కాటికి కూడా కలిసే..

ABN , First Publish Date - 2022-10-01T18:13:23+05:30 IST

కడ వరకూ తోడుంటానని పెళ్లి నాట ఒకరికొకరు చేసిన ప్రమాణాన్ని ఆ దంపతులు తప్పలేదు. ఐదుగురు బిడ్డలను పెంచి

కాటికి కూడా కలిసే..

భార్య మృతిచెందిన కొన్ని గంటల్లోనే భ ర్త మృతి

హైదరాబాద్/కవాడిగూడ: కడ వరకూ తోడుంటానని పెళ్లి నాట ఒకరికొకరు చేసిన ప్రమాణాన్ని ఆ దంపతులు తప్పలేదు. ఐదుగురు బిడ్డలను పెంచి పోషించారు. సుమారు యాభై ఏళ్ల సంసార జీవితంలో కష్టమైనా, నష్టమైనా కలిసే నడిచారు. చివరకు కాటికి కూడా..! గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతుల మరణం ఆ బస్తీలో విషాదాన్ని నింపింది. భార్య మృతితో మనోవేదనకు గురైన భర్త తెల్లాసేసరికి తానూ తుదిశ్వాస విడిచాడు. 

మారుతీనగర్‌కు చెందిన రాచకొండ లింగయ్య (75), భూలక్ష్మి (70) దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు. ఏడేళ్ల క్రితం కుమారుడు చనిపోయాడు. భూలక్ష్మి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసేవారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భార్య చనిపోవడంతో లింగయ్య మనుసులోనే కుమిలిపోయా రు. భాగస్వామి లేని లోటును భరించలేకపోయారు. రాత్రంతా మనోవేదనకు గురైన లింగ య్య శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లు దాంపత్య జీవనం సాగించిన దంపతులు గంటల వ్యవధిలో చనిపోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను కలిచివేసింది. అన్యోన్యంగా జీవితం సాగించిన వారు మరణంలో కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారని తలుచుకుంటూ బస్తీవాసులు సైతం కన్నీరుమున్నీరు అయ్యారు. భౌతిక కాయాలను ఒకే వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. బన్సీలాల్‌పేటలోని హిందూ శ్మశాన వాటికలో మనవడు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

Updated Date - 2022-10-01T18:13:23+05:30 IST