Queen's Platinum Jubilee: సరికొత్త రికార్డు సృష్టించిన ఎలిజబెత్-2... ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు...

ABN , First Publish Date - 2022-06-02T20:54:26+05:30 IST

బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్-2 పరిపాలనా కాలం 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా

Queen's Platinum Jubilee: సరికొత్త రికార్డు సృష్టించిన ఎలిజబెత్-2... ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు...

లండన్ : బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్-2 పరిపాలనా కాలం 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. బ్రిటిష్ సైన్యం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సెయింట్ పాల్ కేథడ్రల్‌లో ప్రత్యేక థాంక్స్‌గివింగ్ సర్వీస్, గుర్రపు పందేలు,  అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. 


బ్రిటిన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం నాలుగు రోజులపాటు జరిగే కార్యక్రమాలు ఏమిటంటే...


జూన్ 2 గురువారం : 

క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-2) జన్మదినోత్సవానికి అధికారిక గుర్తింపుగా బ్రిటిష్ సైన్యంలోని హౌస్‌హోల్డ్ డివిజన్ దాదాపు 1,200 మంది సైనికులతో ‘‘ట్రూపింగ్ ఆఫ్ ది కలర్’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సంగీతకారులు, గుర్రాలతో ఈ కార్యక్రమం రెండు దశాబ్దాల క్రితం నాటి సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే విధింగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. బకింగ్‌హాం ప్యాలెస్ బాల్కనీ నుంచి క్వీన్ గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తారు. సైనిక విమానాల విన్యాసాలను తిలకిస్తారు. 


ఈ ఏడాది బాల్కనీ అపియరెన్స్‌లను నియంత్రించారు. ప్రిన్స్ హారీ, ఆయన సతీమణి మేఘన్, ప్రిన్స్ ఆండ్రూ బాల్కనీ అపియరెన్స్‌ ఇవ్వడానికి అనుమతి లేదు. వర్కింగ్ రాయల్స్ మాత్రమే బాల్కనీ అపియరెన్స్ ఇవ్వడానికి వీలవుతుంది. ప్రిన్స్ హారీ, మేఘన్ దంపతులు హార్స్‌గార్డ్స్ పెరేడ్ వద్ద సీనియర్ రాయల్స్‌తో కలిసి ట్రూపింగ్ ఆఫ్ ది కలర్‌ను వీక్షిస్తారు. 


క్వీన్ ఎలిజబెత్-2 తిరిగి విండ్సర్ ప్యాలెస్‌లో కనిపిస్తారు. ఇది లండన్‌కు పశ్చిమ దిశలో ఉంది. బకింగ్‌హాం ప్యాలెస్‌తోపాటు దేశవ్యాప్తంగా 2,800కుపైగా దివిటీలను వెలిగిస్తారు. చానల్ ఐలండ్స్, ది ఐల్ ఆఫ్ మ్యాన్, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీస్, నాలుగు అత్యంత ఎత్తయిన శిఖరాలపై కూడా దివిటీలను వెలిగిస్తారు. దక్షిణ పసిఫిక్‌లోని టోంగా, సమోవా నుంచి కరీబియన్‌లోని బెలీజ్ వరకు మొత్తం ఐదు ఖండాల్లో 54 కామన్వెల్త్ కేపిటల్స్ నుంచి క్వీన్‌కు శుభాకాంక్షలు, అభినందనలు అందుతాయి. సెంట్రల్ లండన్‌లోని థేమ్స్ నదిపైగల తొమ్మది వంతెనలను, అదేవిధంగా లండన్‌లోని బీటీ టవర్, అనేక ఇంగ్లిష్ కేథడ్రల్స్‌ను విద్యుత్తు కాంతులతో అలంకరిస్తారు. 


