Americaలో భారీగా జాబ్ ఓపెనింగ్స్.. ఒక్క నెలలోనే 44లక్షల మంది కొలువులకు బైబై

ABN , First Publish Date - 2021-11-13T12:56:58+05:30 IST

అవకాశాల దేశం అమెరికాలో భారీగా కొలువులు ఖాళీగా ఉన్నాయి. కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. మార్కెట్‌లో ప్రస్తుతం 1.04 కోట్ల జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నాయి. ఆగస్టు (1.06 కోట్లు)తో పోలిస్తే ఇవి తక్కువే అయినా, కొవిడ్‌ ముందునాటి పరిస్థితితో చూస్తే చాలా మెరుగని చెబుతున్నారు.

Americaలో భారీగా జాబ్ ఓపెనింగ్స్.. ఒక్క నెలలోనే 44లక్షల మంది కొలువులకు బైబై

మార్కెట్‌లో 1.40 కోట్ల ఉద్యోగాలు.. అమెజాన్‌లోనే 1.25 లక్షలు

సెప్టెంబరులో 44 లక్షల మంది రాజీనామా

వాషింగ్టన్‌, నవంబరు 12: అవకాశాల దేశం అమెరికాలో భారీగా కొలువులు ఖాళీగా ఉన్నాయి. కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. మార్కెట్‌లో ప్రస్తుతం 1.04 కోట్ల జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నాయి. ఆగస్టు (1.06 కోట్లు)తో పోలిస్తే ఇవి తక్కువే అయినా, కొవిడ్‌ ముందునాటి పరిస్థితితో చూస్తే చాలా మెరుగని చెబుతున్నారు. కాగా, అగ్రరాజ్యంలో వరుసగా రెండో నెలలో రికార్డు స్థాయిలో ప్రజలు ఉద్యోగాలను వదులుకున్నారు. సెప్టెంబరులో  44 లక్షల మంది కొలువులకు బైబై చెప్పారు. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 3 శాతం కావడం గమనార్హం.  ఆగస్టులో 43 లక్షల మంది ఉద్యోగాలను వీడారు.  కొత్త కొలువులు ఇంతకు రెట్టింపుగానే ఉండడం విశేషం. కొత్తగా ఉద్యోగాలు పొందినవారు సైతం.. అధిక వేతనాల కోసం సంస్థలు మారుతున్నారు. ఆదాయాలు బాగుండడం, ప్రజలు భారీగా ఖర్చు పెడుతుండడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండడంతో సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నాయి.


అమెరికాలో శీతాకాల సెలవుల నేపథ్యంలో కొనుగోళ్ల హడావుడి ప్రారంభం కానుంది. దీంతో రిటైలర్‌, ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు పెద్దఎత్తున  నియమించుకుంటున్నాయి. అమెజాన్‌ శాశ్వత ప్రాతిపదికన 1.25 లక్షల మంది డ్రైవర్లు, గోదాం కార్మికులను తీసుకుంది. వీరికి గంటకు 18 నుంచి 22 డాలర్లు ఇవ్వనుంది. 3 వేల డాలర్ల బోనస్‌ ఇచ్చేందుకూ ఒప్పుకొంది.   ప్యాకేజీ డెలివరీ సంస్థ యూపీఎస్‌ లక్ష మందిని నియమించనుంది. 



Updated Date - 2021-11-13T12:56:58+05:30 IST