ఫ్లోరిడాలో హరికేన్‌ విధ్వంసం

ABN , First Publish Date - 2022-09-30T06:39:23+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ తీవ్ర విధ్వంసం సృష్టించింది. గురువారం రోజంతా వర్షం కురవడంతో వరద బీభత్సం సృష్టించింది.

ఫ్లోరిడాలో హరికేన్‌ విధ్వంసం

అమెరికాను తాకిన ఐదో అతిపెద్ద హరికేన్‌ ‘ఇయన్‌’

తీరానికి కొట్టుకొచ్చిన షార్క్‌లు


సెయింట్‌పీటర్స్‌బర్గ్‌, సెప్టెంబరు 29: అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ తీవ్ర విధ్వంసం సృష్టించింది. గురువారం రోజంతా వర్షం కురవడంతో వరద బీభత్సం సృష్టించింది. అలలు ఉధృతంగా ఎగిసిపడడంతో సముద్రం నుంచి షార్క్‌లు తీరానికి కొట్టుకువచ్చాయి. క్యూబా వలస దారులతో వస్తున్న ఓ పడవ మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 23 మంది గల్లంతయ్యారు. వీధులన్నీ నదులుగా మారిపోయాయి. సుమారు 25 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అమెరికాను తాకిన అతిపెద్ద హరికేనుల్లో ఇది ఐదోదని చెబుతున్నారు. అత్యంత వేగంగా గాలులు వీస్తుండడంతో విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. శార్లెట్‌ హార్బర్‌ నుంచి బొనిటా బీచ్‌ వరకు నైరుతి ఫ్లోరిడాలో ఎనిమిది నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. గల్ఫ్‌ తీరంలో కొంత భూభాగం నీటిలో మునిగిపోయింది.




హరికేన్‌ తీరం దాటిన తర్వాత కొంత బలహీనపడినప్పటికీ మళ్లీ కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ వద్ద అట్లాంటిక్‌ జలాల్లోకి ప్రవేశించడంతో బలం పుంజుకుందని హరికేన్‌ సెంటర్‌ వెల్లడించింది. 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. 1921 తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో హరికేన్‌ ఏర్పడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. హరికేన్‌ కేంద్రం అట్లాంటిక్‌ సముద్రంలోనే కొనసాగుతుండడం వల్ల మరింత వర్షపాతం నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-09-30T06:39:23+05:30 IST