జూన్ 3 శుక్రవారం :

క్వీన్ ఎలిజబెత్-2 రికార్డు స్థాయిలో 70 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు లండన్‌లోని సెయింట్ పాల్ కేథడ్రల్‌లో నేషనల్ థ్యాంక్స్‌గివింగ్ సర్వీస్ జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రేట్ పాల్ బెల్‌ను మోగిస్తారు. 1882లో ఏర్పాటైన ఈ గంట బ్రిటన్‌లో అతి పెద్ద చర్చ్ బెల్. దీని మెకానిజం 1970వ దశకంలో దెబ్బతింది. గత ఏడాది దీనిని మరమ్మతు చేసి, పునరుద్ధరించారు. అప్పటి నుంచి దీనిని కేవలం ఎనిమిదిసార్లు మాత్రమే మోగించారు. రాజవంశానికి సంబంధించిన సందర్భంలో దీనిని మోగించలేదు. ఈ కార్యక్రమానికి క్వీన్ హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 


జూన్ 4 శనివారం :

క్వీన్‌కు గుర్రపు పందేలంటే చాలా ఇష్టం. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఫ్లాట్ రేసింగ్ ఈవెంట్‌ ‘ది డెర్బీ’కి క్వీన్ హాజరవుతారని భావిస్తున్నారు. ఇది ఎప్సమ్ డౌన్స్‌లో జరుగుతుంది. సాయంత్రం బకింగ్‌హాం ప్యాలెస్‌లో జరిగే బీబీసీ ప్లాటినం పార్టీకి 5000 మంది ముఖ్యమైన ఫ్రంట్‌లైన్ మెడిక్స్‌ సహా సుమారు 22 వేల మంది హాజరవుతారని అంచనా. ఈ సందర్భంగా జరిగే వినోద కార్యక్రమంలో రాకర్స్ క్వీన్ ప్లస్ ఆడం లాంబెర్ట్ , మోటౌన్ లెజెండ్ డయానా రాస్, ఎల్టన్ జాన్ ఆహూతులను అలరిస్తారు. అలీసియా కీస్, నిలే రాడ్జెర్స్, ఇటాలియన్ టెనార్ ఆండ్రియా బోసెల్లి, తదితరులు రెండున్నర గంటలపాటు తమ సంగీతంతో ఆహూతులను మంత్రముగ్ధులను చేస్తారు. 


జూన్ 5 ఆదివారం :

బిగ్ జూబిలీ లంచెస్ (భారీ ఎత్తున అన్నదానం) చేసేందుకు దాదాపు 70 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా సుమారు ఒక కోటి మంది తమ ఇరుగుపొరుగువారికి భోజన సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా కామన్వెల్త్ దేశాల్లో కూడా 600కుపైగా విందు కార్యక్రమాలను నిర్వహిస్తారు. కెనడా నుంచి బ్రెజిల్ వరకు, న్యూజిలాండ్ నుంచి జపాన్ వరకు, దక్షిణాఫ్రికా నుంచి స్విట్జర్లాండ్ వరకు విందు కార్యక్రమాలు జరుగుతాయి. 


సెంట్రల్ లండన్‌లో ప్లాటినం జూబిలీ పేజెంట్‌ (పబ్లిక్ పెరేడ్)తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో రాజవంశీకులు ప్రయాణించే గోల్డ్ స్టేట్ కోచ్ (బండి)కి ముందు హౌస్‌హోల్డ్ కావల్రీకి చెందిన మౌంటెడ్ బ్యాండ్ నడుస్తుంది. దీనిలో క్వీన్‌ను బకింగ్‌హాం ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. క్వీన్ 1952లో పదవీ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి బ్రిటిష్ సమాజం ఏ విధంగా పరివర్తన చెందిందో తెలియజేస్తూ జరిగే మ్యూజికల్, క్రియేటివ్ కార్యక్రమంలో సుమారు 10,000 మంది పాల్గొంటారు. 


జాతీయ గీతం, ‘గాడ్ సేవ్ ది క్వీన్’ పాటలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. సింగర్-సాంగ్ రైటర్ ఎడ్ షీరన్ నేతృత్వంలో ఈ గీతాలాపన జరుగుతుంది. 


Updated Date - 2022-06-02T20:54:26+05:30 IST