విషాదంలోనూ మానవత్వం

ABN , First Publish Date - 2022-01-27T08:10:11+05:30 IST

పుట్టెడు దుఃఖంలోనూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ కుటుంబ సభ్యులు భావించారు.

విషాదంలోనూ మానవత్వం

బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి

అవయవాలు దానం చేసిన కుటుంబీకులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పుట్టెడు దుఃఖంలోనూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ కుటుంబ సభ్యులు భావించారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవాలను దానం చేయడానికి ఒప్పుకుని మానవత్వం చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మణగూరుకు చెందిన బాదవత్‌ శ్రీను (33) కారుడ్రైవర్‌గా పనిచేసేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జనవరి 22న శ్రీను తన అన్నతో కలిసి కొత్తగూడెం వెళుతుండగా రాత్రి 8.30 గంటలకు రోడ్డుకు అడ్డంగా పంది రావడంతో అదుపుతప్పి బైక్‌ పడిపోయింది. వాహనం నడుపుతున్న శ్రీను సోదరుడికి స్పల్పగాయలు కాగా, వెనక కూర్చున్న శ్రీనుకు తలకు బలమైన దెబ్బ తగిలింది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీనును మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు 3 రోజులకు కూడా స్పందించకపోవడంతో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ‘జీవన్‌దాన్‌’ సంస్థ సభ్యులు శ్రీను కుటుంబాన్ని కలిసి అవయవదానం గురించి వివరించి ఒప్పించారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన శ్రీను నుంచి జీవన్‌దాన్‌ ప్రతినిధులు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియా తీసుకున్నారు. ఊపిరితిత్తులను మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించేందుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేశారు. మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.27 గంటలకు బయలుదేరిన అంబులెన్స్‌ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి మధ్యాహ్నం 1.39 గంటలకు (12 నిమిషాల్లో) చేరుకుంది. మరో ఘటనలో  వైజాగ్‌ కిమ్స్‌ ఆస్పత్రి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించగా, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌కు తరలించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు మరో గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి అంబులెన్స్‌ గ్రీన్‌ చానెల్‌ ద్వారా 4 నిమిషాల్లో చేరుకుంది.

Updated Date - 2022-01-27T08:10:11+05:30 IST