ఫంక్షన్‌హాల్‌లో భారీ పేలుడు

ABN , First Publish Date - 2022-06-26T16:54:44+05:30 IST

నగర శివార్లలోని బహుదూర్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించి మహిళ ప్రాణాలు కోల్పోయింది

ఫంక్షన్‌హాల్‌లో భారీ పేలుడు

మహిళ దుర్మరణం

హైదరాబాద్/దుండిగల్‌: నగర శివార్లలోని బహుదూర్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించి మహిళ ప్రాణాలు కోల్పోయింది. పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మి(27), భర్త జయరాజ్‌తో కలిసి నగరానికి వలస వచ్చారు. బహుదూర్‌పల్లి సమీపంలో గల ఎస్‌బీవీకే ఫంక్షన్‌హాల్‌లో పనిచేస్తున్నారు. ఫంక్షన్‌హాల్‌ యాజమాన్యం కొంతకాలంగా పక్కనపడేసిన ఓ క్యాన్‌ను కడగాలని లక్ష్మికి సూచించారు. శనివారం సాయంత్రం ఆమె క్యాన్‌ మూత తీయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన లక్ష్మి  అక్కడికక్కడే దుర్మరణం చెందింది. దుండిగల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దింపారు. క్యాన్‌లో ఉన్న ద్రావకాన్ని సేకరించారు. డబ్బాలో ఏమైనా కెమికల్స్‌ నిల్వఉండి ఉండవచ్చని, లేక ప్రమాదకరమైన మెటీరియల్‌ ఏదైనా ఉండొచ్చని, దానిని ల్యాబ్‌కు పంపిస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దుండిగల్‌ సీఐ రమణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-06-26T16:54:44+05:30 IST