అనారోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

ABN , First Publish Date - 2021-05-11T16:46:24+05:30 IST

ఆహారాన్ని వాసన చూసిన వెంటనే మన నోట్లో లాలాజలం ఊరాలి. ఆ లాలాజలం పలచగా అనిపించి, నోరంతా తడిగా అవ్వాలి. అప్పుడు జీర్ణవ్యవస్థ ఆ ఆహారాన్ని అరిగించుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం.

అనారోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

ఆహారాన్ని వాసన చూసిన వెంటనే మన నోట్లో లాలాజలం ఊరాలి. ఆ లాలాజలం పలచగా అనిపించి, నోరంతా తడిగా అవ్వాలి. అప్పుడు జీర్ణవ్యవస్థ ఆ ఆహారాన్ని అరిగించుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. 


అలాగే మన ముందు ఆహారం ఉన్నా తినాలని అనిపించకపోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తినడం, లేదా ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితే తినడంవల్ల అది సరిగ్గా అరగదు. ఏదైనా ఆహారం నోట్లో పెట్టుకొని నమిలేటప్పుడు అది రసంలా మారి మొత్తం లాలాజలంలో కలిసిపోవాలి. అలా కాకుండా మనం తినేటప్పుడు నోరు పొడి ఆరిపోయినట్లు ఉండడం, మింగుతుంటే గొంతు పట్టుకుపోవడం వంటి లక్షణాలు ఉంటే అది మీ శరీరానికి తగిన ఆహారం కాదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ మధ్య కాలంలో తినేటప్పుడు పక్కన శీతల పానీయాలు, సోడా వంటివి తాగుతున్నారు. తినేటప్పుడు పొట్ట ఉబ్బరంగా అనిపించడం, నోరంతా ఒక రకమైన జిగురు ఆవహించడం వల్ల దాన్ని శుభ్రం చేసుకోవడానికి నీళ్లు లేదా సోడా వంటివి తీసుకోవాలనిపిస్తుంది.. అంటే సదరు ఆహారం మీ ఒంటికి పూర్తి అనుకూలమైనది కాదని తెలుసుకోవాలి. ఇలాంటి ఇబ్బందులున్నవాళ్లు ముందుగా... ఏం తింటున్నారు, అది మీ జెనెటిక్‌ నేచర్‌లో అంటే మీ పూర్వీకులు తీసుకున్న ఆహారమా కాదా అన్నది నిర్థారణ చేసుకోవాలి. రెండోది... నాలుక, నోటికి సంబంధించిన ఆనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవాలి. 


సాధారణంగా ఘాటైన పదార్థాలు, అంటే పొద్దున్నే మనం వాడే టూత్‌పేస్ట్‌లో ఘాటుగా ఉండే కెమికల్స్‌ లేకుండా చూసుకోవాలి. అలాంటి కెమికల్స్‌ ఉన్న పేస్ట్‌తో బ్రష్‌ చేయడంవల్ల నాలుక పైనుండే రుచి మొగ్గల (టేస్ట్‌ బడ్స్‌) సున్నితత్వం తగ్గుతుంది. దీన్ని సరిచేసుకోవడానికి పూర్తిగా సహజమైన పదార్థాలున్న టూత్‌పేస్ట్‌లతో బ్రష్‌ చేసుకోవాలి. అలాగే ఆహారం తినే ముందు నోటిని, నాలుకను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మనం తీసుకొనే ఆహారం రుచిని పూర్తిగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. భోజనానికన్నా ముందు పంచదార వేసిన పాలు, టీ వంటివి లేదా ఘాటైన పదార్థం తీసుకోవడం వల్ల నాలుక మందంగా మారుతుంది. రోజూ వీటిని సేవించే అలవాటు ఉన్నవారు తీపి లేకుండా తీసుకొంటే మంచిది. అలాగే తినడానికి కనీసం రెండు గంటల ముందు వేడినీళ్లు తాగడంవల్ల పొట్ట శుభ్రమవుతుంది. తద్వారా మనకు తినాలనే కోరిక కలుగుతుంది. గుట్కా, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లవల్ల నోరు సున్నితత్వాన్ని కోల్పోతుంది. నాలుక సక్రమంగా పనిచేయదు. దాంతో తినే ఆహారంలోని మాంసకృతులు, మినరల్స్‌ వంటివి ఎంత మోతాదులో ఉన్నాయనేది నాలుక సరిగ్గా గ్రహించలేదు. నాలుక సక్రమంగా వాటిని గ్రహించగలిగినప్పుడే ఆహారం పూర్తిగా అరగడానికి అవసరమైన జీర్ణరసాలు, ఎంజైమ్స్‌ జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అవుతాయి. తద్వారా తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది. 


- జి.శశిధర్‌, అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

 సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల

Updated Date - 2021-05-11T16:46:24+05:30 IST