Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద

ABN , First Publish Date - 2022-07-25T21:11:50+05:30 IST

హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar)కు భారీగా వరద వస్తోంది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం దాటింది. సాగర్ పూర్తి నీటిమట్టం

Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ (Hussain Sagar)కు భారీగా వరద వస్తోంది. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం దాటింది. సాగర్ పూర్తి నీటిమట్టం 513.41 మీటర్లు, ప్రస్తుతం 513.44 మీటర్ల వరకు నీరు ఉంది. హుస్సేన్‌సాగర్ నీటి మట్టం పెరుగుతుండడంతో 1,788 క్యూసెక్కులు మూసీనది (Musi River)లోకి విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలతో గ్రేటర్‌ (Greater)లోని పలు ప్రాంతాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. కొన్ని పొంగి పొర్లుతున్నాయి. మీరాలం చెరువు నిండి పొంగిపొర్లడంతో జూలోని సఫారీ పార్కులోకి భారీగా వరద నీరు చేరింది. జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌కు భారీ ఎత్తున వరద నీరు చేరింది. బాచుపల్లి (Bachupally) లోని బయన్‌ చెరువు, నిజాంపేటలోని తుర్క చెరువు, పాపయ్యకుంట, మల్లంపేట్‌లోని కత్వ చెరువు, దుండిగల్‌లోని పెద్ద చెరువు, చిన దామెర చెరువు, కొంపల్లిలోని ఊర చెరువు, దూలపల్లిలోని తుమ్మార్‌ చెరువు, జీడిమెట్ల వెన్నెలగడ్డ చెరువులు నిండుకుండలా ఉన్నాయి. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని రంగధాముని చెరువులో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 

Updated Date - 2022-07-25T21:11:50+05:30 IST