2030 నాటికి ప్రతి ఏడాదీ 560 విధ్వంసకర విపత్తులు: ఐరాస

ABN , First Publish Date - 2022-04-26T23:22:01+05:30 IST

న్యూయార్క్ : పర్యావరణ మార్పుల పర్యవసానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి తీవ్ర హెచ్చరిక జారీచేసింది. రానున్న సంవత్సరాల్లో మరింత విధ్వంసకర విపత్తులు భూమిపై పంజా

2030 నాటికి ప్రతి ఏడాదీ 560 విధ్వంసకర విపత్తులు: ఐరాస

న్యూయార్క్ : పర్యావరణ మార్పుల పర్యవసానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. రానున్న సంవత్సరాల్లో మరింత విధ్వంసకర విపత్తులు భూమిపై పంజా విసరబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మహా విపత్తుల తీవ్రత కారణంగా మనుషుల ప్రాణాలతోపాటు జీవనోపాధి అవకాశాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే.. 2030 నాటికి ఏడాదికి 560 విధ్వంసకర విపత్తులు భూమిపై వినాశనాన్ని సృష్టించే  అవకాశాలున్నాయని హెచ్చరించింది. 2015లో గరిష్ఠంగా 400 విపత్తులు నమోదవ్వగా.. రానున్న సంవత్సరాల్లో ఇంతకుమించిన సంఖ్యలో వినాశనాలు ఖాయమని విశ్లేషించింది. విపత్తుల్లో అధికం అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి ప్రకృతికి సంబంధించినవే. అయితే వైరస్ మహమ్మారులతోపాటు రసాయన ప్రమాదాలకు కూడా అవకాశంలేకపోలేదని అలెర్ట్ జారీ చేసింది. విపత్తులు అపారమైన నష్టాలకు కారణమవుతున్నాయని, అభివృద్ధి లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయని ఐరాస రూపొందించిన ఈ శాస్త్రీయ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. 1970- 2000 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 90 - 100 మధ్యతరహా నుంచి  తీవ్ర స్థాయి విపత్తులు నమోదయ్యాయని ప్రస్తావించింది. 


మరోవైపు 2001లో నమోదయిన వేడి గాలుల కంటే మూడు రెట్లు తీవ్రమైన ఉష్ణ గాలులు 2030లో నమోదుకానున్నాయని, జనాలు అల్లాడిపోతారని రిపోర్ట్ హెచ్చరించింది. కరువులు 30 శాతం అధికంగా ఉంటాయని అంచనా వేసింది. విపత్తులంటే కేవలం ప్రకృతి విపత్తులు మాత్రమే కాదని, కొవిడ్-19, ఆర్థిక సంక్షోభాలు, ఆహార కొరతలు ఇవన్నీ పర్యావరణ మార్పుల కారణంగానే సంభవిస్తాయని పేర్కొంది. విపత్తుల విషయంలో మానవులు ముందుచూపుతో వ్యవహరించడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముందస్తు సన్నద్ధత లేకపోవడంతో నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని యూఎన్ రిపోర్ట్ పేర్కొంది. 

Updated Date - 2022-04-26T23:22:01+05:30 IST