పాఠాల్లో లేని భాషని ఎలా పరిరక్షిస్తారు?

ABN , First Publish Date - 2022-03-17T08:43:32+05:30 IST

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ– తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి భాషా సంస్కృతుల పరిరక్షణ జరిగిందన్నారు...

పాఠాల్లో లేని భాషని ఎలా పరిరక్షిస్తారు?

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ– తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి భాషా సంస్కృతుల పరిరక్షణ జరిగిందన్నారు. తెలంగాణ భాషను ఒకప్పుడు జోకర్లకు పెట్టేవారని, ఇప్పుడు హీరోలకు పెడుతున్నారని అన్నారు. ఇది నిజంగా అంతగా చెప్పుకోవాల్సిన అంశమా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా ప్రభుత్వం కొన్ని అడుగులు వేసిన మాట నిజమే. తెలంగాణ కళాకారులను, కవులను గౌరవించడం, కాళోజీ దాశరథి పేరిట అవార్డులను నెలకొల్పడం, కాళోజీ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు, ప్రపంచ తెలుగు మహాసభలు దిగ్విజయంగా జరిపించడం, మహాకవి సినారె అంత్యక్రియలను ఆధికారిక లాంఛనాలతోనే కాక, ముఖ్యమంత్రి స్వయంగా ఒక పెద్ద కొడుకు లాగా దగ్గరుండి జరిపించడం వంటివి కేసీఆర్‌కు తెలుగు భాష పట్ల సంస్కృతి పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నాయి. అయితే మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోనే విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్‌, డిగ్రీ తరగతుల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పాఠ్య గ్రంథాలను తయారు చేయించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ వంటి మేధావులు, భాషా శాస్త్రవేత్తలు మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగాలని అంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా నిన్నటిదాకా ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే విద్యా బోధన జరగాలని కోరుకున్న వ్యక్తి. అలాంటిది ఆయనే వచ్చే సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల దశనుంచే ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రవేశపెడుతుంటే తెలంగాణ భాషకు పరిరక్షణ జరిగినట్లేనా! ప్రాథమిక విద్యా స్థాయిలో మాతృభాష ద్వారా బోధన జరగడమే మాతృభాష పరిరక్షణకు మొదటి మెట్టు కదా. ఆ మెట్టే తప్పితే తెలుగు భాషకు పట్టూ పరిరక్షణా ఉంటాయా? ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరుతున్నాను.

ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి


Updated Date - 2022-03-17T08:43:32+05:30 IST