మోదీ బహుమతులకు వేలంలో భారీ బిడ్లు

ABN , First Publish Date - 2021-09-17T22:30:19+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లభించిన బహుమతులు

మోదీ బహుమతులకు వేలంలో భారీ బిడ్లు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లభించిన బహుమతులు, సావనీర్ల వేలం ప్రారంభమైంది. అక్టోబరు 7 వరకు జరిగే ఈ వేలం ద్వారా వచ్చే సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు ఇస్తారు. శుక్రవారం వేలం ప్రారంభం కాగానే రూ.10 కోట్లకు అత్యధిక బిడ్ వచ్చింది. పారాలింపిక్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన సుహాస్ ఎల్‌వై బ్యాడ్మింటన్ రాకెట్‌కు ఈ బిడ్ వచ్చింది. 


సుహాస్ ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. ఆయన ప్రధాని మోదీకి ఇచ్చిన బ్యాడ్మింటన్ రాకెట్‌ను వేలంలో పెట్టారు. దీనికి బేస్ ప్రైస్ రూ.50 లక్షలుగా నిర్ణయించారు. అయితే దీనికి రూ.10 కోట్లు అత్యధిక బిడ్ వచ్చింది. 


టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా తన జావెలిన్‌ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. దీనిని రూ.1 కోటి బేస్ ప్రైస్‌తో వేలంలో పెట్టారు. దీనికి ఇప్పటి వరకు అత్యధికంగా రూ.1 కోటి 20 లక్షలు బిడ్ వచ్చింది. 


ఒలింపిక్ క్రీడల్లో మహిళల హాకీ జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చిన ఘనత సాధించిన ఆ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ప్రధాని మోదీకి హాకీ స్టిక్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ఆ టీమ్ ప్లేయర్ల సంతకాలు ఉన్నాయి. దీనికి రూ.80 లక్షలు బేస్ ప్రైస్‌గా నిర్ణయించి, వేలంలో పెట్టారు. దీనికి ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక బిడ్ రూ.1 కోటి.


నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా ప్రారంభమైన ఈ వేలంలో https://pmmementos.gov.in వెబ్‌సైట్ ద్వారా పాల్గొనవచ్చు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తోంది.


Updated Date - 2021-09-17T22:30:19+05:30 IST