370 డిస్పెన్సరీలపై వేటు?

Aug 3 2021 @ 03:45AM

  • 500 లైవ్‌స్టాక్‌ యూనిట్లు సైతం..
  • సీఎం ఆదేశాలతో పశుసంవర్ధకశాఖలో ‘సర్దు’బాట్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పశువైద్యశాలలను హేతుబద్ధం చేయడానికి పశుసంవర్ధకశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పీహెచ్‌సీల తరహాలో మండలానికి ఒకటి లేదా రెండు డిస్పెన్సరీలు ఉంచి, మిగిలినవి ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వెటర్నరీ డిస్పెన్సరీల పరిధులను హేతుబద్ధీకరణ చేసిన ప్రభుత్వం.. పశువైద్యశాలల సర్దుబాటు సాకుతో కొన్ని వెటర్నరీ డిస్సెన్సరీలు, లైవ్‌స్టాక్‌ యూనిట్లను మూసేసి, వాటిని పశువైద్యం అందుబాటులోలేని చోటుకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. అలాగే పశువైద్యులను డిస్పెన్సరీ యూనిట్‌గా.. అదనపు వైద్యులను కొత్త డిస్పెన్సరీల్లో నియమించాలని ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నిర్దేశం మేరకే హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్‌) అమలు చేయనుండటం గమనార్హం. 


మెరుగు పేరుతో తరుగు

రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రులు 2, వెటర్నరీ పాలీక్లినిక్స్‌ 12, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు 323 ఉన్నాయి.  670 మండలాలకు 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు, 1,219 రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు ఉన్నాయి. అయితే, కొన్ని మండలాల్లో ఆరేడు డిస్పెన్సరీలు ఉండగా, కొన్ని మండలాల్లో ఒక్కటీ లేదు. అలా వెటర్నరీ డిస్పెన్సరీలు లేని మండలాలు 6 ఉన్నాయి. మండలానికి ఆరేడు ఉన్న డిస్పెన్సరీలను.. అసలు పశువైద్యం లేని గ్రామాలకు తరలించడమే ప్రత్యామ్నాయమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్ల హేతుబద్ధత సూత్రాన్ని పాటించి, పశువైద్యసంస్థలు, పశువైద్యులను సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో దాదాపు 370 డిస్పెన్సరీలు, 500కుపైగా గ్రామీణ లైవ్‌స్టాక్‌ యూనిట్లకు మంగళం పాడే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


పశుసంవర్ధకశాఖలో హేతుబద్ధీకరణపై ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రజావైద్యానికి అనుసరిస్తున్న ప్రోటోకాల్‌ ప్రకారం మండలానికి రెండు పీహెచ్‌సీలు, రెండు అంబులెన్స్‌లు ఉండాలన్న ప్రతిపాదన మాదిరిగానే పశువైద్యంలోనూ ఉండాలి. గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో ఏయే డిస్పెన్సరీలు ఉండాలన్న దానిపై హేతుబద్ధత ఉండాలి. దానికి కార్యాచరణ రూపొందించాలి. తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలి. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని, కావాల్సిన డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలున్నాయి. వీటిని కూడా మ్యాపింగ్‌ చేయాలి’ అని సీఎం నిర్దేశించారు. ఆ మేరకే పశుసంవర్ధకశాఖలో డిస్పెన్సరీల తరలింపు, డాక్టర్ల సర్దుబాటు షురూ కానున్నట్లు సమాచారం. సర్దుబాటు ఏవిధంగా చేయాలన్న అంశాలు,క్షేత్రస్థాయి సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రాథమిక సమావేశాలునిర్వహిస్తున్నారు. త్వరలో రాష్ట్రస్థాయిలోనూ శాఖాపరమైన వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు చెప్తున్నారు. 


ఖాళీగా 200 డాక్టర్‌ పోస్టులు 

పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ డిస్పెన్సరీల పరిధులను హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం గత మే 27న జీవో 131 జారీ చేసింది. అలాగే సీఎం సమీక్షలో 3,117 పశువైద్య సంస్థల అధికార పరిధిని హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు. గ్రామ సచివాలయాల్లోని పశుసంవర్ధక సహాయకులను ఉపయోగించుకుని, పశువైద్య వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్దేశించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక సహాయకులు 10,641 మంది కావాల్సి ఉండగా, 4,506 మందిని ప్రస్తుతం నియమించారు. ఇంకా 6,135 మందిని ఫేజ్‌-3లో నియమించాల్సి ఉంది. అలాగే 1,785 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్స్‌ 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్‌ పోస్టుల ఫైల్‌ ఆర్థికశాఖలో పెండింగ్‌లో ఉంది. రెగ్యులర్‌ ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులు 1,576 ఉండగా, అందులో ఖాళీలను ఔట్‌సోర్సింగ్‌తో భర్తీ చేయడానికి ప్రతిపాదించారు. 3,177 మంది పారా వెటర్నరీస్‌, 2,603 మంది గోపాలమిత్ర ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతివ్వాల్సి ఉంది. డిస్పెన్సరీలను హేతుబద్ధీకరించాలంటే డాక్టర్‌పోస్టులతో సహా సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆర్థికశాఖ అనుమతి లభిస్తే కానీ పోస్టుల భర్తీ సాధ్యం కాదు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.