హబ్‌డబ్‌

ABN , First Publish Date - 2021-11-18T06:39:54+05:30 IST

జిల్లాలో ఎంఎఫ్‌వీయూ(మినీ ఫిష్‌ వెండింగ్‌ యూనిట్‌)ల ఏర్పాటుతో ఆక్వాహబ్‌కు పునాది పడుతుందన్న అధికారుల ఆలోచనలు ముందుకు సాగడం లేదు.

హబ్‌డబ్‌
మినీ ఫిష్‌ వెండింగ్‌ యూనిట్‌(ఫైల్‌)

పూర్తికాని ఎంఎఫ్‌వీ యూనిట్లు 

మూడు బృందాల కష్టంతో 21 యూనిట్లకు ఆమోదం

నిర్మాణ దశలో ఐదు సెంటర్లు

పెట్టుబడి భయంతో ముందుకురాని ఔత్సాహికులు

జిల్లాకు ఆక్వాహబ్‌ కలేనా..?

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, నవంబరు17 : జిల్లాలో ఎంఎఫ్‌వీయూ(మినీ ఫిష్‌ వెండింగ్‌ యూనిట్‌)ల ఏర్పాటుతో ఆక్వాహబ్‌కు పునాది పడుతుందన్న అధికారుల ఆలోచనలు ముందుకు సాగడం లేదు. కిందిస్థాయి  నుంచి పై స్థాయి అధికారులు, సిబ్బంది ఏడాది కాలంగా కష్టపడినా 21 యూనిట్లకు మాత్రమే ఆమోద ముద్ర వేశారు. అందులోనూ ఐదు యూనిట్లు మాత్రమే నిర్మాణ దశకు చేరుకున్నాయి. యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వమిచ్చే రూ. 1.7 లక్షలు సరిపోకపోవటం,  వ్యాపారాలు జరగుతాయో లేదో నన్న అభద్రతా భావమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో జిల్లాలో దాదాపుగా ఆక్వాహబ్‌ ఏర్పాటు లేనట్లేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 


బుడిబుడి అడుగులకే యూనిట్ల ఏర్పాటు పనులు....

గతేడాది నవంబరు 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డి జిల్లాల వారీగా ఆక్వా హబ్‌ ఏర్పాటుకు గ్రీన సిగ్నల్‌ ఇచ్చారు. అయితే ఆ హబ్‌ నిర్మాణానికి రూ. కోట్లలో ఖర్చవుతుండటం, ఔత్సాహికులు  ముందుకు రాకపోవడం తదితర సమస్యల దృష్ట్యా... హ బ్‌కు అనుసంధానంగా ఉండే మినీఫిష్‌ వెండింగ్‌ యూ నిట్లు ఏర్పాటు చేద్దామని అధికారులు తలంచారు. మండలాలు, గ్రామాల వారిగా ఈ యూనిట్ల ఏర్పాటు కోసం అధికారులు నానా కష్టాలు పడుతూ వచ్చారు. చేప ల వ్యాపారుల నుంచి నిరుద్యోగ యువత వరకూ ప్రతి   ఒక్కరికీ ఈ పథకం గురించి వివరించే పనిలో పడ్డారు. సంవత్సరం తిరిగినా 21 సెంటర్ల ఏర్పాటుకు మాత్రమే ఔత్సాహికులు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు. అందులో కూడా కళ్యాణదుర్గం బైపాస్‌ సమీపంలో ఒకటి, కమలానగర్‌, శ్రీనివా్‌సనగర్‌, ఆజాద్‌నగర్‌లతో పాటు మరొకటి మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక మిగిలిన 16 సెంటర్లు పేరుకు మాత్రమే అధికారుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. 


ఆక్వా హబ్‌ దాదాపుగా అంతే...

