మానవీయ స్పందన

ABN , First Publish Date - 2022-07-05T07:43:12+05:30 IST

ఒక వార్త వందలాదిమందిని కదిలించింది. మనసు కరిగించింది. రెపరెపలాడుతున్న మోక్షిత్‌ ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగించింది.

మానవీయ స్పందన
చికిత్స పొందుతున్న మోక్షిత్‌

మోక్షిత్‌కు అందుతున్న సాయం

చెన్నై అపోలోలో కొనసాగుతున్న చికిత్స 

ఇంకొందరు స్పందిస్తే ఆ బాలుడు బడికెళ్తాడు

సూళ్లూరుపేట, జూలై 4: ఒక వార్త వందలాదిమందిని కదిలించింది. మనసు కరిగించింది. రెపరెపలాడుతున్న మోక్షిత్‌ ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగించింది. సూళ్లూరుపేట టైనీటాట్స్‌ సీబీఎ్‌సఈ స్కూల్‌ విద్యార్థి నట్టేటి మోక్షిత్‌ (14) బోన్‌మారో క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయాన్ని ‘అమ్మా బడికెళ్తానే’ అంటూ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. వైద్యానికి అవసరమయ్యే రూ.30 లక్షలు ఎలా సమకూర్చుకోవాలో తెలియక తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల వేదనను అక్షర రూపంలో వెల్లడించింది. ఈ వార్తకు స్పందించిన ఎందరో తల్లిదండ్రులకు ఫోన్‌చేసి వారికి ధైర్యం చెప్పారు. సాయం చేశారు. ఆరోగ్యశ్రీ తిరుపతి జిల్లా అధికారి స్పందించి మోక్షిత్‌ తల్లితో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆరోగ్యశ్రీ పథకం కింద బెంగళూరు వైదేహి ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే చెన్నై అపోలో ఆస్పత్రిలో ఇప్పటికే వైద్యం మొదలైనందున అక్కడినుంచి తరలించడానికి తల్లిదండ్రులు సమ్మతించలేదు. అపోలో యాజమాన్యం కూడా వైద్యానికయ్యే ఖర్చులో రూ.5 లక్షలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని మోక్షిత్‌ తల్లిదండ్రులు తెలిపారు. ఆంధ్రజ్యోతి వార్తను వెబ్‌ ఎడిషన్‌లో చూసిన పలువురు ప్రవాసాంధ్రులు కూడా విరాళాలు పంపుతున్నారు. సోషల్‌ మీడియాలోనూ మోక్షిత్‌ స్థితి గురించి వైరల్‌ కావడంతో పలువురు స్పందిస్తున్నారు. అమెరికా నుంచి 600 డాలర్లు అందాయని, మరో రూ.3.10 లక్షలు తమ అకౌంట్‌లో జమయ్యాయని మోక్షిత్‌ తల్లిదండ్రులు తెలిపారు. ఒక వార్తతో తమ బిడ్డకు ప్రాణం పోస్తున్న ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే మోక్షిత్‌ చదువుతున్న టైనీటాట్స్‌ సీబీఎ్‌సఈ పాఠశాల కరస్పాండెంట్‌ వేనాటి ధనంజయరెడ్డి మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. మరో రెండు లక్షలు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే దాదాపు రూ.10 లక్షలు దాకా పోగైనందున మరి కొందరు దాతలు చేయూతనందిస్తే వైద్యానికి అవసరమైన మొత్తం సమకూరుతుంది. సాయం చేయదలచుకున్నవారు ఫోన్‌ పే ద్వారా మోక్షిత్‌ సోదరుడు నట్టేటి ధను్‌షకుమార్‌కు 72071 86242 విరాళాలు పంపవచ్చు.

Updated Date - 2022-07-05T07:43:12+05:30 IST