Huzurabad : ఈటలదే గెలుపని Exit Polls తేల్చినా.. అనుమానమే..!

ABN , First Publish Date - 2021-11-02T12:24:25+05:30 IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నది.

Huzurabad : ఈటలదే గెలుపని Exit Polls తేల్చినా.. అనుమానమే..!

కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నది. హోరాహోరీ జరిగిన పోరులో నువ్వానేనా..? అన్నట్లు పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ భవితవ్యం నేడు తేలిపోనున్నది. పోలింగ్‌ సందర్భంగా వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఒకటి మినహా అన్ని సంస్థలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించనున్నారని తేల్చిచెప్పాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలన్నీ బీజేపీవైపే మొగ్గు చూపిస్తున్నా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


ఎవరి ధీమా వారిది..!?

సైలెంట్‌ ఓటర్‌ ఎటువైపు మొగ్గు చూపారు, ఆనవాయితీగా ప్రభుత్వ వ్యతిరేకతతో ఆ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి మౌనంగా ఉన్నాడా..?, లేక డబ్బుల ప్రభావంతో సైలెంట్‌గా ఓటేశారా..? అనే చర్చ జోరుగా సాగుతున్నది. 30 వేల మెజార్టీతో గెలుస్తామన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పోలింగ్‌  జరిగిన తర్వాత 15 వేల ఆధిక్యతతో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఇరు పార్టీలలో కూడా గెలుపు ధీమా వ్యక్తమవు తున్నది. మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపులో విజేత ఎవరో తేలిపోనున్నది. 


నియోజకవర్గంలో 2,36,873 ఓట్లు ఉండగా గత నెల 30న జరిగిన పోలింగ్‌లో 2,05,236 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగిం చుకున్న వారిలో 1,02,523 మంది పురుషులు కాగా, 1,02,712 మంది మహిళలు, ఒక థర్డ్‌ జెండర్‌ ఓట రు ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ 2.01 శాతం అధికంగా జరిగింది. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 84.63 శాతం పోలింగ్‌ జరుగగా, ఈసారి 86.64 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకటనర్సింగారావుతోపాటు మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Updated Date - 2021-11-02T12:24:25+05:30 IST