ఎస్సై కొలువుకు యమ డిమాండ్‌! ఒక్కో పోస్టుకు 447 మంది పోటీ!

ABN , First Publish Date - 2022-05-28T13:27:27+05:30 IST

దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు కొలువుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. పోలీసు శాఖలో 17,516 పోస్టుల భర్తీ కోసం సర్కారు ప్రకటన ఇవ్వగా.. అనూహ్యంగా అభ్యర్థుల నుంచి రికార్డు..

ఎస్సై కొలువుకు యమ డిమాండ్‌! ఒక్కో పోస్టుకు 447 మంది పోటీ!

ఒక సివిల్‌ పోస్టుకు సగటున 447 మంది పోటీ

‘కమ్యూనికేషన్స్‌’ విభాగంలో 660 మంది పోటీ

17,516 పోలీస్‌ పోస్టులకు 12,91,058 దరఖాస్తులు

మొత్తం అర్జీల్లో 21 శాతం మహిళల నుంచి..

ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు కొలువుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. పోలీసు శాఖలో 17,516 పోస్టుల భర్తీ కోసం సర్కారు ప్రకటన ఇవ్వగా.. అనూహ్యంగా అభ్యర్థుల నుంచి రికార్డు స్థాయిలో 12,91,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మహిళల నుంచి 2,76,311 దరఖాస్తులు(21 శాతం) వచ్చాయి. ఒక్కో సివిల్‌ ఎస్సై పోస్టుకు సగటున 447 మంది, కమ్యూనికేషన్స్‌ ఎస్సై పోస్టుకు 660, కానిస్టేబుల్‌ పోస్టుకు 59 మంది పోటీపడుతున్నారు. యూనిఫామ్‌ పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి(టీఎ్‌సఎల్పీఆర్‌బీ) శుక్రవారం వెల్లడించింది. 2018లో 18,428 పోస్టులకు 7,19,840 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈసారి 17,516 పోస్టులకు రికార్డు స్థాయిలో 12,91,058 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే 80 శాతం మేర దరఖాస్తులు పెరిగాయి. మొత్తంగా 11 రకాల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగా... అందులో ఒక పోస్టుకు 52 శాతం మంది, 2 పోస్టులకు 29 శాతం, 3 పోస్టులకు 15 శాతం, 4 పోస్టులకు 3 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.


బీసీ-డీ వాళ్లే 21 శాతం..

మొత్తం దరఖాస్తుల్లో 51 శాతం మంది బీసీ అభ్యర్థులు ఉన్నారు. వారిలో బీసీ-డీ కేటగిరీకి చెందినవారే 20.97 శాతం ఉన్నారు. ఎస్సీలు 22.44 శాతం, ఎస్టీలు 18.60 శాతం, ఓసీలు 7.65 శాతం, బీసీ-బీ 17.70 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు. 95 శాతం స్థానికత ఉండటంతో కేవలం 3.48 శాతం మందే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు దరఖాస్తులు చేసుకున్నారు. పోలీసు పోస్టులకు హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచే అత్యధికంగా 33 శాతం దరఖాస్తులు వచ్చాయి. ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నారాయణపేట్‌, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి అత్యల్పంగా 7 శాతం దరఖాస్తులు వచ్చాయి. పోలీస్‌ పోస్టులకు మొదట మూడేళ్లు, తర్వాత రెండేళ్లు వయో పరిమితి పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపు వల్ల 1.40 లక్షల మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారు. 67 శాతం మంది తెలుగు, 33 శాతం ఇంగ్లిష్‌, 0.2 శాతం మంది ఉర్దూ మీడియంలో పరీక్ష రాసేందుకు ఆప్షన్లు పెట్టుకున్నారు.


ఆగస్టులో ప్రిలిమినరీ..

ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టే బుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహిస్తామని పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఎస్సై పోస్టులకు 2.50 లక్షల మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపింది. దరఖాస్తులకు సంబంధించి 29,094 ఫిర్యాదులు రాగా.. వాటిలో 29,085 ఫిర్యాదులకు సమాధానం ఇచ్చినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది.



Updated Date - 2022-05-28T13:27:27+05:30 IST