పేలుడు ముప్పెంత?

ABN , First Publish Date - 2020-08-08T09:21:28+05:30 IST

జిల్లాలో హానికరమైన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల లోటుపాట్ల గుట్టును బయట పెట్టడానికి అధికారులు ..

పేలుడు ముప్పెంత?

జిల్లాలో హానికర పరిశ్రమల్లో భద్రతాలోపాల డొంక కదులుతుందా

విశాఖలో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

రెడ్‌జోన్‌ కేటగిరీలోని 157 కంపెనీలను గుర్తించిన జిల్లా పరిశ్రమలశాఖ 

వీటిలో ప్రమాదాలు సంభవించే సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లపై అధ్యయనం

జేసీ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

వచ్చే వారం నుంచి తనిఖీలు.. మూడు నెలల్లో నివేదిక 

విష వాయువుల లీకుకు ఆస్కారం ఉన్న పరిశ్రమలపై తనిఖీలు పూర్తి


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో హానికరమైన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల లోటుపాట్ల గుట్టును బయట పెట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రసాయనాలు, పేలుడు, భారీ అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ఫ్యాక్టరీల జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి నేతృత్వంలో ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, బాయిలర్లు, కాలుష్య నియంత్రణం, అగ్నిమాపకశాఖ జిల్లా అధికారులతో కూడిన కమిటీ ఉమ్మడి తనిఖీలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల విశాఖ నగరంలో వరుసగా ఫార్మా, కెమికల్‌ ఫ్యాక్టరీల్లో భారీ పేలుడు, అగ్ని ప్రమాదాలు జరిగాయి.


ఈ ఘటనల్లో అనేకమంది కార్మికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాలు, అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు అధికంగా ఉన్న పరిశ్రమల్లోని భద్రతా లోటుపాట్లపై అధ్యయనం చేయాలని అన్ని జిల్లాలను ప్రభుత్వం ఆదే శించింది. అందులోభాగంగా జిల్లావ్యాప్తంగా రెడ్‌జోన్‌ కేటగిరీలో ప్రమాదాలకు అవకాశాలు అధికంగా ఉన్న 157 పరిశ్రమలను అధికారులు గుర్తించారు. ఇవి రసాయనాలు, పేలుడు పదార్థాల ఆధారంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. పెద్దాపురంలో ఆగ్రో ఆయిల్స్‌, కేబీకే బయోటెక్‌, జీవీకే, రంగం పేటలోని ప్రాగ్‌ డిస్టిలరీ, కోస్టల్‌ ఫార్మాల్యాబ్స్‌, రిలయెన్స్‌, నెక్కంటి సీఫుడ్స్‌, విశాఖ డెయిరీ, అవంతి ఫ్రాజెన్‌ ఫుడ్స్‌, రుచి సోయా, అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌, దేవీ ఆక్వా, గోదావరి ఎడిబుల్‌ బ్రాన్‌ ఆయిల్‌, రెడ్డి డ్రగ్స్‌ లేబరేటరీస్‌, బయోమ్యాక్స్‌, నిఖిల్‌ రిఫైనరీస్‌ ఇలా పలు విభాగాల్లో 157 రకాల పరిశ్రమలను గుర్తిం చారు.


వీటన్నింటిలో వచ్చేవారం నుంచి ఉమ్మడి తనిఖీలు చేపట్టనున్నారు. వీటిలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎంతవరకు ఉంది? నియంత్రణకు చర్యలు సిద్ధంగా ఉన్నాయా? ఇతరత్రా లోటు పాట్లు? వంటి వాటిపై తనిఖీ చేసి 90 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. కాగా విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ విషవాయువు లీకైన ఘటన నేపథ్యంలో జిల్లాలోని 27 భారీ పరిశ్రమ ల్లో అధికారులు తనిఖీలు చేపట్టి నివేదికలు ప్రభుత్వానికి పంపారు. తాజాగా ఇప్పుడు రసాయన, పేలుడు, ఇతర అగ్నిప్రమాదాలు పొంచి ఉన్న రెడ్‌జోన్‌ కేటగిరీ పరిశ్రమలపై దృష్టిసారించారు.

Updated Date - 2020-08-08T09:21:28+05:30 IST