మానవీయమూర్తి

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

తత్త్వం వేరు, మానవీయత వేరు. ఆలోచనలకు, ఆధ్యాత్మికత లోతులకు సంబంధించినది తత్త్వం. కానీ మానవీయత సమాజానికి, సంస్కారానికి, మైత్రికి సంబంధించినది..n

మానవీయమూర్తి

తత్త్వం వేరు, మానవీయత వేరు. ఆలోచనలకు, ఆధ్యాత్మికత లోతులకు సంబంధించినది తత్త్వం. కానీ మానవీయత సమాజానికి, సంస్కారానికి, మైత్రికి సంబంధించినది. తత్త్వం నిక్కచ్చిగా ఉండడమే కాదు... ఒక్కోసారి కర్కశంగానూ ఉంటుంది. తమ ఆలోచనే సరైనదన్న వైఖరితో పాటు... ఇతర తాత్త్విక ధోరణుల పట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. కక్షలు రేపుతుంది. మానవ సమాజాన్ని కల్లోల పరుస్తుంది. అందుకే అనేక సైద్ధాంతిక ఘర్షణలు పుట్టి, మానవ సమాజంలో హింస- ప్రతిహింసలు అనివార్యమైపోయాయి. దుఃఖరహిత స్థితిని పొందడానికి బుద్ధుడు ఒక నూతన మార్గాన్ని అన్వేషించి, ఆవిష్కరించాడు. ఆ మార్గం చాలా నిక్కచ్చిదని రుజువు చేశాడు. కానీ, దాని ఆవిష్కరణలోనైనా ఆచరణలోనైనా మూఢత్వాన్ని కానీ, కర్కశత్వాన్ని కానీ చూపలేదు. ‘‘ఇదిగో... ఇది నా మార్గం. దీన్ని మీరు పరిశీలించండి. మీ అనుభవంలోకి తెచ్చుకోండి. ఇది సరైన మార్గం అనిపిస్తేనే... ఈ మార్గంలో నడవండి’’ అని తన ప్రబోధాల్లో ఆయన చెప్పేవాడు. ఇలా తన మార్గం ఏమిటో, తన ధర్మం ఏమిటో చెప్పేవాడే కానీ... ‘‘ఇతరుల ధర్మాలు తప్పు’’ అంటూ వాటి మీద నిందలు మోపి, ‘‘అవి చెడ్డవి కాబట్టి నా మార్గం గొప్పది’’ అని ప్రకటించేవాడు కాదు.


ఒకనాడు బుద్ధుడు శాక్యుల దేశంలోని ఒక మామిడి తోటలో ఉన్నాడు. నిర్గ్రంథనాథపుత్రుడు అనే తాత్త్వికుడి శిష్యులు బుద్ధుడి దగ్గరకు వచ్చారు. అనేక విషయాల గురించి చర్చించారు, తర్కించారు. వాదానికి దిగారు. ‘ఆత్మ’ అనే అంశం మీద వాదం జోరుగా సాగుతోంది. బుద్ధుణ్ణి ఓడించాలని వారు గట్టిగా నిర్ణయించుకొని వచ్చారు. వాదం ఒక్కోసారి వారివైపే మొగ్గినట్టు అనిపిస్తోంది. అలాంటి సమయంలో వారు మరింత రెట్టించిన ఉత్సాహం చూపించేవారు. విచిత్రమైన హావభావాలు ప్రదర్శించేవారు. వాదం చివరి దశకు చేరింది. ఇక ఆ వాదాన్ని కొనసాగిస్తే నిర్గ్రంథులు ఓడిపోవడం తథ్యం. ఈ విషయం ఇటు బుద్ధుడికీ తెలుసు, అటు నిర్గ్రంథులకూ తెలుసు. వారి ముఖాలు కళ తప్పాయి.


వెంటనే బుద్ధుడు చిరునవ్వు నవ్వి - ‘‘మిత్రులారా! నేనీ వాదం నుంచి విరమించుకుంటున్నాను’’ అని లేచాడు. 

వాదన చేయలేక కాదు... తమను ఓడించి, బాధించడం ఇష్టంలేకే తథాగతుడు ఇలా విరమించుకున్నాడని వారు తెలుసుకున్నారు. వారు వినమ్రంగా లేచి, బుద్ధుని పాదాలకు ప్రణమిల్లారు. 

‘వారిని బుద్ధుడు ఓడించకుండా ఇలా ఎందుకు లేచాడు?’ అని కొందరు భిక్షువులు ప్రశ్నించుకున్నారు. ఆయన అలా లేవడం వారికి నచ్చలేదు. ‘‘బుద్ధుని దృష్టిలో అలా ఓడించడం కూడా హింసే’’ అన్నారు ఇంకొందరు భిక్షువులు. 


అదే సమయానికి బుద్ధుడు అక్కడికి వచ్చి- ‘‘భిక్షువులారా! మీరు కూడా మీ తోటి మిత్రుడు ఒక విషయాన్ని చదివేటప్పుడు కానీ, దాని అర్థాన్ని గ్రహించే విషయంలో గానీ తప్పు చేస్తే... మీరు అతణ్ణి గేలి చెయ్యకండి. ఒకరు పలకడంలో తప్పు చేసినా అర్థాన్ని చక్కగా గ్రహిస్తారు. ఇంకొందరు పదాన్ని చక్కగా పలికి, అర్థాన్ని అసమగ్రంగా గ్రహిస్తారు. ఇలాంటి వారి విషయంలో మీరు తొందర పడకూడదు. నిందించకూడదు. మందలించకూడదు. అలాగని అభినందించకూడదు. మెల్లగా వారు తమ తప్పును తాము గ్రహించేలా చూడాలి. ‘‘ఆ అర్థానికి బదులు ఈ అర్థం అయితే సమగ్రంగా ఉంటుందేమో చూడు. అలా పలకడం కన్నా ఇలా పలికితే బాగుంటుందేమో చూడు’’ అని చెప్పి సరిదిద్దాలి. మరికొందరు పదాన్నీ పలకలేరు, అర్థాన్నీ గ్రహించలేరు. వారిపట్ల కూడా మరింత అనునయంగానే వ్యవహరించాలి. ఇక, పదాన్ని చక్కగా పలికి, దాని అర్థాన్ని సమగ్రంగా గ్రహించినప్పుడు ‘‘సాధు... సాధు’’ (మంచిది... మంచిది) ఆయుష్మాన్‌! అక్షరాలను చక్కగా పలికి, అర్థాన్ని సమగ్రంగా గ్రహించే మీలాంటి వారిని పొందడం మాకు ఎంతో లాభం, మేలు’’ అని అభినందించాలి’’ అని చెప్పాడు.


అందుకే బుద్ధుడు మది నిండా తత్త్వం, ఎద నిండా మానవీయత మూర్తీభవించిన మహోన్నతుడయ్యాడు. ఉత్తమ గురువుగా నిలిచిపోయాడు.

 బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST