కరీంనగర్‌లో ధాన్యం అమ్మేదెలా?

ABN , First Publish Date - 2021-01-24T05:50:27+05:30 IST

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది.

కరీంనగర్‌లో ధాన్యం అమ్మేదెలా?

కొనుగోలు కేంద్రాలు ఎత్తివేతపై అన్నదాతల ఆందోళన 

338 కేంద్రాల స్థానంలో ఎనిమిది మార్కెట్‌యార్డులు 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు రెట్టించిన ఉత్సాహంతో యాసంగి సాగుకు నడుంబిగించారు. ముందెన్నడూ లేని విధంగా 2. 56 లక్షల ఎకరాల్లో వరిసాగుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే 70 శాతానికి పైగా నాట్లు వేశారు. వారంరోజుల్లో నాట్లుపూర్తవుతాయి. భారీ ఆశలతో యాసంగి సాగుకు పూనుకున్న రైతులు నాట్లు పూర్తి చేసుకుంటూనే, ధాన్యం అమ్ముకునే విషయంలో ఏ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వారంరోజుల్లో రెండుసార్లు గతంలో మాదిరిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం సేకరించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. మార్కెట్‌ యార్డుల్లో మాత్రమే కొనే అవకాశమున్నట్లు ప్రభుత్వ ప్రకటనలను బట్టి అర్థమవుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

వానాకాలం సీజన్‌లో 338 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 338  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 470 కోట్ల రూపాయల విలువ చేసే 2 లక్షల 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. దీంతో రైతులకు ఉన్న ఊరిలోనే ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కలిగింది. మహిళా సంఘాల ద్వారా ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్‌, మార్కెటింగ్‌శాఖల కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనేవారు. 

జిల్లాలో ఏడు మార్కెట్‌, ఒక సబ్‌ యార్డు

ఇప్పుడు కొనుగోలు కేంద్రాల స్థానంలో  ఏడు మార్కెట్‌, ఒక సబ్‌ యార్డులో మాత్రమే కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ధాన్యం అమ్ముకునే విషయంలో నెలలతరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, మద్దతు ధర లభించే అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. యాసంగిలో 2 లక్షల 56వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సుమారు 80వేల ఎకరాల్లో విత్తన పంటను సాగు చేస్తారని మిగతా లక్షా 76వేల ఎకరాల్లో మాత్రమే రైతులు అమ్ముకోవడం కోసం వరిసాగు చేస్తారని భావిస్తున్నారు. ఎకరాకు సాధారణంగా 30 క్వింటాళ్ల మేరకు 5లక్షల 28వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి కూల పరిస్థితుల్లోనూ ఎకరాకు 25 క్వింటాళ్ళ దిగుబడి వచ్చే అవకాశమున్నది. ఈ లెక్కన చూసినా 4 లక్షల 40వేల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి రానున్నది. వానా కాలంలో కొనుగోలు చేసిన ధాన్యంతో పోలిస్తే మార్కెట్‌కు వచ్చే దిగుబడి రెట్టింపు ఉండే అవకాశముంది. జమ్మికుంట, హుజూరాబాద్‌, మానకొండూర్‌, కరీంనగర్‌, చొప్పదండి, గంగాధర, గోపాల్‌రావుపేట మార్కెట్‌ యార్డుల్లో, కేశవపట్నం సబ్‌ యార్డులో కొనుగోలు చేపడతారని సమాచారం. ఎనిమిది కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనే అవకాశం ఉంది.గతంతో పోలిస్తే అసలు కొనుగోలు కేంద్రాలు లేనట్టుగానే భావించవచ్చు. ఒక్కో మార్కెట్‌ యార్డుపై సుమారు 40 గ్రామాలు ఆధారపడాల్సి ఉంటుంది. రైతులు విధిలేని పరిస్థితుల్లో మద్దతు ధర ఇచ్చినా ఇవ్వక పోయినా ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం విక్రయించుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి.  ఇప్పటి నుంచే రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగుపై మొగ్గు చూపారు. రెండు దశాబ్దాల క్రితమేవు  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టులో వరి సాగుకు అనువుగా భూములు మలుచుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు బాధ్యత నుంచి పక్కకు తప్పుకున్నా అకస్మాత్తుగా పంట మార్చే అవకాశం రైతులకు లేకుండా పోయింది.

యాసంగి ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ రూపొందించండి: కలెక్టర్‌

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం కార్యాచరణ రూపొందించాలని  కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌ యార్డుల్లో ఎన్ని కాంటాలు పెట్టవచ్చు, కొనుగోలు చేసిన ధాన్యం నిలువ ఉంచేందుకు సరైన వసతులు, సౌకర్యాలు ఉన్నాయా లేదా ప్రతి రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేయగలం, ఎంత మంది కూలీలు అవసరమవుతారు అన్న విషయాలను ఆరా తీశారు.  జిల్లాలో 4 లక్షల 32 వేల 440 మెట్రిక్‌ టన్నుల వరి ధిగుబడి వస్తుందనే అంచనా వేస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌ కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, పౌరసరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, సివిల్‌ సప్లయి జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:50:27+05:30 IST