దీనికి తోడు అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించనున్నారు. వేములవాడ, సిరిసిల్ల, మున్సిపాలిటీల పరిధిలో ఎక్కువ సంఖ్యలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తే గ్రామాల్లో రూ.15 వేల నుంచి 60 వేల వరకు విగ్రహాల ఏర్పాటుకు ఖర్చు చేయనున్నారు. ఈ సారి గత సంవత్సరం కంటే 30 శాతం వరకు ఖర్చు భారం పెరిగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఇప్పటికే రూ.2.50 లక్షల వరకు విలువ చేసే భారీ విగ్రహాలను తీసుకొచ్చి సిద్ధం చేశారు. 

మట్టి వినాయకులపై ఆసక్తి 


బొజ్జ గణపయ్యను వివిధ రూపాల్లో కొలుస్తారు.  తొమ్మిది రోజులపాటు జరుపుకునే వినాయక ఉత్సవాల్లో మట్టి విగ్రహాల వైపు కూడా జనం ఆసక్తి చూపుతున్నారు.  నిమజ్జనం చేసే విగ్రహాలు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌,  రంగుల్లోని రసాయనాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా హాని కలిగిస్తాయని ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. దీంతో  ప్రజల్లో కూడా మార్పులు వచ్చాయి. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయకులను ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి. ఇళ్లలో సైతం  మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తున్నారు. వీటితోపాటు కొందరు మండపాల నిర్వాహకులు భారీ మట్టి వినాయకులను ఏర్పాటు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-18T06:11:54+05:30 IST