వంటింట్లో మంట

ABN , First Publish Date - 2022-07-07T05:12:01+05:30 IST

వంటింట్లో గ్యాస్‌ ధర మంట పెడుతోంది.

వంటింట్లో మంట

  • భారీగా పెరిగిన గ్యాస్‌ ధర 
  • రూ.50 పెరిగిన డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 
  • జిల్లాలో రోజుకు రూ.15 లక్షల భారం
  • పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించాలని డిమాండ్‌


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూలై 6 : వంటింట్లో గ్యాస్‌ ధర మంట పెడుతోంది. సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్‌ సిలిండర్‌ ‘బాదుడు’ బరువు మరింత పెరిగింది. ఒక్కసారిగా సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.50 పెంచేశాయి. తరచూ పెరుగుతున్న వంట గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు మోత మోగుతుంటే.. మరోవైపు చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెం చుతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది నుంచి వంట గ్యాస్‌ ధరను నెలనెలా పెంచుతూనే ఉన్నారు. గత సంవత్సరం జూన్‌ నెలలో రూ.861 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,105 చేరుకుంది. గత నెలలో గ్యాస్‌ ధర పెంచకుండా గ్యాప్‌ ఇచ్చిన చమురు సంస్థలు ఈ నెల ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50 పెంచి సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. ఇప్పటికే భారంగా మారిన గృహ వినియోగ (డొమెస్టిక్‌) సిలిండర్‌ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్‌ ధర శరాఘాతంలా మారనుంది. తరచూ ధరల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులయ్యే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.1,055 ఉంది. తాజా పెంపుతో రూ. 1,105కు చేరింది. డెలివరీ చార్జీలు రూ.40 కలిపితే.. గ్యాస్‌ ధర రూ. 1,145కు చేరుకుంది. పేద వర్గాలు సైతం అధికంగా వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.500 ఉండగా ఇప్పుడు రూ. 1,105 దాటి పోవడతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ పొయ్యి కంటే.. కట్టెల పొయ్యే నయమంటున్నారు. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను వెంటనే తగ్గించాలని.. లేదంటే రానున్న ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 


పెరిగిన ధరతో రూ.15 లక్షల భారం

రంగారెడ్డి జిల్లాలో 55 గ్యాస్‌ డిస్ర్టిబ్యూటరీ సెంటర్లు ఉన్నాయి. సుమారు 9 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా సగటున రోజుకు 30వేల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. పెరిగిన సిలిండర్‌ ధర 50 రూపాయలతో  ప్రజలపై రోజుకూ రూ. 15 లక్షల భారం పడుతోంది. 


అందని సబ్సిడీ

గతంలో గ్యాస్‌ సిలిండర్‌కు సబ్సిడీ మినహాయించి వినియోగదారుల నుంచి ధర వసూలు చేసేవారు. అప్పట్లో రూ.500 లోపే సిలిండర్‌ ధర ఉండేది. తర్వాత ధర పెరిగినా.. పెంచిన మొత్తం ధర వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రూపంలో డబ్బు జమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిలిండర్‌ ధర చెల్లించినా సబ్సిడీ సొమ్ము జమ కావడం లేదు. అసలు సబ్సిడీ మినహాయించి గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత ఉందో తెలియడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలా ధరలు పెంచుతూ పోతే గ్యాస్‌ సిలిండర్‌ ఏవిధంగా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. 


రక్తం పీల్చుతున్నారు

వంట గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుల రక్తం పీల్చుతున్నారు. కూలీ చేసిన డబ్బులు వంట గ్యాస్‌, కూరగాయలకే సరిపోతున్నాయి. పిల్లలను ఎలా చదివించాలి. బతకడం కష్టంగా మారింది. నెలనెలా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచుతూ పేదల కడుపు కొడుతున్నారు. కట్టెల పొయ్యి ఉన్నప్పుడే బాగుండే. 

- జంగమ్మ, పోమాల్‌పల్లి, కేశంపేట మండలం 


బతికేదెలా..?

వంటగ్యాస్‌ ధరను తరచూ పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. మా లాంటి సామాన్యులు బతకడం చాలా కష్టంగా మారుతుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌పై 50శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరించి పేదలకు అందివ్వాలి.

- విజయలక్ష్మి, షాద్‌నగర్‌


ధరల పెరుగుదల ఇలా..

నెల/సం. ధర (రూ.)

జూలై 2022 1,105

మే 2022 1,055

ఏప్రిల్‌ 2022 1,002

మార్చి 2022 952

సెప్టెంబర్‌ 2021 937

ఆగస్టు 2021 912

జూలై 2021 887

జూన్‌ 2021 861.50


Updated Date - 2022-07-07T05:12:01+05:30 IST