‘ఫ్యూచర్‌’కు భారీ షాక్‌

ABN , First Publish Date - 2022-04-23T08:51:00+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ గ్రూప్‌నకు రుణదాతలు భారీ షాకిచ్చారు.

‘ఫ్యూచర్‌’కు భారీ షాక్‌

రిలయన్స్‌తో రూ.24,713 కోట్ల డీల్‌ను తిరస్కరించిన సెక్యూర్డ్‌ రుణదాతలు 

ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ గ్రూప్‌నకు రుణదాతలు భారీ షాకిచ్చారు. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఆస్తుల విక్రయ ఒప్పందానికి ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) రుణదాతలు వ్యతిరేకంగా ఓటు వేశారు. రిలయన్స్‌ రిటైల్‌తో డీల్‌కు అనుమతి కోరుతూ జరిగిన ఓటింగ్‌ ప్రక్రియలో 75 శాతానికి పైగా వాటాదారులు, అన్‌సెక్యూర్డ్‌ రుణదాతల నుంచి మద్దతు లభించినప్పటికీ, సెక్యూర్డ్‌ రుణదాతల నుంచి అవసరమైన 75 శాతం అనుకూల ఓటింగ్‌ను సాధించలేకపోయామని ఎఫ్‌ఆర్‌ఎల్‌ తెలిపింది. అన్‌సెక్యూర్డ్‌ రుణదాతలతో పోలిస్తే, సెక్యూర్డ్‌ రుణదాతలకు రుణాల రికవరీ విషయంలో మొదటి ప్రాధాన్యం లభిస్తుంది.

సెక్యూర్డ్‌ రుణదాతల్లో 69.29 శాతం మంది ఈ డీల్‌కు వ్యతిరేకంగా ఓటేయగా.. కేవలం 30.71 శాతం మాత్రమే మద్దతు పలికారని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు కంపెనీ సమాచారం అందించింది. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ లిమిటెడ్‌ (ఎ్‌ఫఎల్‌ఎ్‌ఫఎల్‌) సెక్యూర్డ్‌ రుణదాతల్లోనూ 82.75 శాతం ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫ్యూచర్‌ గ్రూప్‌ తన ప్రధాన కంపెనీ ఫ్యూచర్‌ రిటైల్‌ సహా 19 కంపెనీలకు చెందిన రిటైల్‌, టోకు, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ ఆస్తులను రిలయన్స్‌ రిటైల్‌కు రూ.24,713 కోట్లకు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్‌ రిటైల్‌లో పరోక్షంగా వాటా కలిగి ఉన్న అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఈ డీల్‌ను వ్యతిరేకించింది. ఇందుకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. 


రూ.17,000 కోట్లకు పైగా బకాయిలు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సహా పలు సెక్యూర్డ్‌ రుణదాతలకు ఫ్యూచర్‌ గ్రూప్‌ రూ.17,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫ్యూచర్‌ ఆస్తులను టేకోవర్‌ చేశాక గ్రూప్‌ రుణాల తిరిగి చెల్లింపు విషయంలో రిలయన్స్‌ రిటైల్‌ నుంచి స్పష్టమైన హామీ లేకపోవడం వల్లే సెక్యూర్డ్‌ రుణదాతలు డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలిసింది. అంతేగాక, ఈ ఒప్పందం విషయం లో అమెజాన్‌తో వివాదం కొనసాగుతుండటం, ఫ్యూచర్‌ గ్రూప్‌ అద్దెలు చెల్లించలేక ఇప్పటికే 800కి పైగా స్టోర్లను చేజార్చుకోవడంతో ఈ కొనుగోలు ఒప్పందం విలువ భారీగా తగ్గవచ్చన్న అభిప్రాయాలు కూడా రుణదాతల వ్యతిరేకతకు కారణమైంది.

Updated Date - 2022-04-23T08:51:00+05:30 IST