బీజేపీ ఉద్యోగాలు ఇవ్వలే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టింది

ABN , First Publish Date - 2021-03-01T09:10:50+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదని, పైగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

బీజేపీ ఉద్యోగాలు ఇవ్వలే ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టింది

ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే

గోబెల్స్‌ ప్రచారం చేస్తున్న వారిని నిలదీయండి: హరీశ్‌

రంగారెడ్డి అర్బన్‌/వికారాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వలేదని, పైగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇంచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఎ్‌సఎన్‌ఎల్‌లో 50 వేల ఉద్యోగులను తీసివేశారని, బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఆర్డీనెన్స్‌ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను దేశవ్యాప్తంగా మూసివేస్తోందని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరుతూ.. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో, వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రభుత్వం మూసివేస్తే నష్టం జరిగేది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకేనని తెలిపారు. నేడు తెలంగాణ సర్కార్‌ 1.34లక్షల ఉద్యోగాలు ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు ఊడగొడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంకా 20వేల ఉద్యోగాల భర్తీ రేపోమాపో చేయనున్నట్లు తెలిపారు. గిరిజన వర్సిటీని, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి పట్టభద్రులు బీజేపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పే బీజేపీ నేతల మాటలను తిప్పికొట్టాలని, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం కోతలు విధించిందని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ధరలపై వాతలు పెట్టిందని ఆయన అన్నారు. 

Updated Date - 2021-03-01T09:10:50+05:30 IST