హుజురాబాద్ ఉప ఎన్నికతో మా ప్రభుత్వం కూలదు: కేటీఆర్

ABN , First Publish Date - 2021-08-24T23:12:48+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికతో మా ప్రభుత్వం కూలదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికతో మా ప్రభుత్వం కూలదు: కేటీఆర్

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికతో తమ ప్రభుత్వం కూలదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీఆర్ఎస్ పుట్టిన తర్వాత అనేక ఎన్నికలు ఎదుర్కొంది అందులో ఒకటి హుజురాబాద్. అదొక చిన్న ఉప ఎన్నిక ఆ ఎన్నికతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలదు, తాము కేంద్రంలో అధికారంలోకి రాము ఆ ఎన్నిక ఓ లెక్క కాదు’’ అని కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ద్విదశాబ్ధ కాలం పూర్తి చేసుకుందన్నారు.రెండు దశాబ్దాల చరిత్రలో టీఆర్ఎస్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిందని తెలిపారు. సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉంటున్నారన్నారు.హైదరాబాద్, వరంగల్ మినహా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలను దసరా రోజు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనానికి సెప్టెంబర్ 2న కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హాజరవుతారన్నారు. సెప్టెంబర్ 2న గ్రామ కమిటీల నిర్మాణం చేపడతామన్నారు. మండల, పట్టణ, వార్డు మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లోనే పూర్తి చేస్తామని చెప్పారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు కమిటీలు వేసే బాధ్యతలు అప్పగిస్తామన్నారు.నవంబర్‌లో టీఆర్ఎస్ ద్విదశాబ్ధి వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.  కొత్త కార్యవర్గం వార్షికోత్సవ సభ తేదీని నిర్ణయిస్తుందన్నారు. 


కరెంటు, తాగునీళ్లు ఇవ్వని దద్దమ్మలు కూడా ఈరోజు దళిత బంధు మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేదరిక నిర్మూలన దారిద్ర్య రేఖకు దిగువ నుంచే మొదలవుతుందన్నారు. దళితులే కడు పేదరికంలో ఉన్నారన్నారు. వారిని పైకి తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. 20రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ 4రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ కూడా దమ్ముంటే దళిత బంధు తీసుకురావాలని సవాల్ విసిరారు. పనికిమాలిన ప్రతిపక్షాల పిచ్చి ప్రేలాపణలు పట్టించుకోమని కేటీఆర్ అన్నారు. 

Updated Date - 2021-08-24T23:12:48+05:30 IST