అవినీతి ప్రక్షాళన ఎలా?

ABN , First Publish Date - 2020-12-29T09:02:51+05:30 IST

వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అమలుపరచడం ప్రారంభమైన తరువాత దొంగ వ్యాపారాలు పెరిగిపోతాయని, అంతటా నల్ల బజారు ...

అవినీతి ప్రక్షాళన ఎలా?

అధికార వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనకు ఉద్దేశించిన సంస్కరణలు ఎప్పుడు సఫలమవుతాయి? పై స్థాయిలో ప్రభుత్వం, కింది స్థాయిలో ప్రజలు దృఢసంకల్పంతో పటిష్ఠంగా వ్యవహరించినప్పుడు మాత్రమే వ్యవస్థలో మేలు మార్పులు సంభవిస్తాయి. సుపరిపాలన సుసాధ్యమవుతుంది.


వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అమలుపరచడం ప్రారంభమైన తరువాత దొంగ వ్యాపారాలు పెరిగిపోతాయని, అంతటా నల్ల బజారు విలసిల్లగలదనే భయాన్ని ఈ వ్యాసకర్త ఐదు సంవత్సరాల క్రితం వ్యక్తం చేశాడు. జీఎస్టీ అమలులోకి రాకముందు అక్రమ వ్యాపారి ముగ్గురు అధికారులను ‘మంచి’ చేసుకోవలసి ఉండేది. వారు- ఎక్సైజ్, అమ్మకం, రవాణా పన్ను అధికారులు. జీఎస్టీతో ముగ్గురికి బదులుగా ఒకే ఒక్క అధికారితో ‘సత్సంబంధాలు’ నెరపితే సరిపోతుంది. మరి ఈ సౌలభ్యం, దేశ ఆర్థిక వ్యవస్థలో అక్రమ లావాదేవీలు మరింతగా పెచ్చరిల్లిపోయేందుకు దారి తీయలేదూ? 


అధికారయంత్రాంగంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రభుత్వం పలు పటిష్ఠ చర్యలను అమలుపరిచింది. అత్యంత ప్రభావశీల చర్య అవినీతికి పాల్పడిన అధికారులతో బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించడం. అయితే, ఐఏఎస్ అధికారులు తమ శ్రేణుల్లో అవినీతిపరులను గుర్తించడానికి సుముఖత చూపడం లేదు! 


మనం భిన్నంగా ఆలోచించవలసి ఉంది. ‘ప్రాతినిధ్యం, అందుబాటు, సమధర్మం, న్యాయవర్తన’ గురించి అమెరికా వ్యవస్థాపకులు విశేష శ్రద్ధ చూపడం వల్లే అమెరికా ప్రభుత్వ యంత్రాంగంలో ఆ నాటి నుంచి ఈనాటికీ అవినీతి స్వల్పస్థాయిలో ఉంటుందని ప్రొఫెసర్ జాన్ జోసెఫ్ వాల్లీస్ (మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం) పేర్కొన్నారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు సంపూర్ణ సాధికారత కల్పించాలని అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. సివిల్ సర్వెంట్లకు ప్రాధాన్యమిస్తూ అవినీతి వ్యతిరేక చర్యలు సాధించిన లేక సాధించని ఫలితాలను ఇటీవల ‘వరల్డ్ డెవలప్‌మెంట్’లో వెలువడిన ఒక వ్యాసం సమగ్రంగా సమీక్షించింది. ఈ అధ్యయనంలో సివిల్ సర్వెంట్ల తీరుతెన్నులను నిశితంగా పరీక్షించారు. అవినీతి నిరోధక సంస్థల (మన పోలీసు శాఖ, కేంద్ర నిఘా సంఘం లాంటివి) పని తీరు ప్రభావశీలంగా లేదని ఆ అధ్యయనంలో వెల్లడయింది. అయితే ‘అవినీతి తనిఖీ’ (కరప్షన్ ఆడిట్- చట్టాలు, నిబంధనలను ఒక సంస్థ ఏ మేరకు పాటిస్తుందనే విషయమై స్వతంత్ర, విశ్వసనీయ మదింపునకు ఆ సంస్థ ఖాతాలు, వ్యాపార ప్రక్రియలు, సిబ్బంది పనితీరును అంతర్గత లేదా బాహ్య వ్యక్తులు, సంస్థలు పరీక్షించడం) మంచి ఫలితాలను సాధించినట్టు ఆ అధ్యయనం స్పష్టం చేసింది. సివిల్ సర్వెంట్, వ్యాపారస్థుడు పరస్పరం సహకరించుకుంటున్నందువల్లే అవినీతి జరగడం కద్దు. లంచం ఇచ్చినవాడు -పుచ్చుకున్న వాడి మధ్య వివాదం తలెత్తినప్పుడు మాత్రమే సదరు బాగోతాలు అవినీతి నిరోధక సంస్థల దృష్టికి వచ్చి, వాటిపై దర్యాప్తునకు పూనుకోవడం జరుగుతోంది. అవినీతి తనిఖీ ప్రక్రియలో, అందుకు భిన్నంగా ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక అధికారి తనిఖీ చేస్తాడు. తమకు ముడుపులు ముట్టేంతవరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వద్దకు వచ్చిన ఫైళ్ళ విషయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి విధిగా ముడుపులు చెల్లించినపుడే ఆ ఫైళ్ళను పరిశీలించేందుకు సుముఖత చూపుతారు. ఒక నిర్దిష్ట అధికారి వద్దకు చేరిన పైళ్ళు ఎంత త్వరగా పరిశీలన, నిర్ణయానికి అర్హమవుతున్నాయనే విషయాన్ని నిశితంగా పరీక్షించడం ద్వారా ఒక ప్రభుత్వ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమవుతుంది. 