జిల్లాలో ఆక్వాహబ్‌ పూర్తి కావాలంటే హబ్‌కు అనుసంధానంగా 178 మినీఫిష్‌ వెండింగ్‌ యూనిట్లు ఉండాలన్నది నిబంధన. ఆ తరహాలో యూనిట్లు ఏర్పాటైతేనే హబ్‌ నడిపే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు హబ్‌లో రూ. కోట్లతో పలు రకాల చేపలను నిల్వ చేసుకున్నా ఈ యూనిట్లకు సరఫరా చేయవచ్చు. అయితే హబ్‌ ఏర్పాటుకు రూ. కోటి ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసినా క్షేత్రస్థాయిలో దాని ఖర్చు రూ. 4 కోట్లకుపైగా అవుతుండటంతో ఎవరూ ముందుకు రాలేదు. ఇక జిల్లాలో ఆక్వాహబ్‌ ఏర్పాటుపై నీలినీడలు ఆలముకున్నాయనే చెప్పవచ్చు. తాజాగా జిల్లాలో ఓ ప్రముఖ సంస్థ హబ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అయితే ఆ సంస్థ మినీ ఫిష్‌వెండింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని మెలిక పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ నుంచి హబ్‌ పనితీరుపై ఒక కమిటీని జిల్లాకు పంపారు. ఇక్కడి పరిస్థితులపై నివేదికలను పంపాలని ఆదేశించడంతో అధికారులు ఒక బృందంగా, సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు ఒక బృందంగా, హబ్‌ ఏర్పాటుకు ముందు కొచ్చిన ఆ సంస్థ ప్రమోటర్స్‌ ఒక బృందంగా ఏర్పడి 178లో కనీసం 50 మినీఫిష్‌ వెండింగ్‌ యూనిట్లనైనా పూ ర్తి చేయాలని సంవత్సరకాలంగా ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. అది ఫలించకపోవటంతో జిల్లాలో ఆక్వాహబ్‌ ఏర్పాటు కాదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 


ముందుకురాని ఔత్సాహికులు...

రాష్ట్ర ప్రభుత్వం తొలుత 178 మినీ ఫిష్‌ వెండింగ్‌ సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించింది.   పైలెట్‌ ప్రాజెక్టులుగా జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం రూరల్‌, ఆత్మకూరు, బుక్కరాయముద్రం, గార్లదిన్నె, రాప్తాడు, కూడేరు తదితర ప్రాంతాలను ఎంచుకుంది. ఈ యూనిట్‌లో కూలింగ్‌ స్టోరేజీ బాక్సులు, చేపల వంటలు చేసేందుకు గ్యాస్‌ స్టౌ, ర్యాక్‌లు తదితర వాటికి రూ. 1.70 లక్షల ఖర్చవుతుందని...  బ్యాంకు ద్వారా రుణ సదు పా యం కల్పిస్తామని చెప్పింది. లబ్ధిదారులు ఒక షాపును చూ యించి, బ్యాంకులో తన పేరుమీద రూ. 30 వేలు కడితే చాలని చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న ధరలకనుగుణంగా వాటంతటికి రెండింతలు ఖర్చవుతుండటంతోనే ఎవరూ ముందుకు రావడం లేదనేది ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అంత ఖర్చు పెట్టి ఏర్పాటు చేసు కున్నా... వ్యాపారాలు జరుగుతాయో లేవోనన్న సందేహాలు ఆ వర్గాలను తొలుస్తుండటంతోనే మినీఫిష్‌ వెండింగ్‌ సెం టర్లొద్దంటూ వాపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు హబ్‌ ఏర్పాటు చేయ లేక... మినీఫిష్‌ వెండింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహి కులెవరూ ముందుకు రాక ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


త్వరలోనే అనుకున్న లక్ష్యం  చేరుకుంటాం

హబ్‌ ఏర్పాటులో భాగంగానే మినీఫిష్‌ వెండింగ్‌ యూ నిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పు డు మండలాల వారిగా అధికారులతో సమావేశాలు నిర్వహిం చి యూనిట్లపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 21 యూనిట్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే అనుకున్న మేరకు 50 యూనిట్లను ఏర్పాటు చేస్తాం.

-  డా. శాంతి, మత్స్యశాఖ డీడీ

Updated Date - 2021-11-18T06:39:54+05:30 IST