అడుగు వేయాలంటే భయం

Jul 25 2021 @ 23:50PM
తుమ్మలపల్లెలోని అరటి తోటలో ఏర్పడిన గోతులు

పంట పొలాల్లో ఉన్నట్టుండి భారీ గోతులు

కుంగుతున్న భూమి.. అక్కడక్కడా పగుళ్లు 

తుమ్మలపల్లెలో వింత పరిస్థితి

యురేనియం తవ్వకాలే కారణమన్న రైతులు

న్యాయం చేయాలని అన్నదాతల విన్నపం 

(కడప, ఆంధ్రజ్యోతి): పొలంలో అడుగు పెట్టాలంటేనే భయం. ఉన్నట్టుండి పెద్ద పెద్ద గోతులు పడుతున్నాయి. భూమి అక్కడక్కడా కుంగిపోతోంది. సాగు చేసిన అరటి చెట్లు భారీ గోతుల్లో కూరుకుపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ భూమి కుంగిపోతుందో.. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయపడుతున్నారు. వేముల మండలంలో ఈ పరిస్థితి నెలకొంది. యురేనియం తవ్వకాల వల్ల భూమి కుంగిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూసీఐఎల్‌ ప్రభావిత గ్రామాలలో ఈ పరిస్థితి నెలకొంది. వేముల మండలం తుమ్మలపల్లె సమీపంలో యూసీఐఎల్‌ చేస్తున్న అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌ ప్రదేశానికి దాదాపు 150 మీటర్ల దూరంలో గ్రామ సర్పంచి లక్ష్మీదేవి భర్త వెంకటకృష్ణ పొలం ఉంది. ఏడాది క్రితం రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి అరటి సాగు చేశారు. పది రోజుల క్రితం 4-5 మీటర్ల వెడల్పు, 10-15 అడుగుల లోతు మేర పొలం కుంగిపోయింది. పెద్ద సైజు గోతులు ఏర్పడ్డాయి. పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పొలంలోకి వెళ్లాలంటేనే ఆ రైతు భయపడుతున్నారు. గతేడాది ఈ చేను పక్కనే ఉన్న ఆయన సోదరుడు వెంకట్రాముడు పొలంలోనూ ఇలాంటి గుంతలే ఏర్పడ్డాయి. యురేనియం తవ్వకాలతో భూమి కుంగిపోతోందని తుమ్మలపల్లె గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి అత్యంత సమీపంలోనే యూసీఐఎల్‌ యురేనియం తవ్వకాలు చేస్తోంది. అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌ చేసి ముడి యురేనియం పదార్థాన్ని వెలికి తీస్తోంది. భూగర్భంలో ఎంతవరకు తవ్వకాలు చేస్తున్నారో తెలియదని, ఆ కారణంగా భూమి కుంగిపోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాస్త్రవేతలతో అధ్యయనం చేయించాలని, తమకు న్యాయం చేయాలని రైతన్నలు కోరుతున్నారు.


పొలంలోకి వెళ్లాలంటేనే భయం

- వెంకటకృష్ణ, రైతు, తుమ్మలపల్లె  

యూసీఐఎల్‌ చేపట్టిన యురేనియం అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌కు 100-150 మీటర్ల దూరంలోనే మా పొలాలు ఉన్నాయి. మా అన్నదమ్ములకు ఎనిమిది ఎకరాలు ఉంది. నాకు 1.50 ఎకరాల పొలం ఉంది.  రూ.2 లక్షలు ఖర్చు చేసి అరటి సాగు చేశాను. ఉన్నఫళంగా పొలంలో 4 మీటర్ల వెడల్పు, 10-15 మీటర్ల లోతున గోతులు పడ్డాయి. పొలంలో నాలుగైదు చోట్ల ఇదే పరిస్థితి. పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. సమీపంలో భూమి కుంగిపోయింది. అరటి చెట్లు కూడా ఆ గోతుల్లోకి కుంగిపోయాయి. పొలంలోకి వెళ్లాలంటేనే భయమేస్తోంది. సచివాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. గతేడాది మా సోదరుడి పొలంలో ఇలాంటి గోతులే పడ్డాయి. అధికారులు స్పందించి శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.