అవినీతి నియంత్రణలో మీడియా, పౌరసమాజాల పాత్ర కీలకమైనదని ప్రొఫెసర్ ఇర్కోల్ డిసౌజా (ఐఐఎమ్, అహ్మదాబాద్) అన్నారు. న్యాయవ్యవస్థను కూడా నేను ఆ జాబితాలో చేర్చుతాను. అధికార యంత్రాంగంలో అవినీతిని మీడియా, పౌర సమాజం గుర్తించగలుగుతాయి. పోలీసు అధికారుల అక్రమాలను పియుసిఎల్ బహిర్గతం చేసిన విషయం విదితమే. 


క్లాస్ ‘ఏ’ అధికారుల విధుల నిర్వహణను ప్రభుత్వేతర వ్యక్తులతో మూల్యాంకనం చేయించాలని ఐదో వేతనసంఘం నిర్దేశించింది. ఇందుకు పటిష్ఠచర్యలు చేపట్టిన తరువాతనే సిబ్బంది వేతనభత్యాల విషయమై తమ సిఫారసులను అమలుపరచాలని ఆ వేతనసంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండడం, అవినీతి తనిఖీ, మీడియా, పౌర సమాజం, న్యాయవ్యవస్థకు మరింత సాధికారత కల్పించడం... ఈ సూచనలన్నిటిలోని సామాన్యాంశం స్వతంత్ర వ్యక్తులకు సాధికారిత కల్పించడమే. అవినీతికి పాల్పడిన అధికారులను బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించడం వంటి ఉన్నతస్థాయి నుంచి చేపట్టే దండనచర్యలకు అవినీతి తనిఖీ పూర్తిగా భిన్నమైనది. ప్రభుత్వం పై నుంచి చేపట్టే చర్యల విషయంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించినప్పటికీ అవి నిష్ప్రయోజనమైపోతున్నాయి. 


స్వతంత్ర పర్యవేక్షణకు ఆస్కారం కల్పించడంలో ఉన్న సమస్యేమిటంటే అవినీతిపరులైన అధికారులే కాకుండా సామాన్యప్రజలు సైతం ప్రభుత్వ విధానాలు, చర్యలపై నిశితప్రశ్నలు లేవనెత్తుతారు. ఒక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ జారీ చేసిన ఒక తప్పుడు చలానాకు వ్యతిరేకంగా ఒక పౌరుడు కేసు దాఖలు చేయవచ్చు. అయితే అదే పౌరుడు మోటార్ వాహనాల చట్టంలోని లొసుగుల విషయాన్ని ప్రశ్నించగలుగుతాడు. లేదా న్యాయవ్యవస్థ సంబంధిత ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుంది. ఈ కారణంగా ప్రజల ప్రాతినిధ్యాన్ని మెరుగుపరిచేందుకు, అవినీతి తనిఖీలను నిర్వహించేందుకు, మీడియా, పౌర సమాజం, న్యాయవ్యవస్థకు మరింత సాధికారత కల్పించేందుకు లేదా అధికారుల విధి నిర్వహణ తీరుతెన్నులను బాహ్య సంస్థలు లేదా ప్రభుత్వేతర వ్యక్తుల చేత మూల్యాంకనం చేయించేందుకు ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. ఇది, అమెరికా రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన పద్ధతులకు విరుద్ధమైనది. అధికార వ్యవస్థలో అవినీతి నియంత్రణలో స్వతంత్ర వ్యక్తుల పాత్రను తగ్గించేందుకు ప్రభుత్వం పలు విధాల ప్రయత్నిస్తోంది. ఫలితంగా అవినీతిపరులైన అధికారులపై చర్యలు వ్యర్థమవుతున్నాయి. ఉదాహరణకు, అవినీతిపరులైన జీఎస్టీ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే సాధికారితను ట్రక్ యజమానుల సంఘానికి కల్పించారను కోండి. ఆ సంఘం మోటార్ వాహనాల చట్టంలోని నిర్దిష్ట నిబంధనలను సైతం ప్రశ్నించే అవకాశం ఎంతైనా ఉంది.


అవినీతికి పాల్పడిన అధికారులతో బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం అధికార యంత్రాంగం తీరుతెన్నులను ఏ మాత్రం మెరుగుపరచలేదు. ‘ఏం చేయాలి? మేం చాలా మంది పోలీసు అధికారులను బర్తరఫ్ చేశాం. అయినా వాళ్లు విధులు నిర్వహిస్తున్న తీరులో ఎటువంటి మార్పులేదు’ అని ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు వాపోయారు. పీయుసిఎల్ సహాయాన్ని ఆయన తీసుకుని ఉండాల్సిందని నేను అభిప్రాయపడుతున్నాను. అధికార వ్యవస్థలో అవినీతి ప్రక్షాళనకు ఉద్దేశించిన సంస్కరణలు ఎప్పుడు సఫల మవుతాయి? పై స్థాయిలో ప్రభుత్వం, కిందిస్థాయిలో ప్రజలు దృఢసంకల్పంతో పటిష్ఠంగా వ్యవహరించినప్పుడు మాత్రమే వ్యవస్థలో సరైన మార్పులు సంభవిస్తాయి. సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ముందు రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి,- అవినీతితో అంటకాగడం. దీనివల్ల అధికారాన్ని పూర్తిగా కోల్పోవలసివస్తుంది. రెండు,- తన విధానాలను ప్రశ్నించేందుకు ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛనివ్వాలి. అయినప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆస్కారముంటుంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


Updated Date - 2020-12-29T09:02:51+05:30 IST