కొత్త చెప్పుల్ని మచ్చిక చేసుకోవటం ఎలా

ABN , First Publish Date - 2020-07-06T06:41:06+05:30 IST

ఆ రెండింటినీ కలిపి వదలకండి వాటిని ఒక దాన్తో ఒకటి మాట్లాడుకోనివ్వకండి అవి ట్రేడ్‌ యూనియన్ని ఏర్పాటు చెయ్యొచ్చు వాటిని ఎప్పుడైనా సరే గోడ గడియారం దగ్గరగానీ,...

కొత్త చెప్పుల్ని మచ్చిక చేసుకోవటం ఎలా

ఆ రెండింటినీ కలిపి వదలకండి

వాటిని ఒక దాన్తో ఒకటి మాట్లాడుకోనివ్వకండి

అవి ట్రేడ్‌ యూనియన్ని ఏర్పాటు చెయ్యొచ్చు

వాటిని ఎప్పుడైనా సరే గోడ గడియారం దగ్గరగానీ,

కాలెండర్‌ దగ్గరగానీ, జాతీయ పతాకం దగ్గరగానీ,

గాంధీ బొమ్మ దగ్గరగానీ, లేకపోతే

వార్త పత్రికల దగ్గరగానీ వదలకండి

అవి స్వాతంత్య్రం గురించిగానీ, పని గంటల గురించిగానీ

కనీస వేతనాల గురించిగానీ, అవినీతి గురించిగానీ

వినే ప్రమాదం వుంది

మీరు వెళ్లే దేవాలయానికి వాటిని తొడుక్కుని వెళ్లకండి

దాని వల్ల మీరు బలహీనులనీ, మీ దేవుడు అబద్ధం అనీ

ఎప్పుడన్నా తెలుసుకుని అవి మిమ్మల్ని కరవచ్చు

మీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకి వాటిని వేసుకెళ్లకండి

అవి మిమ్మల్ని తిండి కోసం అడగొచ్చు

లేకపోతే మీరు తినే భోజనం మీద వాటి దిష్టి తగలొచ్చు

మొదట్లో వాటిని చిన్న చిన్న దూరాలకే వేసుకెళ్లండి

తర్వాత క్రమంగా దూరాన్ని పెంచండి

అప్పుడు, చేసున్న పని ఎంతో అవి తెలుసుకోనేలేవు

బిగుతుగా వున్న వాటి స్ట్రాప్స్‌ కాస్త ఒదులు చెయ్యండి

అలా వాటిని కాస్త ఆనందాన్ని అనుభవించనివ్వండి

అవి ఒదులవటం వల్ల కాస్త పెద్దవవుతాయి

పాతబడిన ఆ స్ట్రాప్స్‌కి కాస్త పాత నూనె రాయండి

ఇప్పుడు అవి అణిగి మణిగి వుండే 

మంచి పనివాళ్లవుతాయి

కష్టపడటానికి, పనిచెయ్యటానికి సిద్ధమవుతాయి

కొవ్వుపట్టిన నీ కాళ్ల కోసం

రేయింబగళ్లు. 

ఇంగ్లీషు నుంచి అనువాదం

అత్తలూరి నరసింహారావు


Updated Date - 2020-07-06T06:41:06+05:30 IST