ఏబీవీపై మళ్లీ వేటు!

ABN , First Publish Date - 2022-06-29T08:08:57+05:30 IST

ఏబీవీపై మళ్లీ వేటు!

ఏబీవీపై మళ్లీ వేటు!

సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు

ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని అభియోగం

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 14నే ఆయనకు పోస్టింగ్‌

ప్రింటింగ్‌-స్టేషనరీ కమిషనర్‌గా నియామకం

2 వారాలు తిరక్కుండానే తిరిగి సస్పెన్షన్‌


అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌, డీజీ స్థాయి  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్‌ వేటు వేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక అమలు చేయాల్సిన పరిస్థితిలో ఈ నెల 14న ఆయన్ను ప్రాధాన్యం లేని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ పోస్టులో నియమించింది. రెండు వారాలు కూడా తిరక్కుండానే సస్పెండ్‌ చేసింది. 1969 ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించారంటూ సబ్‌ రూల్‌ 3, రూల్‌ 3 ప్రకారం ఏబీవీని సస్పెండ్‌ చేస్తూ మంగళవారం రాత్రి సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా ఉంటూ ఇజ్రాయెల్‌ నుంచి రక్షణ పరికరాల కొనుగోలుకు.. ప్రభుత్వ అనుమతి లేకుండా తన వాళ్లకు సంబంధించిన ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు 2018 అక్టోబరు 31న రూ.35 లక్షలు చెల్లించారనే అభియోగం మోపిన జగన్‌ ప్రభుత్వం.. 2021 ఫిబ్రవరి 7న సస్పెండ్‌ చేసి.. అదే నెల 18న ఏబీవీపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)తో కేసు నమోదు చేయించింది. నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, మోసం తదితర సెక్షన్ల కింద అభియాగాలు మోపి విచారణ చేపట్టింది. తనను అన్యాయంగా దురుద్దేశంతో ఇందులో ఇరికించారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించడంతో రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. వెంకటేశ్వరరావు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును అమలు చేయాలని 2022 ఏప్రిల్‌ 22న స్పష్టం చేసింది. ఫిబ్రవరి 8 నుంచే ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ జీత భత్యాలు చెల్లించాలని స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ రెండేళ్లు పైబడిన తర్వాత ఏ అధికారినీ పోస్టింగ్‌ లేకుండా ఉంచరాదన్న సర్వీస్‌ రూల్స్‌ గుర్తు చేస్తూ తనకు పోస్టింగ్‌ ఇవ్వాలంటూ సీఎ్‌సను కోరిన ఏబీవీ.. మే 19న జీఏడీలో రిపోర్ట్‌ చేశారు. చివరకు జూన్‌ 14న ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. తనపై ఉన్న ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఇప్పుడు మళ్లీ సస్పెండ్‌ చేసింది. ఏసీబీ కేసు దర్యాప్తులో ఉన్నందున ప్రభుత్వం విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకుందని.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని సీఎస్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-29T08:08:57+05:30 IST